ఆర్మీ ఆయుధాలు కేసులో కీలక పరిణామం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల (Army weapons) చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చోరీకి గురైన ఆయుధాలను (మ్యాగజైన్స్, బుల్లెట్స్, బైనార్కులర్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ అధికారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు విచారణ చేస్తున్నారు. మహబూబ్నగర్ (Mahabubnagar) లోని ఓ విశ్రాంత ఆర్మీ అధికారి (Army officer) ఇంట్లో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ఛార్జ్, బుల్లెట్స్ ఇచ్చే ఆమ్నిషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ సహకారంతో చోరీ జరిగినట్లు తెలిసింది.
మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాలు భద్రపరిచే గది వద్ద ఇన్ఛార్జితో పాటు వెపన్స్ జారీ చేసే డిపార్ట్మెంట్కు మరో ఇన్ఛార్జి ఉంటారు. వీరిద్దరి సహకారంతోనే రిటైర్డ్ ఆర్మీ అధికారి చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు (Police) మాత్రం ఎలాంటి వివరాలను వెల్లడించడం లేదు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ (Malkajgiri Police Commissioner) ఆర్మీ అధికారులతో కలిసి ఇవాళ సాయంత్రం లేదా రేపు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.








