జీవితం అర్థం కావడం లేదా? నీమ్ కరోలి బాబా మాటలు వినండి, క్లారిటీ వస్తుంది
—సూర్య ప్రకాష్ జోశ్యుల
జీవితంలో ఎన్నో వింటూంటాం. వాటిలో కొన్ని మనం విన్న వెంటనే మర్చిపోతాం. మరికొన్ని మాత్రం మనసులో ఎక్కడో ఉండిపోతాయి. ఆ మాటలకు తగ్గ పరిస్థితి ఎదురైనప్పుడల్లా అవే మాటలు గుర్తొచ్చి ముందుకు నడిపిస్తాయి. అలా మనస్సుకు హత్తుకునేలా ఆధ్యాత్మిక భోదనలో భాగంగా ఆనందమయ జీవితం గురించి నీమ్ కరోలి బాబా కొన్ని మాటలు చెప్పారు. ఏవో పెద్ద పెద్ద తత్వశాస్త్రాలు చెప్పకుండా, మన రోజువారీ జీవితాన్ని చూస్తూనే అర్థమయ్యేలా ఆయన చెప్పిన విషయాల్లో ఒక ప్రత్యేకమైన సరళత ఉంటుంది.
భక్తులు ప్రేమగా మహారాజ్జీ అని పిలిచే ఆయన హిమాలయ ప్రాంతానికి చెందిన ఆధ్యాత్మిక గురువు. 1973లో పరమాత్మలో ఐక్యమైన ఆయన బోధనల్లో “సబ్ ఏక్ — అందరూ ఒక్కటే” ప్రాముఖ్యమైనది. కరోలీ బాబా ఆశ్రమం నైనితాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోగల పంత్‌నగర్‌లో ఉంది.
మనకు కనిపించేదంతా నిజం కాదు
బాబా దృష్టిలో మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం ఒక రకమైన మాయ. మన ఐదు ఇంద్రియాలు మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. కానీ అవే ఇంద్రియాలు మనల్ని బయట కనిపించే విషయాలకే కట్టిపడేస్తాయి. అందుకే వాటిని కేవలం సుఖాల కోసం కాకుండా, మనలోని ఉన్నతమైన లక్ష్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ముందేం జరుగుతుందో తెలియదు
జీవితంలో ఏం జరుగుతుందో వెంటనే అర్థం కాకపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా జీవిత ప్రయాణంపై నమ్మకం ఉంచాలని బాబా బోధించారు. ముందున్న దారి స్పష్టంగా కనిపించకపోయినా, ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్లాలి. మనం చేసిన తప్పుల్ని చూసి బాధపడుతూ అక్కడే ఆగిపోవడం కంటే, వాటి నుంచి ఒక పాఠం తీసుకుని మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ముఖ్యం. ఎందుకంటే ఎదర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనకు తెలియదు కదా అనేవారు.
ఆ బరువుని దింపుకోండి
మనసులో ఒకరిపై కోపాన్ని, ద్వేషాన్ని మోస్తూ తిరిగితే ఆ భారాన్ని మోసేది చివరికి మనమే. అందుకే బాధపెట్టినవారిపట్ల కూడా దయ, కరుణ, ప్రేమను ఉంచాలని ఆయన సూచించారు. ప్రేమే ద్వేషం కంటే శక్తివంతమైనదని నీమ్ కరోలి బాబా ఎప్పుడూ చెప్పేవారు.
ముందు మనసును శుభ్రం చేసుకోవాలి
మన హృదయం ఒక అద్దంలాంటిదని భావిస్తే, దానిపై స్వార్థం, భౌతిక కోరికలు, చెడు ఆలోచనలు పేరుకుపోతే మనలోని నిజమైన రూపం కనిపించదు.ఇతరుల కోసం నిస్వార్థంగా ఏదైనా చేయడం, ప్రేమతో జీవించడం మొదలుపెడితే మనలోని దైవత్వాన్ని మనమే గుర్తించగలుగుతామని ఆయన బోధించారు.
సమాధానం కోసం ఎప్పుడూ బయటే దొరకదు
మనసులో ఎప్పుడూ కోరికలు, భయాలు, ఆందోళనలు, ఇతరుల అభిప్రాయాలే నిండిపోయి ఉంటే మన అంతరాత్మ మాట వినిపించదు. కొంతసేపు మనలోకి మనం చూసుకోవాలి. మనం నిజంగా ఏం కోరుకుంటున్నాం, ఏది మనకు అవసరం, ఏది కేవలం ప్రపంచం మనపై రుద్దిన కోరిక—ఇవన్నీ ఆలోచించాలి. అలా మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక రకమైన స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత బయట నుంచి ఎవరూ ఇచ్చేది కాదు; మనలో నుంచే పుడుతుంది.
ఆగిపోతే అనుబంధాలు పెరుగుతాయి
నది ప్రవహిస్తూనే ఉంటే దానిలో మురికి, మట్టి ఒకచోట పేరుకుపోదు. కానీ నీరు ఒకే చోట నిలిచిపోతే క్రమంగా మలినం చేరుతుంది. మనిషి జీవితం కూడా కొంతవరకు అలాంటిదేనని, ఒక చోటే ఆగిపోకూడదని నీమ్ కరోలి బాబా చెప్పేవారు.
ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు
మనిషి ఎంత కష్టసమయంలోనైనా ఆందోళనకు లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. కాలం ఎంత కఠినంగా ఉన్నా, ఏదో ఒకరోజు మార్పంటూ వస్తుంది. అందుకే ఎవరైనా విపత్కర పరిస్థితుల్లోనూ శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
డబ్బును సక్రమంగా వినియోగించాలి
ప్రతీ ఒక్కరూ డబ్బును సక్రమంగా వినియోగించాలి. అటువంటివారే గొప్పవారు అవుతారు. డబ్బు సంపాదించడంలోనే గొప్పదనం లేదని, దానిని సరిగా ఖర్చు చేయడంలోనే ఘనత ఉందని ఆయన అన్నారు. ఇతరులను ఆదుకునేందుకు డబ్బును వెచ్చించాలి. అప్పుడే మనిషి దగ్గర ధనం నిలుస్తుంది.
హనుమంతుని పూజించండి
నీమ్ కరోలీ బాబా హనుమంతునిపై తన భక్తిని ఎప్పుడూ చాటేవారు. బాబాను హనుమంతుని అవతారం అని కూడా అంటుంటారు. ఎవరైతే ప్రతీరోజు హనుమంతుని పూజిస్తారో వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నీమ్ కరోలీ బాబా తెలిపారు. ప్రతీవ్యక్తి రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తే ధైర్యం వస్తుందని బాబా బోధించారు.








