లవ్ బ్రేకప్‌తో బయటపడిన పేపర్ లీక్ స్కామ్! ప్రియురాలు పాస్.. అసలు గుట్టు రట్టు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కొన్ని ప్రేమకథలు పెళ్లితో ముగుస్తాయి. మరికొన్ని బ్రేకప్‌తో ముగుస్తాయి. కానీ మహారాష్ట్రలో ఓ ప్రేమకథ మాత్రం ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో జరిగిన పేపర్ లీక్‌ను బయటపెట్టడంతో ముగిసింది. ప్రేమ ఉన్నప్పుడు ఒకరితో ఒకరు పంచుకున్న రహస్యాలు.. ప్రేమ ముగిసిన తర్వాత పోలీసుల చేతికి వెళ్లాయి. చివరికి ఆ రహస్యాల్లో ఒకటి ప్రభుత్వ పరీక్షనే రద్దు చేసేంత పెద్దదిగా మారింది. అదేంటో చూద్దాం.
కథలో హీరోయిన్ రుతుజా పాటిల్. హీరో లోకేశ్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్. వీళ్లిద్దరూ చాలా కాలం ప్రేమలో మునిగితేలారు. పెళ్లి తర్వాత లైఫ్ బాగుండేందుకు చక్కగా పోటీ పరీక్షలకు సైతం హాజరు అయ్యేవారు. ఈ విషయంలోనూ ఇద్దరూ ఒకరికొకరు పోటీగా ఉండేవారు. చక్కగా ప్రిపేర్ అయ్యేవారు. ప్రేమ పాఠాలుతో పాటు ఈ పోటీ పరీక్షల పాఠాలు కూడా బాగానే ఒకరికొకరు చెప్పుకునేవారు. అంతదాకా కథ బాగానే ఉంది. లోకం హర్షించేలా ఉంది. అయితే ఆ తర్వాతే అసలు మేటర్ మలుపు తిరిగింది.
మార్చి 22న మహారాష్ట్రలోని ఆరు డివిజన్ల పరిధిలో డ్రగ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి) నియామకం కోసం ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్సీ) నిర్వహించింది. అయితే ఇందులోనూ కాస్తంత డబ్బులు చేసుకుందామనుకునేవాళ్లు ఎప్పటిలాగే పేపరు లీక్ స్కామ్ మొదలెట్టారు. మార్కెట్ లో పరీక్షా పేపరు ని ముందే కొనుక్కుని తన కూతురుకి ఇస్తే ఆమె పాస్ అయ్యి ఉద్యోగం కొడుతుంది కదా,లైఫ్ సెట్ అయ్యిపోతుంది కదా అని, రితుజా పాటిల్ తండ్రి అమృత్ పాటిల్ ఆలోచించాడు.
దాంతో ఉత్సాహవంతుడైన ఆయన కష్టపడి ఎంక్వైరీ చేసి, డబ్బులు ఖర్చుపెట్టి నందుర్బార్కు చెందిన కౌటిల్య కోచింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడైన ప్రవీణ్ పాటిల్ నుంచి ప్రశ్నపత్రాన్ని కొన్నాడు. అసలు ఆ కోచింగ్ సెంటర్ వాళ్లు మొదటే మీ పిల్లలను మా దగ్గర చేర్పిస్తే ..ఉద్యోగం వచ్చేసినట్లే…ఎందుకంటే పేపరు లీక్ ఎలా చేయాలో మాకు తెలుసు అని మొదటే చెప్పి,హామీ ఇచ్చి పిల్లలను చేర్పించుకున్నారట.
వాళ్లు మాట తప్పే మనుష్యులు కాదు. అందుకు వాళ్లు పెద్ద నెట్ వర్క్ నే ఏర్పాటు చేసుకోవాల్సివచ్చింది. పోలీస్ లు చెప్పిన దాని ప్రకారం మొదట MPSC ఆఫీస్ లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విశ్వేశ్వర్ దత్తాత్రయ్ నకాటే ప్రశ్నలను సంపాదించి అబ్జిత్ లెండవే అనే అండర్ సెక్రటరీకి ఇచ్చారు. అక్కడి నుంచి అవి మరో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గోపాల్ మరాఠేకు, ఆయన ద్వారా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్ పాటిల్‌కు చేరాయి.
ఆ తర్వాత ప్రవీణ్.. రుతుజా తండ్రి అమృత్ నమ్‌దేవ్ పాటిల్‌కు ప్రశ్నల సెట్ ఇచ్చి రూ.5 లక్షలు వసూలు చేసారు. అలా మొత్తానికి ఓ తండ్రి తన కూతురు కోసం లీక్ పేపర్లను తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి. చక్కగా చదువుకుని ఉద్యోగం కొట్టాలి. తనకి, తన కుటుంబానికి పేరు తేవాలి. కానీ ఆ అమ్మాయి మరోలా ఆలోచించింది.
ఆ లీకైన పేపర్లుని ఆ అమ్మాయి ఒక్కత్తీ చదువుకోవాలనిపించలేదు. తన ప్రేమించిన లోకేష్ కు కూడా షేర్ చేసింది. ఆ అమ్మాయి ఉద్దేశ్యం గొప్పదే. ఇద్దరూ ఆ ఎగ్జామ్ లో పాసైతే చక్కగా ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా అని. అంతదాకా హ్యాపీగానే జరిగింది.
లీక్ పేపర్ల నుంచి లాకప్ దాకా ?
డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష మార్చి 22న జరిగింది. అయితే రుతుజా తండ్రికి మార్చి 20నే ప్రశ్నల సెట్ అందినట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అలాగే ముందుగా లీకైన ప్రశ్నల సెట్లోని 77 ప్రశ్నలు, అసలు పరీక్షలో వచ్చిన 294 ప్రశ్నల్లో ఉన్నాయి. దాంతో రుతుజా ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. జూలై 22న తుది ఫలితాలు ప్రకటించగా మొత్తం 488 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
పాస్ అయిన తర్వాత ప్రేమకు బ్రేక్
ఇక్కడే ఈ కేసులో అత్యంత షాకైన మలుపు వచ్చింది. రుతుజా పాస్ కావటం, అతను ఫెయిల్ అవటంతో , ఆమెకు ఉద్యోగం వస్తుందని అర్దమైంది. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అంతే కాదు రుతుజా కుటుంబం వారి ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె గౌరవ్‌కు దూరమై, చివరకు సంబంధాన్ని తెంచుకుంది. బ్రేకప్ చెప్పేసింది.
ప్రేమ ముగిసింది.. ఫిర్యాదు మొదలైంది.
బ్రేకప్ తర్వాత గౌరవ్ కు సహజంగానే మండుతుంది కదా. ఇంతకు ముందు రోజుల్లో అయితే ప్రేమ లేఖలు, లవ్ మేకింగ్ వీడియోలు గట్రా దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసేవారు. ఇప్పుడు ఈ కుర్రాడు ఓ అడుగు ముందుకు వేసి, ఆమెకు ఉద్యోగం రాకుండానే చెయ్యాలనుకున్నాడు. అంతే MPSCకి పరీక్ష పేపర్ లీక్ అయిందని ఈమెయిల్ పంపి ఆరోపించాడు. తన దగ్గర ఉన్న ఆధారాలు బయిటపెట్టేసాడు. అతడి ఫిర్యాదే దర్యాప్తుకు కీలకమైన ట్రిగ్గర్‌గా మారి పోలీసులు సీన్ లోకి వచ్చారు.
అయితే తర్వాత గౌరవ్ రియలైజ్ అయ్యి… తన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కేసు ముందుకు వెళ్లిపోయింది. పోలీస్ లు స్పీడ్ అయ్యిపోయారు.
ఆరుగురి అరెస్టు
ఆగస్టు 26న ఈ కేసులో ఆరుగురిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో MPSC అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు విశ్వేశ్వర్ దత్తాత్రయ్ నకాటే, గోపాల్ భట్టు మరాఠే, అండర్ సెక్రటరీ అబ్జిత్ గణపత్రావ్ లెండవే, కౌటిల్య అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ దిలీప్ పాటిల్, రుతుజా తండ్రి అమృత్ నమ్‌దేవ్ పాటిల్, ఆమె మాజీ ప్రియుడు లోకేశ్ అలియాస్ గౌరవ్ రాజేంద్ర పాటిల్ ఉన్నారు.
వీరిపై మహారాష్ట్ర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్) చట్టం-2024, అవినీతి నిరోధక చట్టం-1988తో పాటు మోసం, నమ్మకద్రోహం, నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించిన నిబంధనల కింద కేసులు నమోదయ్యాయి.
ఆరుగురినీ కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 2 వరకు పోలీస్ కస్టడీకి పంపినట్లు నివేదికలు తెలిపాయి.
చివరికి మొత్తం పరీక్షే రద్దు
ఈ వ్యవహారం బయటపడటంతో MPSC డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామక ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసింది. అయితే ఇవన్ని ప్రస్తుతానికి పోలీస్ లు చేస్తున్న ఆరోపణలే. కోర్టులో నిరూపించాల్సి ఉంది.
వెరైటీ నిరసన
ఈ వెరైటీ కథనానికి తగినట్లే…వెరైటీ నిరసన కూడా జరిగింది. నాగ్‌పూర్‌లోని సంవిధాన్ చౌక్‌లో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రేమికుల జంట విడిపోవడం వల్లే ఎంపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ లీక్ బయటపడిందని పేర్కొంటూ ప్లకార్డ్ లు పట్టుకున్నారు. ‘రితుజ, గౌరవ్’కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లను ప్రదర్శించారు. ఆ ప్రేమికుల జంట విడిపోకపోయి ఉంటే పరీక్షల అవకతవకల వెనుక ఉన్న పూర్తి నిజం ఎప్పటికీ వెలుగులోకి వచ్చి ఉండేది కాదని విద్యార్థులు తెలిపారు.
బ్రేకప్ ..కూడా ఒక్కోసారి స్కామ్ లు బయిటపెడుతుంది
ఈ కథలో విచిత్రమైన విషయం ఏమిటంటే.. పేపర్ లీక్‌ను బయటపెట్టింది ఎలాంటి అధికారిక ఆడిట్ కాదు. పరీక్షలో వచ్చిన అసాధారణ ఫలితాల విశ్లేషణ కూడా కాదు. ఒక బ్రేకప్ తర్వాత వెళ్లిన ఈమెయిల్.
ప్రేమలో ఉన్నప్పుడు షేర్ చేసుకున్న విషయాలు.. ప్రేమ ముగిసిన తర్వాత ఫిర్యాదుగా మారాయి. ఆ ఫిర్యాదు దర్యాప్తుకు దారి తీసింది. దర్యాప్తు ఆరుగురి అరెస్టుకు దారితీసింది. చివరికి వందల మంది అభ్యర్థులు రాసిన పరీక్ష మొత్తం రద్దయింది. మొత్తానికి మహారాష్ట్రలో ఓ ప్రేమకథ చివరికి ప్రేమతో కాదు.. ఒక పేపర్ లీక్ కేసుతో ముగిసింది.








