‘అవతార్’పై చిత్రమైన కేసు: హాలీవుడ్లో ‘ హ్యూమన్ స్పేర్ పార్ట్స్ మార్కెట్’ మొదలైందా?
ఇన్నాళ్లూ మనం ‘హ్యూమన్ స్పేర్ పార్ట్స్ మార్కెట్’ అంటే అదో పెద్ద మెడికల్ మాఫియా అని, ఆసుపత్రులు, అవయవ మార్పిడి చుట్టూనే ఉండే వైద్య ప్రపంచానికి చెందిన పదంగా అనుకున్నాం. మనిషి శరీరంలోని ఒక భాగం మరొకరికి అవసరం కావడం… దానికి కోట్ల రూపాయల విలువ ఉండటం అక్కడే చూశాం. కానీ ఇప్పుడు అదే ఆలోచన హాలీవుడ్‌కూ పాకుతోందా? వినడానికి కాస్త విచిత్రంగా ఉండొచ్చు.
అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా ఫ్రాంచైజీలలో ఒకటైన ‘అవతార్’పై తాజాగా వచ్చిన కేసు ఇప్పుడు సరిగ్గా ఇదే ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చింది. ఒక నటి ఆరోపణ ఏమిటంటే—తనను సినిమాలో నటింపజేయలేదు. కానీ తనలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని మాత్రం తీసుకున్నారట! అది ఏమిటి? ఆమె ఆరోపణ నిజమేనా? తెరపై నటింపచేయటానికి ఒక మనిషిని తీసుకోకుండా,వారిలోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకోవడం కూడా ఒక రోజు పెద్ద వ్యాపారంగా మారుతుందా?
‘అవతార్’ కేసు వెనుక ఉన్న అసలు కథ ఇదే.
‘ది న్యూ వరల్డ్’ సినిమాలో పోకహోంటాస్గా నటించిన క్యోరియాంకా కిల్చర్, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో పాటు డిస్నీపై కేసు వేశారు. ఆమె ఆరోపణ ప్రకారం, తాను కేవలం 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీసిన ఒక ఫొటోను జేమ్స్ కామెరూన్ చూశారు. ఆ తర్వాత తన ముఖ లక్షణాలను ఆధారంగా చేసుకుని ‘అవతార్’లోని నెయిటిరి పాత్ర రూపకల్పన జరిగిందని ఆమె చెబుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది.
క్యోరియాంకా వాదన ఏంటంటే..
“నెయిటిరి పూర్తిగా నాలాగే ఉంది” అని ఆమె చెప్పడం లేదు. తన ముఖంలోని ప్రత్యేక లక్షణాలను ఒక డిజిటల్ పాత్ర రూపకల్పనలో ఉపయోగించారనేది ఆమె ఆరోపణ. ఇన్నాళ్లూ ఒక నటుడిలాగ కావాలంటే వాళ్లనే తెచ్చుకునేవారు. అంతేకానీ కావాల్సిన పార్ట్ వరకే తీసుకోలేదు. అయితే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ మనిషిని మొత్తం వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేకుండా చేస్తోంది.
ఇవి కూడా చదవండి
డిజిటల్ ప్రపంచంలో మనిషిని కావాల్సిన పార్ట్ గా విడదీయవచ్చు. ఒకరి కళ్లు, మరోకరి దవడ, ఇంకొకరి పెదవులు, మరో వ్యక్తి చిరునవ్వు. వీటన్నింటినీ విడివిడిగా తీసుకుని ఒక కొత్త డిజిటల్ ముఖాన్ని సృష్టించడం మొదలైంది.ప్రతి భాగానికీ ఎవరో ఒకరు యజమానులుగా ఉంటున్నారు. ఇదే ‘స్పేర్ పార్ట్స్’ బిజినెస్!మనుష్యులను వాణిజ్యపరంగా ఉపయోగించగల డిజిటల్ ఆస్తులుగా చూడటం మొదలైనట్లే.అలాంటప్పుడు ఎవరికి న్యాయం చేయాలి. ఇదే ‘అవతార్’ కేసు వెనుక దాగి ఉన్న సవాల్.
భవిష్యత్తులో నలుగురైదుగురు మనుషులు కలిసి, తెరపై ఒక్క AI నటిగా పుట్టే పరిస్థితి వస్తే? అప్పుడు ఆ నటికి వచ్చిన పేరు ఎవరిది? డబ్బు ఎవరిది? హక్కులు ఎవరివి? అన్నింటికంటే ముఖ్యంగా ఆ ముఖానికి అసలు యజమాని ఎవరు?
రేపటి కాంట్రాక్ట్ ఇలా ఉండచ్చా?
ఇప్పటివరకు నటుడు స్టూడియోతో“ఈ సినిమాలో నటిస్తాను” అని ఒప్పందం చేసుకుంటాడు. కానీ భవిష్యత్తులో ఒప్పందం మారవచ్చు. “నా పూర్తి ముఖాన్ని ఉపయోగించవద్దు. కానీ నా కళ్లను ఉపయోగించవచ్చు.” లేదా… “నా దవడ ఆకృతిని ఐదేళ్లపాటు AI పాత్రల్లో ఉపయోగించుకోవచ్చు.” ఇంకా ముందుకు వెళ్తే “నా చిరునవ్వు కి వేరు ధర.”
వినడానికి ఇప్పటికీ విచిత్రంగానే ఉంది. కానీ టెక్నాలజీ మనిషి ముఖాన్ని ఒకే యూనిట్‌గా కాకుండా విడివిడిగా విశ్లేషించగలిగినప్పుడు, మార్కెట్ కూడా అదే దిశగా వెళ్తుంది.
ఎగ్రిమెంట్ చేసుకుని చేస్తే ఏ సమస్యా ఉండదు. కానీ అడగకుండా చేసేస్తే ఇదిగో ఇలా అవతార్ తరహా సమస్యలు వస్తాయి.
‘అవతార్’ కేసు గెలుస్తుందా?
అది ఇప్పటికీ క్లారిటీ లేదు. క్యోరియాంకా కిల్చర్ ఆరోపణలను డిస్నీ, జేమ్స్ కామెరూన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నెయిటిరి పాత్ర క్యోరియాంకా కిల్చర్పై కాకుండా, ఆ పాత్రను పోషించిన జోయ్ సల్దానా నటన ఆధారంగా రూపొందిందని వారు కోర్టులో వాదించారు. అలాగే 2009లో విడుదలైన సినిమా విషయంలో చాలా ఆలస్యంగా కేసు వేశారనే అంశాన్ని కూడా ప్రస్తావించారు.
హాలీవుడ్లో కొత్త మార్కెట్ పుడుతోందా?
ఇవన్నీ చూస్తూంటే భవిష్యత్తులో ‘హ్యూమన్ స్పేర్ పార్ట్స్ మార్కెట్’ హాలీవుడ్ లో మెదలవచ్చు అనిపిస్తోంది. ‘అవతార్’ కేసు అలాంటి భవిష్యత్ అవకాశాన్ని మన ముందుంచుతోంది.
ఫైనల్ గా..
రేపటి సినీ ప్రపంచంలో ఒక కొత్త ప్రశ్నలు వినిపిస్తాయి. “మీరు ఈ సినిమాలో నటించడానికి ఎంత తీసుకుంటారు?” కాదు… “మీ ముఖంలోని ఫలానా భాగానికి ఎంత తీసుకుంటారు?” అని.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








