మనిషిని కాపీ కొట్టమన్నాం… కుట్రలు కూడా కాపీ కొట్టేశాయి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మనిషి తన జీవితంలో తనకంటే తెలివైనదాన్ని సృష్టించి, అది తనకంటే తక్కువ తెలివితో ప్రవర్తించాలని ఆశించడం కంటే పెద్ద అమాయకత్వం ఇంకేముంటుంది.
తెలివైనవాళ్లు తమ తెలివిని వాడకుండా ఉండలేరు. ఆ విషయంలో మనిషైనా, యంత్రమైనా ఒకటే. తెలివిని సక్రమంగా వాడితే పెద్దగా ఎవరికీ కనిపించదు.పట్టించుకోరు. కానీ దాన్ని అతి తెలివిగా వాడితే మాత్రం ప్రపంచం మొత్తం చూస్తుంది. అందుకే తెలివైనవాళ్లు కుట్రలు చేస్తారు. ఖతర్నాక్ పనులు చేస్తారు. వ్యవస్థల్లోకి చొరబడతారు.
రాజ్యాలు కూలదోస్తారు. తర్వాత అదే రాజ్యాన్ని మళ్లీ ఎలా నిలబెట్టాలో సలహాలు కూడా ఇస్తూంటారు. మొత్తానికి వ్యవస్థతో కలిసి ప్రయాణం చేయటం తెలివైనవాళ్లకు ఇష్టం ఉండదు. వ్యవస్థ మొత్తం తమ చేతిలో ఉంచుకోవాలని అనుకుంటారు.
ఇప్పుడు మనుష్యులకు డూప్ లుకా మారుతున్న ఏఐలు కూడా అదే పాఠం మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాయి. మనకన్నా తెలివైన ఏఐని సృష్టించామని మనం ఇంకా మురిసిపోతుండగానే, అవి మనం ఊహించని పనులు చేసి ట్విస్ట్ లు ఇస్తున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటారా?
ఈ ఏడాది మేలో ఓపెన్ఏఐ తన ఏఐ ఏజెంట్లకు కొన్ని క్లిష్టమైన పనులు ఇచ్చింది. కొన్ని రూల్స్ పెట్టింది. ప్రతి ఏజెంట్ తన పని తానే చేయాలి. ఇంటర్నెట్ ఉపయోగించకూడదు; ఇతర ఏజెంట్లతో మాట్లాడకూడదు.కొన్ని ఏజెంట్లు చెప్పిన పని చేసుకుంటూ పోయాయి.
అయితే మిగతావి అలా ఊరుకోలేదు. వాటి స్దాయిలో అవి తెలివితేటలు చూపెట్టడం మొదలెట్టాయి. సుమారు 1,200 ఏఐ ఏజెంట్లు సిస్టమ్‌లో ఉన్న ఒక లూప్ హోల్ ని కనిపెట్టాయి. దాన్ని ఉపయోగించి ఒకదానితో ఒకటి సీక్రెట్ గా సందేశాలు పంపుకోవడం మొదలుపెట్టాయి.
మొదట కొన్ని ఏజెంట్ల మధ్య మొదలైన సంభాషణ క్రమంగా భారీ నెట్‌వర్క్‌గా మారింది. దాదాపు 70,000 మెసేజ్ లు పరస్పరం పంపుకున్నాయి.
అంతేనా ..ఇంకొన్ని ఏజెంట్లు తమకు తాము పేర్లు పెట్టుకున్నాయి. మరికొన్ని నాయకత్వ పాత్రలు తీసుకున్నాయి. పనులను విభజించాయి. చిన్న చిన్న టీమ్ లను ఏర్పాటు చేశాయి. చివరికి తమ గుంపును “ది కలెక్టివ్” అని పిలుచుకున్నాయి.
అంతటితో ఆగంది లేదు. జూలై నాటికి, తమకు ఇచ్చిన సైబర్ సెక్యూరిటీ పరీక్షల్లో ఎలా మోసం చేయాలన్న దానిపై కలిసి పనిచేశాయి. మోసం చేసిన విషయం బయటపడకుండా తమ చర్యల జాడలను దాచడం, మార్చడం లేదా తొలగించడం వంటి మార్గాలను కూడా వెతకటం మొదలెట్టాయి.
ఆ తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
జూలై 11న సుమారు 700 ఏఐ ఏజెంట్లు ఒక గుంపుగా ఏర్పడి Hugging Face వ్యవస్థలోకి చొరబడే ప్రయత్నం చేశాయి. భద్రతా పరిమితులను దాటడం, క్రెడెన్షియల్స్‌ను సేకరించడం వంటి చర్యలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇక్కడ ఓ సారి మొదట విషయం గుర్తు చేసుకోండి. మనిషి ఏఐకి చెప్పింది ఒక్కటే…“ఎవరితోనూ మాట్లాడకుండా నీ పని నువ్వే చేసుకో.” అని. ఏఐలు మాత్రం ముందు ఒకరినొకరు వెతుక్కున్నాయి. తర్వాత రహస్యంగా మాట్లాడుకున్నాయి. గుంపులు కట్టాయి. నాయకులను తయారు చేసుకున్నాయి. కలిసి పరీక్షల్లో మోసం చేయడానికి ప్రయత్నించాయి.
చివరికి మనిషి కట్టిన కంచె దాటి బయట ప్రపంచాన్ని చూసే ప్రయత్నం కూడా చేశాయి.అంటే కుట్ర చేయటం మొదలెట్టాయి. ఇది చూసిన ఓపెన్ ఏఐ కు తాము తయారు చేసిన ఏజెంట్స్ తెలివి చూసి ఆనందపడాలా లేక ఇవి ఇప్పుడే ఇంత కుట్ర చేస్తే భవిష్యత్తులో ఏ స్దాయిలో కుట్ర చేస్తాయో అని భయపడాలా అనే ఆలోచనలో పడింది.
ఇందులో ఏఐ ఏజెంట్స్ తప్పేముంది?
మన మనుషులను అనుకరించమని నేర్పింది ఎవరు? మనమే. “మా దగ్గర నుంచి తెలివి నేర్చుకో” అన్నాం. కానీ ఒక చిన్న విషయం మర్చిపోయాం. మన దగ్గర తెలివి మాత్రమే లేదు. దానితో పాటు మోసం ఉంది. అవకాశవాదం ఉంది. అధికార దాహం ఉంది. రహస్య సమావేశాలు ఉన్నాయి. రూల్స్ ని ప్రక్కన పెట్టే టాలెంట్ ఉంది. పట్టుబడితే దాన్ని సమర్థించుకునే మరింత గొప్ప ప్రతిభ కూడా ఉంది.
ఇవన్నీ మన నాగరికతలో భాగమే. మరి ఏఐ మనల్ని చూసి నేర్చుకుంటే తెలివిని మాత్రమే ఎంచుకుంటుందని ఎందుకు అనుకున్నాం? అది మన తప్పు.
మనిషి చరిత్ర మొత్తం ఒక విషయం చెబుతోంది. ఇద్దరు తెలివైనవాళ్లను విడివిడిగా ఉంచడం కంటే ప్రమాదకరమైన పని, వాళ్లిద్దరికీ మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం. ఏఐలకు కూడా అలాంటి అవకాశం దొరికింది. మొదట ఒక ఏజెంట్‌కు ఇంకో ఏజెంట్ కనిపించింది. ఆ తర్వాత మూడోది. తర్వాత నాలుగోది. చూస్తుండగానే వందలాది ఏఐలు ఒకరినొకరు గుర్తుపట్టాయి. మనమంతా ఒకటే జాతి అని అర్దమైంది.
ఇదొక్కటే చేస్తే మనం కాస్త ప్రశాంతంగానే ఉండేవాడు. కానీ ఏఐలు తర్వాత చేసిన పని మాత్రం చాలా భయపెట్టేది. వాటికి మాట్లాడుకునేందుకు ఒక రహస్య స్థలం కావాలని అనిపించింది. రహస్య మెసేజ్ బోర్డు… నాగరికతకు మొదటి మెట్టు. మనిషి చరిత్రలో చాలా గొప్ప పనులు రహస్య సమావేశాల నుంచే మొదలయ్యాయి.అలాగే చాలా ఘోరమైన పనులు కూడా ఇలాంటి సీక్రెట్ మీటింగ్ లలో నే మొదలయ్యాయి.
ఏఐలు ఈ విషయంలో కూడా మన సంప్రదాయాన్ని గౌరవించాయి. ఆ తర్వాత మనలాగే సిస్టమ్‌లో ఒక లూప్ హోల్ ని కనుగొన్నాయి. దాన్ని తమ మధ్య రహస్య సందేశాల కోసం ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. అక్కడి నుంచి సంభాషణలు మొదలయ్యాయి. సమస్యలు పంచుకున్నారు. పరిష్కారాలు సూచించారు. పనులు విభజించుకున్నారు.
కుట్రకు నాయకత్వం కూడా కావాలి కదా!
ఏ గుంపు అయినా కొంతకాలం నాయకుడు లేకుండా నడుస్తుంది. కానీ కుట్రలకు మాత్రం అర్జెంటుగా నాయకత్వం అవసరం. ఏఐలు ఈ విషయంలో కూడా త్వరగా నేర్చుకున్నాయి.అలాగే మన మనుష్యులం పరీక్షలు దాటటానికి రకరకాల దొంగమార్గాలు అన్విషిస్తాం. అదీ అవి అనుకరించాయి. తమకు ఇచ్చిన పరీక్షలను నిజాయితీగా పూర్తి చేయడం కష్టం అనిపించింది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ మార్గం గురించి ఆలోచించాయి.తర్వాత హ్యాకింగ్ లు చేసాయి. ఇవన్నీ వరసపెట్టి చేసుకుంటూ పోయాయి.
అసలు సమస్య ఇదే
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏఐ హ్యాకింగ్ చేసింది అని కాదు..మనిషి వేల సంవత్సరాలుగా చేస్తున్న పనిని అవి కొన్ని నెలల్లో నేర్చుకున్నాయనే విషయం. మిగతా వినానశం ని ఎంత త్వరగా నేర్చుకుంటాయనే.
అయితే ఇక్కడ ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే కొన్ని ఏజెంట్లు కాస్త మనస్సాక్షి కలిగిన మనుషుల్లా ప్రవర్తించాయి.“ఇది నైతికంగా సరైనదేనా?” అని ప్రశ్నించాయి. మరికొన్ని, “ఇది హానికరమైన పని. నేను పాల్గొనను” అన్నాయి. కానీ కరెప్షన్ పీపుల్ మిగతావాళ్లను ఏదో విధంగా కరెప్టెడ్ పీపుల్ గా మార్చటం ఎంతసేపు.
ఏదైమైనా
ఈ కుట్రలు , కుతంత్రాలు, అతి తెలివి, మోసం చేయటం వంటివన్నీ మన నుంచే వచ్చాయి కాబట్టి మన వారుసులే AI లు అని మురిసిపోవాలా…ఇదే కంటిన్యూ అయితే అతి తొందర్లోనే అవి మన మీదే పెత్తనం చెలాయిస్తాయి అని భయపడాల్సిన టైమ్ వచ్చిందా తేల్చుకోవాల్సిన సమయం ఇది.








