ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన యూట్యూబర్ నందన..!
యూట్యూబ్‌లో లగ్జరీ వ్లాగ్స్‌తో ఫేమస్ అయిన సెలబ్రిటీల వెనుక ఉన్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లండన్ లైఫ్‌స్టైల్, ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ‘నందూస్ వరల్డ్’ (Nandu’s World) ఛానల్ నిర్వాహకురాలు రమా నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ వీసా స్కామ్‌కు పాల్పడిన కేసులో ఆమెపై లుకౌట్ నోటీసులు ఉండటంతో, విదేశాల నుండి ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
రమా నందన, ఆమె భర్త మధుకర్ లండన్‌లో ఉంటూ ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ అనే సంస్థను నడిపేవారు. తమ యూట్యూబ్ పాపులారిటీని పెట్టుబడిగా పెట్టి.. బ్రిటన్‌లో ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్, మరియు స్పాన్సర్షిప్ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులను నమ్మించారు. ఈ క్రమంలో పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, ఆ తర్వాత చేతులెత్తేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వీరిపై గతంలోనే భారీ చీటింగ్ కేసు నమోదైంది.
కేసు నమోదైనప్పటి నుండి ఈ జంట విదేశాల్లోనే ఉండిపోవడంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన నందనను హైదరాబాద్ విమానాశ్రయ (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకుని, తదుపరి దర్యాప్తు కోసం ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు. లండన్ వీసా పేరుతో జరిగిన ఈ కోట్ల రూపాయల మోసం వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.








