రచయితగా మారిన సాయి రెడ్డి.. తొలి పుస్తకం అదే..!
రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai reddy) ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. నిరంతరం రాజకీయ సమీకరణాలు, విమర్శలు-ప్రతివిమర్శలతో బిజీగా ఉండే ఆయన, తాజాగా పరిశోధనాత్మక రచయితగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సామాజికవర్గం మూలాలను వెలికితీసేలా ఆయన ఒక ప్రత్యేక పుస్తకాన్ని రచించినట్లు వెల్లడైంది. ‘రెడ్డి’ సామాజికవర్గం అసలు ఎలా ఆవిర్భవించింది? వారి చారిత్రక నేపథ్యం ఏంటి? అనే అంశాలపై విజయసాయిరెడ్డి ఈ పుస్తక రచన చేశారు.
కేవలం పైపైన కాకుండా, దాదాపు ఏడాది కాలం పాటు ఎంతో ఆసక్తితో, లోతుగా పరిశోధన చేసి సుమారు 350 పేజీల భారీ నిడివితో ఈ గ్రంథాన్ని ఆయన సిద్ధం చేశారు. రచయితగా మారడమే కాకుండా, తన సరికొత్త రాజకీయ ప్రయాణంపై విజయసాయిరెడ్డి అత్యంత సంచలన ప్రకటనలు చేశారు. తన పార్టీలో తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి అధికారిక పదవులను చేపట్టబోమని ఆయన బహిరంగంగా మాట ఇచ్చారు. మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే ఏ విధంగానైతే పదవులకు దూరంగా ఉంటూ చక్రం తిప్పారో, అదే తరహాలో తాను కూడా తన పార్టీకి కేవలం ఒక ‘మెంటర్’ గా మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
తమ పార్టీలో చేరాలనుకునే వారికి ప్రాథమికంగా ‘దేశభక్తి’ ఉండటం అత్యంత ముఖ్యమైన అర్హత అని ఆయన తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తన పొలిటికల్ కెరీర్‌పై వస్తున్న వార్తలకు ఆయన తెరదించారు. గడిచిన రెండేళ్లుగా తాను రాజకీయంగా ఎక్కడా సైలెంట్‌గా ఉండలేదని, నిరంతరం క్షేత్రస్థాయిలో పని చేస్తూనే ఉన్నానని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పాలకులను ప్రశ్నిస్తూ.. “గడిచిన 12 ఏళ్ల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల భారీ అప్పులు చేశారు. మరి అంతగా అప్పు చేసిన సొమ్మంతా ఎక్కడికి పోయింది? ఎవరి జేబుల్లోకి వెళ్లింది?” అంటూ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో నిలదీశారు. ఒకవైపు పుస్తక రచన, మరోవైపు సరికొత్త రాజకీయ పంథాతో విజయసాయిరెడ్డి తీసుకుంటున్న ఈ అడుగులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.








