రాజకీయ పార్టీలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai reddy) సమకాలీన రాజకీయాలపై, రాజధాని అమరావతిపై మరియు తన సరికొత్త పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన పార్టీల తీరును తీవ్రంగా తప్పుబడుతూ, రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయం నడుస్తోందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఫ్యాక్షన్ మరియు కుటుంబ రాజకీయ పార్టీలుగా మారిపోయాయని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
“టీడీపీ అనేది ‘రెడ్‌బుక్’ పార్టీగా మారితే, వైసీపీ ‘రప్పా రప్పా’ పార్టీగా తయారైంది. ఈ రెండు పార్టీలకు దందాలు, సెటిల్మెంట్లు చేయడం అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి.. గెలిచిన తర్వాత ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు” అని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో రాజధానిపై స్పందిస్తూ.. తాను అమరావతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందేనని, అయితే అమరావతి అభివృద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి తప్ప ప్రభుత్వ సొమ్మును వృధా చేయకూడదని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ‘జెన్-జీ’ (Gen-Z) యువతకు భయపడుతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులంతో సంబంధం లేకుండా 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న యువతకే 66 శాతం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మరియు నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుపై ధరలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఏకంగా 31 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారని, దీనివల్ల సామాన్యుడిపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదు కానీ ప్రజల ఆదాయం పెరగడమే తమకు ముఖ్యమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోలియంపై ఉన్న జీఎస్టీని 15 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇంధన ధరలు తగ్గితే ఆటోమేటిక్‌గా అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ తగ్గుముఖం పడతాయని విజయసాయిరెడ్డి వివరించారు.








