ఎమ్మెల్యే అడిగిన వెంటనే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక “టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్” ముగింపు సందర్భంగా స్థానిక ఎన్నికల వ్యూహాలు మరియు నియోజకవర్గాల అభివృద్ధి నిధులపై ప్రజాప్రతినిధులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ కూడా తేలిగ్గా తీసుకోవద్దని, గెలుపే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల (TDP-JSP-BJP) మధ్య పూర్తి సఖ్యత మరియు సమన్వయం ఉండాలని, నేతల మధ్య ఎలాంటి అంతరాలు లేదా మనస్పర్థలు ఉండకూడదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లు ఉన్న స్థానాలలో సమర్థులైన, గెలుపు గుర్రాలైన మహిళా నేతలను ఇప్పుటి నుంచే గుర్తించి వారిని ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కాంక్లేవ్‌లో ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లోని చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రత్యేక నిధులను సమకూర్చాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన కోరారు.
దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 1 కోటి చొప్పున నిధులను కేటాయించేందుకు తక్షణమే అంగీకారం తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఈ నిధులతో పాటు, పార్లమెంట్ సభ్యులకు వచ్చే ఎంపీ ల్యాడ్స్ (MP LADS) నిధులను కూడా నియోజకవర్గాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. ఎంపీలు కూడా వారి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాధాన్యతల వారీగా నిధుల కేటాయింపులు జరపాలని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ నిధులు మరియు ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు ఇచ్చిన ఈ క్లారిటీతో టీడీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.








