డ్రైవర్ లెస్ కారు యాక్సిడెంట్ చేస్తే జైలుకు ఎవరు వెళ్తారు? టెస్లా Cybercab తెచ్చిన పెద్ద ప్రశ్న!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి పూట ఓ కారు స్పీడుగా వెళ్తోంది.
హఠాత్తుగా ఓ పెద్ద శబ్దం అయ్యింది. చూస్తే ఆ కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.అంతే ఎప్పటిలాగే కొన్ని నిముషాల్లోనే జనం మూగారు. కొందరు అంబులెన్స్ కు ఫోన్ చేస్తున్నారు. మరి కొందరు కారులో ఇరుక్కుపోయిన వారిని బయిటకు తీస్తున్నారు. పోలీస్ లు వచ్చేసారు. ప్రమాదం ఎలా జరిగిందో చూద్దామని ఓ ఆఫీసర్ కారు దగ్గరకు వెళ్లి…డ్రైవర్ సీట్ లోకి చూసాడు. చూస్తే అక్కడ డ్రైవర్ లేడు. అతనికి అర్దం అయ్యింది. అది డ్రైవర్ లెస్ కారు. స్టీరింగ్ లేదు, బ్రేక్ ఫెడల్ లేదు. ఏమీ లేదు. పోలీస్ లు ఏం చేయాలో అర్దం కాక ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.
ఓ పోలీస్ గంభీరంగా …
“కారు ఎవరు నడిపారు?”
అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేదు. “డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు?” అదీ నో రెస్పాన్స్. డ్రైవర్ లెస్ కారు అని తెలిసి అడుగుతున్న అతన్ని జనం వింతగా చూస్తున్నారు. మొయిన్ పోలీస్ ఆఫీసర్ కు ఏం చేయాలో అర్దం కాదు. అంతకు ముందు వరకూ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ను వెతికేవాడు.అతన్నే ప్రశ్నించి ఎఫ్ ఐ ఆర్ రాసుకునేవారు. తప్పు ఎవరిదో తెలుసుకునేవారు. ఇప్పుడు ఏం చేయాలి. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిపై కేసు పెట్టాలి.
కారుపై కేసు పెట్టాలా? లేక దాన్ని తయారు చేసిన కంపెనీ పైనా ? ఇవేమీ కాకుండా ఆ కారు నడవటానికి సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన ఇంజినీర్ పైనా? ఇవన్నీ కాకుండా ఆ కారు ని నడిపిస్తున్న AI పైనా? ఏం చేయాలి. ఇదీ భవిష్యత్తు ఎదుర్కోబోతున్న పెద్ద సమస్య.
డ్రైవర్ లేని కార్లు నిజంగానే రోడ్లపైకి వస్తున్న ఈ సమయంలో టెస్లా Cybercab మన ముందు నిలబెట్టిన పెద్ద డైలమో ఇది. అందుకే టెస్లా Cybercab రోడ్డు పైకి రాగానే అమెరికా ప్రభుత్వ దృష్టిలో పడింది.
ఇప్పుడు ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నలు ఇవే. ఈ వాహనం ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా ప్రమాణాలకు నిజంగానే అనుగుణంగా ఉందా? స్టీరింగ్ లేకుండా, బ్రేక్ పెడల్స్ లేకుండా దీనిని రోడ్డుపైకి ఎలా తీసుకొచ్చారు? అనే అంశాలపై అమెరికా రోడ్డు భద్రతా సంస్థ విచారణ ప్రారంభించింది.
ఎందుకంటే ఇన్నాళ్లూ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ ఉంది. డ్రంక్ డ్రైవింగ్ చట్టాలు ఉన్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే శిక్ష ఉంది. స్పీడ్ లిమిట్ దాటితే జరిమానా ఉంది. ఇవన్నీ ఒక వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి. కానీ Cybercab వంటి కార్లు ఇప్పుడు ఒక కొత్త పరిస్థితిని తీసుకొస్తున్నాయి.
ఎప్పుడు మొదలైంది
ఇదంతా రీసెంట్ గా టెస్లా టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో వందలాది మంది అభిమానులకు Cybercabలో ప్రయాణించే అవకాశం ఇవ్వటంతో మొదలైంది. ఈ డ్రైవర్‌లెస్ వాహనాలను తన Robotaxi ride-hailing networkలో ఉపయోగించాలని టెస్లా భావిస్తోంది. ప్రస్తుతం టెస్లా రోబోటాక్సీ సేవలు టెక్సాస్, ఫ్లోరిడాలోని కొన్ని నగరాల్లో పరిమిత స్థాయిలో నడుస్తున్నాయి.
అదే సమయంలో Cybercab విషయంలో అమెరికా ప్రభుత్వ నియంత్రణ సంస్థ National Highway Traffic Safety Administration (NHTSA) రంగంలోకి దిగింది.
ఇప్పుడేం చేయాలి
ఇన్నాళ్లూ అమలులో ఉన్న పాత చట్టాల్లో ఉన్న ప్రశ్నలకు కొత్త సమాధానాలు కావాలి. AIని జైలుకు పంపలేం. సాఫ్ట్‌వేర్‌కు హ్యాండ్‌కఫ్స్ వేయలేం. కారును కోర్టులో నిలబెట్టలేం. కాబట్టి ఏదో ఒక మనిషి లేదా సంస్థ బాధ్యత తీసుకోవాల్సిందే.
అదే ఎవరు? ఇదే చిక్కు ముడి. భవిష్యత్తులో ఇలాంటి కేసులు కోర్టుల ముందు కొత్త చర్చలకు దారితీయడం ఖాయం. ఎందుకంటే డ్రైవర్‌ను తొలగించడం చాలా సులువు.
బాధ్యతను తొలగించడం సాధ్యం కాదు.
ఎందుకంటే టెక్నాలజీ ఎంత తెలివిగా మారినా… ప్రమాదంలో చనిపోయే మనిషికి మాత్రం ఒక సమాధానం చెప్పగలగాలి. బీమా కంపెనీకి సమాధానం కావాలి. కోర్టుకు సమాధానం కావాలి.మన చట్టాలకు సమాధానం కావాలి. బాధితుడి కుటుంబానికి సమాధానం కావాలి.ఈ క్రమంలోనే టెస్లా Cybercabపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది.








