KCR: కేసీఆర్ రాజీనామా చుట్టూ తెలంగాణ పాలిటిక్స్!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా డిమాండ్ చుట్టూ భగ్గుమంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న కేసీఆర్.. ఎమ్మెల్యే పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని అధికార కాంగ్రెస్ ముప్పేట దాడి చేస్తుంటే, బీఆర్ఎస్ అంతే దీటుగా ప్రతిదాడికి దిగుతోంది. ఒకవైపు శాసనసభ సంప్రదాయాలు, నైతిక బాధ్యతల పేరిట కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతుంటే, మరోవైపు దీనిని రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మొత్తంగా కేసీఆర్ హాజరు అంశం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రణరంగాన్ని సృష్టించింది.
ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి సభకు రాకుండా తప్పించుకోవడం ప్రజాస్వామ్యానికే అవమానమని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ప్రజల సమస్యలను చట్టసభలో లేవనెత్తాల్సిన బాధ్యతను విస్మరిస్తూ, ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని అధికార పక్షం తేల్చి చెబుతోంది. అసెంబ్లీ గేటు తొక్కకుండా ప్రజాధనంతో వచ్చే జీతభత్యాలు, సదుపాయాలు అనుభవించడం సిగ్గుచేటని మంత్రులు నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. పదేళ్లపాటు సీఎంగా పనిచేసిన వ్యక్తికి అసెంబ్లీలో కూర్చోవడానికి అహం అడ్డొస్తోందా అని కాంగ్రెస్ నిలదీస్తోంది. ప్రతిపక్ష నేత హోదా దక్కించుకుని కూడా సభలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము లేకపోతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక ఉన్న కారణాలను రాజకీయంగా, భావోద్వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సీఎం స్థాయి వ్యక్తి కేసీఆర్ చావును కోరుకుంటున్నారని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాట్లాడే వ్యక్తులు ఉన్న సభలోకి వెళ్లి మాటలు పడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదని గులాబీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సభలో చర్చల కంటే వ్యక్తిగత దూషణలు, కక్షసాధింపులే లక్ష్యంగా మారినప్పుడు అక్కడకు వెళ్లడం ఆత్మగౌరవానికి భంగకరమని వాదిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతారని బీఆర్ఎస్ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. గతంలో తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూడా అధికార పక్షం వైఖరిని నిరసిస్తూ సభను బహిష్కరించిన సందర్భాలను బీఆర్ఎస్ గుర్తుచేస్తోంది. అప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకుని తిరిగి అధికారంలోకి వచ్చినట్లే, కేసీఆర్ కూడా ప్రజల వద్దకే వెళ్తారని స్పష్టం చేస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ వివాదం వెనుక ఉభయపక్షాల వ్యూహాత్మక రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ను సభకు రప్పించడం ద్వారా ఆయన వైఫల్యాలను, గత పదేళ్ల పాలనను నేరుగా ఎండగట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఒకవేళ ఆయన రాకపోతే పారిపోయారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ను నైతికంగా బలహీనపరచాలని అధికార పార్టీ చూస్తోంది. గజ్వేల్‌లో ఉపఎన్నిక వస్తే కేసీఆర్‌ను రాజకీయంగా మరింత దెబ్బతీయవచ్చనే ఆలోచన కూడా కాంగ్రెస్ వ్యూహాల్లో భాగంగా కనిపిస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్, కేసీఆర్ భద్రత, కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలను ప్రజల్లో ప్రధాన చర్చనీయాంశంగా మార్చాలని యోచిస్తోంది. సభకు వెళ్లకపోవడాన్ని ప్రజా ఆత్మగౌరవ పోరాటంగా చిత్రీకరిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ రగిల్చే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ రాజీనామా డిమాండ్ ద్వారా తమ అధినేతను వేధిస్తోందన్న భావనను కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లి, సానుభూతి కూడగట్టడమే లక్ష్యంగా గులాబీ దళం పావులు కదుపుతోంది.
మొత్తంగా కేసీఆర్ అసెంబ్లీ హాజరు, రాజీనామా వ్యవహారం కేవలం ఒక నియమ నిబంధనల అంశం మాత్రమే కాదు. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న హైవోల్టేజ్ మైండ్ గేమ్‌గా మారింది.








