సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఘనంగా ‘తెలుగుకు పరుగు – Run4Telugu 2026’..
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో అమెరికా అంతటా ‘తెలుగుకు పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వల్లభాపురపు బాలాజీ, అల్లం శ్రీదేవి నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పడంతో పాటు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సందేశాన్ని సమాజానికి అందించడమే ఈ పరుగు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే సంకల్పంతో భాషా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మనబడి ‘తెలుగుకు పరుగు’ నిర్దేశకుడు వల్లభాపురపు బాలాజీ మాట్లాడుతూ మనబడి నిర్వహిస్తున్న తెలుగు భాషా తరగతులు, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నమోదు వివరాలను వెల్లడించారు. తెలుగు భాషను నేర్పడం, నేర్చుకోవడం ప్రతి తెలుగు కుటుంబ బాధ్యత అని గుర్తుచేశారు. మనబడి అధ్యక్షుడు కులపతి చమర్తి రాజు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘భాషా సేవయే భావితరాల సేవ’ అనే నినాదాన్ని గుర్తుచేస్తూ ఇప్పటివరకు లక్షా 10 వేల మందికి పైగా విద్యార్థులు మనబడి ద్వారా విద్యను పూర్తి చేసుకున్నారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ రెండో వారంలో 10 దేశాల్లో దాదాపు 300 కేంద్రాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు 12,500 మంది పిల్లలు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర అమెరికాలో మనబడికి పాశ్చాత్య పాఠశాలలు, కళాశాలల సంఘం గుర్తింపుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ‘రన్ ఫర్ తెలుగు’ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహించారు. ప్రతి ప్రాంతంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను మనబడి పతకాలతో సత్కరించారు. పాల్గొన్న వారందరికీ ధ్రువపత్రాలు అందజేసి, ఆయా ప్రాంతాల్లో అల్పాహారం ఏర్పాటు చేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఒకేసారి వేలాది మందిని భాగస్వాములను చేస్తూ సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది. తెలుగు భాషపై ప్రేమ, ఆరోగ్యంపై అవగాహనను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం తెలుగు భాషా దినోత్సవ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిసింది.








