టీటీఏ మెగా కన్వెన్షన్ అద్భుత ప్రారంభం
నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (టీటీఏ) మెగా కన్వెన్షన్ 2026 తొలి రోజు వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక , సాంస్కృతిక శోభతో ముగిశాయి. అమెరికా గడ్డపై తెలుగుదనాన్ని, మన సంస్కృతిని, గొప్పతనాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతో జరిగిన ఈ మహోత్సవం, ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కన్వెన్షన్‌లో మొదటి రోజు కార్యక్రమాలు అటు సందడితో, ఇటు సమాజం పట్ల బాధ్యతను చాటిచెప్పే పురస్కారాలతో విజయవంతంగా పూర్తయ్యాయి.
అట్టహాసంగా ప్రారంభం…
కార్యక్రమం ప్రారంభంలోనే అతిథులకు ఘన స్వాగతం పలికారు. సిటీ కౌన్సిల్ సభ్యురాలు డింపుల్ అజ్మీరా, మేయర్ హరింగ్టన్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలను మొదలుపెట్టారు. టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చార్లెట్ నగరంలో కన్వెన్షన్ జరపడానికి గత ఆరు నెలలుగా కష్టపడిన విజయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, భరత్ రెడ్డి, వంశీ రెడ్డి వంటి సభ్యుల కృషిని టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మలిపెద్ది కొనియాడారు. సప్త సముద్రాలు దాటి వచ్చిన తెలుగు ప్రజలందరికీ సాదర స్వాగతం పలికారు.
జానపదాల జాతర…
ఈ వేడుకల్లోని ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘జానపదాల జాతర’, సభను ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయకులు రసమయి బాలకిషన్, వందేమాతరం శ్రీనివాస్, నర్సిరెడ్డి కాసాలా, సంధ్య, నల్గొండ గద్దర్, గీత రచయిత కాసర్ల శ్యామ్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వందేమాతరం శ్రీనివాస్ పాడిన ‘చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే’, ‘తెలంగాణ గట్టు మీద సందమమయ్యో’ వంటి పాటలు సభికులలో జోష్ నింపాయి. రసమయి బాలకిషన్ పాడిన ‘గున్నా గున్నా మామిడి’, ‘మమిడి కొమ్మలా మీద’ వంటి జానపదాలకు తోటి కళాకారులు కోరస్ పాడటంతో సభ ప్రాంగణం హోరెత్తింది.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న టీటీఏ ఫౌండింగ్ ఛైర్మన్ పైళ్ల మల్లారెడ్డి కృషిని ప్రశంసించారు.
అవార్డుల పండుగ – ప్రతిభకు పట్టం…
తెలుగు కీర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న పదిమంది విశిష్ట వ్యక్తులకు టీటీఏ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేసింది.
డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్): డాక్టర్ ఏ.వి. గురవా రెడ్డి (ఎక్సలెన్స్ అవార్డు):, వెంకట సుబ్బారావు చెన్నూరి (జర్నలిజం అవార్డు): వందేమాతరం శ్రీనివాస్ (సాంస్కృతిక & సాహిత్య అవార్డు):, టి.రాంచంద్ర రెడ్డి, కంది విశ్వభారత్ రెడ్డి (కమ్యూనిటీ సర్వీస్ అవార్డు), డాక్టర్ రమ్య చిత్రాంగద (యూత్ అచీవ్మెంట్), డాక్టర్ మహిధర్ రాయసం (ఐటీ రంగం), డాక్టర్ రవీందర్ రెడ్డి రెగట్టె (సైన్స్ & టెక్నాలజీ), ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రవీంద్రన్ (మెడిసిన్): ఆయా రంగాల్లో పరిశోధనలు, సేవలకు ఈ ప్రముఖులకు అవార్డుతో సత్కరించారు.
రఘునందన్ రావు ప్రసంగం…
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ, అమెరికాలో కూడా తెలుగు సంస్కృతిని కాపాడుతున్న తీరు అభినందనీయమని అన్నారు. వినాయక చవితి, భరతనాట్యం వంటి కళలను వారు ప్రోత్సహిస్తున్న తీరును ఆయన కొనియాడారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, తెలుగు వారితో గడపడం సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు తెలంగాణ, భారత భవిష్యత్తు కోసం తమ వంతు సహకారం అందించాలని, రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియ, మహిళా రిజర్వేషన్ల ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
సావనీర్ , డిజిటల్ లాంచ్…
కార్యక్రమంలో భాగంగా టీటీఏ సావనీర్ , డిజిటల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీనివాస్ గుడూరు , కమిటీ సభ్యులు కలిసి దీనిని ప్రారంభించారు. కన్వెన్షన్ గురించి, సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా సభ్యులు వివరించారు. అలాగే, యాంకర్ సుమ కనకాల వేదికపైకి రాగానే, ఆమెకు , బిగ్ బాస్ ప్రస్తావనతో సరదా సంభాషణ నడిచి, సభికులను నవ్వుల్లో ముంచెత్తింది.
అధ్యక్షుడు నవీన్ మలిపెద్ది, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మొదటి రోజు వేడుకలు ఎంతో క్రమశిక్షణతో, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో దిగ్విజయంగా ముగిశాయి.








