కల్తీల నిరోధానికి కఠిన చట్టం…. సీఎం రేవంత్ రెడ్డి
* సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి
* చట్టం తయారీకి శాసనసభలో సమగ్ర చర్చ…
* క్యూర్ పరిధిలో పైలెట్‌గా తొలుత అమలు….
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు అన్ని కల్తీల బారిన పడుతుండడంతో ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతున్నారని సీఎం అన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA)పై ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని సీఎం తెలిపారు. ఎరువులు, పురుగు మందుల భారీ వాడకంతో పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు నిరాకరిస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మార్కెట్ లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలురకాల ఉత్పత్తులు అమ్ముతున్నారని, అధిక ధరలు ప్రజలు వాటిని కొంటున్నా… అవి సేంద్రియ ఉత్పత్తులే అని నిర్ధరించేందుకు సరైన వ్యవస్థలు లేవన్నారు. ఈ నేపథ్యంలో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా ఒక సమగ్రమైన నివేదికను తయారు చేయాలన్నారు. దానిపై బిల్లు రూపొందించి శాసనసభలో సమగ్రమైన చర్చ చేపడతామని సీఎం తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం తెలిపారు. కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లను నియమించాలని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కల్తీల నిరోధానికి సంబంధించి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక్కడ నిబంధనలు అమలు చేసి వాటి అమలులో వచ్చే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి.ఆనంద్, సీఎం సలహాదారు, ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, ఎన్.శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








