కేటీఆర్ యువ నినాదం.. కాంగ్రెస్‌పై యువ సంగ్రామం!
తెలంగాణ రాజకీయాల్లో నిరుద్యోగ గళం మరోసారి హోరెత్తింది. ఎన్నికల హామీల అమలు, ఉద్యోగ నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీఖరును నిరసిస్తూ సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఉద్యోగాల నోటిఫికేషన్ల స్థానంలో రాష్ట్రంలో ‘లూటిఫికేషన్లు’ నడుస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో ‘చాయ్ పే చర్చ’ నిర్వహించి, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ హామీలన్నీ ఇప్పుడు నీటి మూటలుగా మారాయని విమర్శించారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదని.. ఇక్కడి నిరుద్యోగుల బాధ అసలే తెల్వదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకుని సుద్దపూస మాటలు మాట్లాడే రాహుల్‌కు, హైదరాబాద్ నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే కనిపించడం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రకటించిన నిరుద్యోగ డిక్లరేషన్, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ కేవలం చిత్తు కాగితాలుగా మిగిలిపోయాయని, క్యాలెండర్ మారినా నిరుద్యోగుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు నమ్మి తెలంగాణ యువత ఘోరంగా మోసపోయిందని, తెలంగాణలో నడుస్తోంది ‘మొహబ్బత్ కీ దుకాణ్’ కాదు.. ‘ధోకేకా మకాన్’ అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు ఇచ్చి, ప్రక్రియ పూర్తయిన ఉద్యోగాలకు ఇప్పుడు నియామక పత్రాలు అందజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే 70 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. అలా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుని, రాహుల్ గాంధీకి జై కొడతానని సంచలన ప్రకటన చేశారు.
నిరుద్యోగులు తమ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దాడులు చేయిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. డిసెంబర్ 9 నుంచి రాష్ట్రంలో ఉద్యోగ పర్వం మొదలవుతుందని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ‘ఉన్మాదపర్వం’ చూపిస్తోందని విమర్శించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో అభ్యర్థులపై దాడులు, ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉద్యోగాలు అడిగితే ఉరికించి కొడుతున్నారని, యువత శోకాలు ఢిల్లీ పాలకులకు వినబడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిత్ర, ఇతిహాసాలు అస్సలు తెలియవని, ఆయన వాటిని చదువుకోవాలని కేటీఆర్ సూచించారు. 1952, 1969 ఉద్యమ కాలం నుండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువత గుండెల్లో గునపాలు గుచ్చుతూనే ఉందని, వేల మంది యువతీ యువకుల బలిదానాలకు ఆ పార్టీయే కారణమని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాల్లో యువతను చావగొట్టిన వాళ్లే మళ్లీ అధికారంలోకి వచ్చారని, అధికార దాహంతో కోటి మోసాలు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
“రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో.. నీ అహంకారానికి, అవినీతికి కాలం చెల్లింది. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది” అని కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అని, కాంగ్రెస్ చేసిన ఈ మహాద్రోహాన్ని యువత ఎప్పటికీ మర్చిపోదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.








