చనిపోయిన మనిషి చర్మంతో బ్యూటీ ట్రీట్మెంట్, ఇదెక్కడి కొత్త ట్రెండ్?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
చలిగా ఉంది…
ఆ తెల్లటి లైట్ల కింద…
నిశ్శబ్దంగా ఒక శరీరం పడుకుని ఉంది.
ముఖం మీద తెల్లని గుడ్డ. పాదానికి వేలాడుతున్న చిన్న ట్యాగ్.
గదిలో వినిపిస్తున్న ఒక్క శబ్దం… అది ఫ్రీజర్ మెల్లగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం.
మెల్లిగా గ్లోవ్స్ వేసుకున్న రెండు చేతులు…ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా తాకాయి. గుడ్డను తీయలేదు.
ముఖాన్ని చూడలేదు. నెమ్మదిగా చేతిని పైకెత్తాయి. చర్మాన్ని తాకాయి. ఒక చిన్న చర్మపు ముక్క… చాలా నెమ్మదిగా వేరు చేశాయి.
దాన్ని చిన్న గాజు సీసాలో ఉంచి ఒక కోడ్ రాసారు. అక్కడితో అయ్యిపోయింది. పేరు లేదు. ముఖం లేదు. గుర్తింపు లేదు.
కట్ చేస్తే….
ఆ సీసా…
చేతులు మారింది. నగరం మారింది. దేశం మారింది. రోజులు గడిచాయి.
చివరకు…ఒక తెల్లని గది.అక్కడ అద్దం ముందు ఒక మహిళ నిశ్శబ్దంగా కూర్చుంది.
తెల్ల కోటు వేసుకున్న డాక్టర్… ఒక సిరంజిని నెమ్మదిగా పైకి ఎత్తాడు. ఆ సిరంజిలో ఏముందో… ఆమెకు తెలియదు. చదువుతున్న మీకూ ఇంకా తెలియదు.
కానీ… కొన్ని నిమిషాల తర్వాత… ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకుని చిరునవ్వు నవ్వింది.
ఆ నవ్వు వెనుక… ఒక అపరిచితుడి చివరి దానం ఉంది. వినడానికి హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ లో సీన్లా అనిపించొచ్చు. కానీ ఇది కల్పితం కాదు.
దక్షిణ కొరియాలో చనిపోయిన మానుష్యుల చర్మ కణజాలంతో తయారైన కొత్త బ్యూటీ ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగాన్నే కాదు… నైతిక ప్రపంచాన్నీ కుదిపేస్తోంది.
అందం కోసం… సైన్స్ మరో హద్దు దాటిందా?
ఒకప్పుడు K-Beauty అంటే క్రీములు, సీరమ్స్, ఫేస్ మాస్క్‌లు. ఇప్పుడు కాదు. చర్మాన్ని పైపైన అందంగా చూపించడం నుంచి, చర్మ నిర్మాణాన్నే మళ్లీ నిర్మించే రీజెనరేటివ్ మెడిసిన్ వైపు దాని ప్రయాణం సాగుతోంది. దక్షిణ కొరియాలోని గాంగ్నమ్ క్లినిక్‌లలో వైరల్ అవుతున్న Re2O చికిత్స ఆ మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది.
అసలు ఇందులో ఏముంది?
దానం చేసిన మానవ చర్మంలోని కణాలను పూర్తిగా తొలగిస్తారు.దాంతో…చర్మానికి బలం ఇచ్చే Extracellular Matrix (ECM)ఉంటుంది. దానినే శుద్ధి చేసి ముఖంలోకి ఇంజెక్ట్ చేస్తారు. వయసు పెరగడం, లేదా వేగంగా బరువు తగ్గడం వల్ల కుంగిపోయిన చర్మానికి ఇది చాలా బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఖరీదు ఎంత?
ఒక్కో సెషన్‌కు సుమారు ₹40 వేల నుంచి ₹50 వేల వరకు ఖర్చవుతోంది. అయినా డిమాండ్ తగ్గడం లేదు. కొన్ని క్లినిక్‌ల్లో వెయిటింగ్ లిస్ట్‌లు కూడా ఏర్పడ్డాయి. అమెరికాలో కూడా ఇదే తరహాలో దానం చేసిన మానవ కొవ్వుతో రూపొందించిన Renuva అనే ఉత్పత్తి ఇప్పటికే మార్కెట్లో ఉంది.
అసలు వివాదం ఇక్కడే మొదలవుతోంది…
వాస్తవానికి ఈ చర్మం… అందం కోసం వాడకూడదు.మరి దేనికి వాడాలి అంటే…కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి…రీకన్స్ట్రక్టివ్ సర్జరీలకు…వైద్య అవసరాలకు ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగపడుతోంది. అలాంటి విలువైన దానాన్ని ఇప్పుడు కాస్మెటిక్ చికిత్సలకు ఉపయోగించడం సరైందేనా?
రేపు నిజంగా అవసరమైన రోగులకు కొరత వస్తే?
ఈ ప్రశ్నలు దక్షిణ కొరియా పార్లమెంట్ వరకూ చేరాయి. సోషల్ మీడియాలో కొందరు దీనిని “Corpse Fluid”(శవ ద్రవం) అంటూ విమర్శిస్తుంటే, కంపెనీలు మాత్రం ఇది దాతల స్పష్టమైన సమ్మతితో, అన్ని వైద్య ప్రమాణాల ప్రకారం జరిగే ప్రక్రియ అని చెబుతున్నాయి.
ఒక పాత డార్క్ ఫిక్షన్ గుర్తుకొస్తుంది…
ఈ వార్త చదువుతుంటే సాహిత్యంలో వచ్చిన ఒక డార్క్ ఫిక్షన్ గుర్తుకు వస్తోంది.Patrick Süskind రాసిన Perfume నవలలో అందం, పరిపూర్ణత కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడో ఒక భయానక రూపంలో చూపించారు. అక్కడ కథ కల్పితం. ఇక్కడ మాత్రం చట్టబద్ధంగా దానం చేసిన మానవ కణజాలంతో రూపుదిద్దుకున్న నిజ జీవిత వైద్య సాంకేతికత గురించి మాట్లాడుతున్నాం. రెండింటికీ పరిస్థితులు పూర్తిగా వేర్వేరు అయినా… “అందం, ఆనందం కోసం మనిషి హద్దులు ఎంతదూరం దాటతాడు?” అనే ప్రశ్న మాత్రం రెండింటిలోనూ ఒకటే.
భారత్‌లో పరిస్థితి?
ప్రస్తుతం భారతదేశంలో మానవ చర్మ కణజాలం ప్రధానంగా కాలిన గాయాలు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వంటి వైద్య అవసరాలకే ఉపయోగంలో ఉంది. దక్షిణ కొరియాలో కనిపిస్తున్న తరహా కాస్మెటిక్ వినియోగం ఇక్కడ సాధారణంగా అందుబాటులో లేదు.
వైద్య నిపుణులు కూడా ఇలాంటి కొత్త టెక్నాలజీల విషయంలో శాస్త్రీయ ఆధారాలు, నియంత్రణలు అత్యంత కీలకమని చెబుతున్నారు.
చివరికి…
ఒకప్పుడు మృతదేహాలు ప్రాణాలను కాపాడేవి.
ఇప్పుడు… యవ్వనాన్ని కాపాడుతున్నాయి.








