ఈటల, బండి మధ్య సయోధ్యకు లైన్ క్లియర్!?
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న ఢిల్లీ పెద్దలు, ఇక్కడి కీలక నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్‌ను ముగించడానికి నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో బుజ్జగింపుల పర్వం ఊపందుకుంది. రాష్ట్ర బీజేపీలో అత్యంత కీలక నేతలుగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు హైకమాండ్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా సమసిపోయేలా చూడాలనే పట్టుదలతో అధిష్టానం ఉంది. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన అభయ్ పాటిల్, రాత్రి పొద్దుపోయే వరకు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ అంతర్గత పరిణామాలు, విభేదాలకు గల కారణాలపై ఆయనతో ఆరా తీశారు. అనంతరం బండి సంజయ్‌తో కూడా అభయ్ పాటిల్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇవాళ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ నివాసంలో ఒక కీలకమైన భేటీ జరగనుంది. ఈ మీటింగ్‌కు ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరూ హాజరుకానుండటం విశేషం. అధిష్టానం దూతలుగా వచ్చిన సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ సమక్షంలో ఈ ఇద్దరు నేతలను ఒకే వేదికపైకి తెచ్చి, వారి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించడానికి లక్ష్మణ్ నివాసం వేదిక కాబోతోంది.
కొంతకాలంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య సఖ్యత లోపించిన విషయం బహిరంగ రహస్యమే. ఒకరిపై మరొకరు పరోక్షంగా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్ చూసి వారి అనుచరులు, అభిమానులు మరింత రెచ్చిపోయారు. పలు సందర్భాల్లో పరస్పర వ్యతిరేక పోస్టర్లు, ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఈ అంతర్గత విభేదాలు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ ప్రభావం పార్టీ బలోపేతంపై పడుతుండటంతో ఢిల్లీ పెద్దలు అలర్ట్ అయ్యారు.
ఇటీవల తెలంగాణలో పర్యటించిన జాతీయ నేతలు నితిన్ నబీన్, జేపీ నడ్డా సైతం రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి, పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని కరాఖండిగా చెప్పారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో, ఇప్పుడు నేరుగా హైకమాండ్ రాయబారాన్ని పంపింది.
తెలంగాణలో అధికారమే పరమావధిగా భావిస్తున్న బీజేపీకి ఈ ఇద్దరు నేతలూ అత్యంత అవసరం. బండి సంజయ్ మాస్ లీడర్షిప్, కేడర్‌లో ఉన్న ఫాలోయింగ్ పార్టీకి ఎంత ప్లస్సో.. ఈటల రాజేందర్ రాజకీయ అనుభవం, వ్యూహాలు అంతే ముఖ్యం. వీరిలో ఏ ఒక్కరిని వదులుకోవడానికి లేదా దూరం పెట్టడానికి అధిష్టానం సిద్ధంగా లేదు. ఇద్దరి బలాలు కలిస్తేనే తెలంగాణలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఢిల్లీ పెద్దలు బలంగా నమ్ముతున్నారు.
అధిష్టానం నేరుగా రంగంలోకి దిగడం, ఇవాళ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు కీలక నేతలు ముఖాముఖి కూర్చోనుండటంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చల తర్వాతైనా ఇద్దరు నేతలు తమ పంతాలను వీడి, పార్టీ కోసం కలిసి నడుస్తారని సాధారణ కార్యకర్తలు, క్యాడర్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఢిల్లీ పెద్దల బుజ్జగింపులు ఎంతవరకు పారుతాయో, టీ బీజేపీలో ఈ అంతర్గత సంక్షోభానికి తెరపడుతుందో లేదో చూడాలి.








