‘టెర్మినేటర్’ సినిమా నిజమవుతోందా? రంగంలోకి కిల్లర్ రోబోలు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
అర్ధరాత్రి…
నగరం మొత్తం నిశ్శబ్దంగా ఉంది.
దూరంగా ఒక ఆకారం నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది.
మొదట చూస్తే… మనిషిలాగే కనిపిస్తుంది. కానీ దగ్గరపడే కొద్దీ ఏదో తేడా తెలుస్తుంది. ముఖంలో ఏ ఎమోషన్ లేదు…కళ్లలో కనికరం లేదు… బుల్లెట్లు తగిలినా ఆగదు… తన లక్ష్యం చేరుకునే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు.
చివరికి తెలిసే నిజం ఒక్కటే… అది మనిషి కాదు… ఒక యంత్రం.
1984లో విడుదలైన ‘ది టెర్మినేటర్’ సినిమా ప్రపంచాన్ని భయపెట్టింది యాక్షన్ వల్ల కాదు… అది అడిగిన ఒక ప్రశ్న వల్ల.
“ఒక రోజు యంత్రాలే మనుషుల మీద యుద్ధం చేస్తే?”
నాలుగు దశాబ్దాల తర్వాత…
అదే ప్రశ్న మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఎందుకంటే… మనిషిలా నడిచే హ్యూమనాయిడ్ రోబోలకు ఆయుధాలు అమర్చే ప్రయోగాల దిశగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రక్షణ రంగాన్ని, టెక్నాలజీ ప్రపంచాన్ని ఒకేసారి ఆలోచింపజేస్తున్నాయి.
ఏం జరుగుతోంది?
ఇప్పటివరకు యుద్ధాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగిరి దాడులు చేయడం చూశాం. ఇప్పుడు అదే యుద్ధరంగంలో మనిషిలా నడిచే రోబోలు కనిపించే రోజులు దగ్గరపడుతున్నాయనే చర్చ మొదలైంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన Foundation Future Industries అనే స్టార్టప్ తయారు చేసిన ‘ఫాంటమ్’ (Phantom) అనే హ్యూమనాయిడ్ రోబో ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇది కేవలం ల్యాబ్‌లో ఉన్న ప్రాజెక్ట్ కాదు.
ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫాంటమ్ రోబోలను ఉక్రెయిన్‌లో లాజిస్టిక్స్ పనుల కోసం పరీక్షించింది. అంటే… సరుకులు తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సైనికులకు సహాయం చేయడం వంటి పనుల్లో వాటిని ఉపయోగించారు.
తర్వాత ఏం జరగబోతోంది?
ఈ సంస్థ సీఈఓ సంకేత్ పాఠక్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2027 నుంచి ఈ హ్యూమనాయిడ్ రోబోలపై ఆయుధాల పరీక్షలు (Weaponization Testing) ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది.
అంటే…రోబోలకు తుపాకులు అమర్చి యుద్ధ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయో పరీక్షించే దిశగా అడుగులు వేయాలని యోచిస్తోంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చిన వ్యవస్థ కాదు. ప్రస్తుతం ఇది పరీక్షల దశకు వెళ్లే ప్రణాళిక మాత్రమే.
ఎప్పుడు జరగబోతోంది?
రోబోలకు ఆయుధాలు అమర్చి, పరీక్షించేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తయింది. వచ్చే ఏడాది అంటే 2027 నుంచే ఈ వెపనైజ్డ్ హ్యూమనాయిడ్ల పరీక్షలు (Weaponization Testing) ప్రారంభం కాబోతున్నాయని కంపెనీ సీఈఓ సంకేత్ పాఠక్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్ వెనుక ఎవరు ఉన్నారు?
ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నది ఎవరో కాదు… స్వయంగా అమెరికా రక్షణ శాఖ (Pentagon). ఈ రకమైన రీసెర్చ్ కాంట్రాక్టుల కోసం సదరు స్టార్టప్‌కు పెంటగాన్ ఇప్పటికే దాదాపు రూ. 200 కోట్లకు పైగా ($24 మిలియన్లు) నిధులు కేటాయించింది.
ఎందుకు ఇలాంటి రోబోలు అవసరమని చెబుతున్నారు?
కంపెనీ వాదన ఏమిటంటే…
బాంబులు వేస్తే ఒకేసారి పెద్ద ప్రాంతం దెబ్బతింటుంది. డ్రోన్లకూ కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ నేలపై మనిషిలా నడిచే హ్యూమనాయిడ్ రోబోలు అవసరమైతే మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
మరోవైపు…
ఇలాంటి యంత్రాలను ప్రమాదకర ప్రాంతాలకు పంపడం వల్ల సైనికుల ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చనేది వారి వాదన. కానీ ప్రపంచాన్ని భయపెడుతున్న అసలు విషయం వేరే… రోబోల ను ఆపరేట్ చేస్తూ నిర్ణయం తీసుకునేది ఎవరు?
ట్రిగ్గర్ నొక్కేది ఒక మనిషా?
లేక…ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక యంత్రమా? ఒకవేళ AI తప్పు నిర్ణయం తీసుకుంటే… శత్రువు, అమాయక పౌరుడు మధ్య తేడా గుర్తించలేకపోతే…అదే పెద్ద సమస్య.
ఆ బాధ్యత ఎవరిది?
ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక చర్చకు కారణమవుతోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఇలాంటి స్వయంచాలక యుద్ధ రోబోలను నియంత్రించడానికి ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో స్పష్టమైన అంతర్జాతీయ ఒప్పందం లేదు.
భారత్‌కు దీనితో సంబంధం ఏమిటి?
ఈ వార్త అమెరికాకు మాత్రమే పరిమితం కాదు.
ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే AI ఆధారిత రక్షణ సాంకేతికతపై పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా AI, రోబోటిక్స్, స్వయంచాలక రక్షణ వ్యవస్థలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. భవిష్యత్తులో సరిహద్దుల్లో సైనికులతో పాటు ఇలాంటి హ్యూమనాయిడ్ యంత్రాలు కూడా కనిపించే అవకాశం ఉందని రక్షణ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరగా…
1984లో…
‘టెర్మినేటర్’ ఒక ప్రశ్న అడిగింది. “యంత్రాలు మనుషుల మీద యుద్ధం చేస్తే?”
2026లో…
ఆ ప్రశ్న సినిమా తెర నుంచి బయటకు వచ్చి ప్రపంచ రక్షణ రంగంలో నిజమైన చర్చగా మారింది.
ఈరోజు యుద్ధంలో ట్రిగ్గర్ నొక్కేది ఒక సైనికుడు.రేపు అదే పని ఒక AI ఆధారిత రోబో చేస్తే… అది మానవాళిని కాపాడే సాంకేతికత అవసరం అవుతుందా? లేక… మనిషి తన చేతులతో సృష్టించుకున్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా ఎవరి దగ్గరా లేదు.








