ఏపీని ఆశ పెడుతున్న అల్పపీడనం..!
తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో కొత్తగా ఒక అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ లోని(Andhra Pradesh) పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలు లేక అల్లాడిపోతున్న కోస్తాంధ్ర జిల్లాల రైతులకు, సాధారణ ప్రజలకు ఈ అల్పపీడనం ఇప్పుడు ఏకైక ఆశగా మారింది.
గత కొన్ని రోజులుగా పొడి వాతావరణం నెలకొనడంతో, ఈ అల్పపీడనమైనా కరుణించి మంచి వానలు కురిపించాలని జనం కోరుకుంటున్నారు. ప్రస్తుత సీజన్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న జిల్లాలకు ఈ వాతావరణ మార్పు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ తాజా వాతావరణ మార్పుల వల్ల కోస్తాంధ్రవ్యాప్తంగా నేడు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాబోయే మరో ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. సముద్రం విపరీతంగా అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు ఒడిశా తీరం వైపు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఖచ్చితమైన సూచనలు జారీ చేసింది. మత్స్యకారులు తమ వేట పడవలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని, తీరంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమై ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప సముద్ర తీరానికి ఎవరూ వెళ్లకూడదని స్థానిక యంత్రాంగం మైకుల ద్వారా ప్రచారం చేస్తోంది.. ఈ వర్షాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా ఎండిపోతున్న వ్యవసాయ పొలాలకు కూడా ప్రాణం పోస్తాయని రైతాంగం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.. ముఖ్యంగా ఖరీఫ్ సాగు ప్రారంభించి వానలు లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు ఈ ఐదు రోజుల వర్షాల సూచన కొండంత అండగా నిలిచింది.








