భర్త ఆరోగ్యం కోసం, తిరుమలకు పవన్ సతీమణి..!
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్నేవా మరోసారి తన భక్తిని చాటుకున్నారు. భర్త ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని కోరుకుంటూ ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల శ్రీవారి చెంతకు చేరుకున్నారు. నడక మార్గంలో తిరుమల(Tirumala) కొండపైకి చేరుకున్న అన్నా లెజ్నేవా.. సాంప్రదాయం ప్రకారం చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తిరుమలలోని నేరుగా వరాహస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవలే పవన్ కల్యాణ్ ఒక చిన్న శస్త్రచికిత్స (సర్జరీ) చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నా లెజ్నేవా ఈ కాలినడక యాత్ర చేసినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో, ప్రభుత్వ బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఆయన క్షేమం కోసం సతీమణిగా ఆమె పడుతున్న తపన, స్వామివారిపై ఆమెకున్న అపారమైన భక్తిభావం మెగా అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గతంలో కూడా అన్నా లెజ్నేవా కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా, శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. గతంలో వారి కుమారుడు చదువుతున్న స్కూల్లో జరిగిన ఒక అగ్నిప్రమాదం నుండి అతడు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో.. అలిపిరి మార్గం గుండా నడిచివచ్చి తలనీలాలు ఇస్తానని మొక్కుకుని, ఆ మొక్కును అప్పట్లో నెరవేర్చుకున్నారు. తాజాగా భర్త ఆరోగ్యం కోసం ఆమె మళ్లీ కాలినడకన రావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.








