PhonePe, Google Pay ఇక ఫ్రీ కాదా? వాడితే డబ్బులు కట్ అవుతాయా?
–సూర్య ప్రకాష్ జోశ్యుల
PhonePe…
Google Pay…
లేదా మీరు వాడే ఏదైనా UPI యాప్. రోజుకు ఎన్ని సార్లు ఓపెన్ చేస్తున్నారు?
దీనికి సమాధానం…ప్రతి భారతీయుడు రోజుకు కనీసం ఒక్కసారైనా మొబైల్ తీసి QR Code స్కాన్ చేస్తాడు. ఉదయం తాగే టీ షాప్ దగ్గరి నుంచి, కిరాణా కొట్టు, పెట్రోల్ బంక్… ఇలా ఎక్కడైనా సరే, జేబులో పర్సు తీయకుండా UPIతోనే చెల్లిస్తున్నాం. ఇన్నాళ్లూ “UPI అంటే ఫ్రీ” అనే నమ్మకంతో ఉన్న మనందరికీ ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఐదేళ్ల తర్వాత UPI వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
దీంతో అందరి మనసులో మొదలైన ఒకే ఒక్క ప్రశ్న… “ఇక నుంచి UPIతో స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయా?” అందుకే… దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక్క ప్రశ్న వినిపిస్తోంది…
“ఇక UPI కూడా ఫ్రీగా ఉండదా?”
ఈ ఒక్క ప్రశ్నతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నిజంగానే ఇక నుంచి ప్రతి UPI పేమెంట్‌కు ఛార్జీలు పడతాయా? లేక ఈ మార్పు వెనుక మరో కథ ఉందా?
ఇన్నాళ్లు ఫ్రీగా నడిచిన UPI… ఇప్పుడు ఎందుకు మార్పు?
అసలు సమస్య డబ్బు వసూలు చేయడమా? కాదు. UPIని ఇన్నాళ్లు ఫ్రీగా ఎలా నడిపించారు… ఇక ముందు ఎలా నడిపిస్తారు? అనేదే ఇప్పుడు అసలు చర్చ.
ప్రతి UPI ట్రాన్సాక్షన్ వెనుక…బ్యాంకులు…పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు…సర్వర్లు…సైబర్ సెక్యూరిటీ… ఫ్రాడ్ మానిటరింగ్… వంటి వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుంటాయి.ఈ సేవలకు భారీగా ఖర్చవుతోంది. ఇవన్నీ ఉచితంగా నడపడం బ్యాంకులు, PhonePe, Google Pay వంటి ఫిన్‌టెక్ కంపెనీలకు భారంగా మారింది.
కానీ 2020 జనవరి నుంచి UPIపై Zero MDR (Merchant Discount Rate) అమల్లో ఉండటంతో, ఈ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు ప్రత్యక్ష ఆదాయం దాదాపు లేదు. అందుకే ఇప్పుడు ఈ వ్యవస్థను దీర్ఘకాలంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఫార్ములాను పరిశీలిస్తున్నట్టు సమాచారం.
MDR అంటే ఏమిటి?
డిజిటల్ పేమెంట్ ప్రాసెస్ చేసినందుకు బ్యాంకులు, పేమెంట్ కంపెనీల సాంకేతిక వ్యవస్థకు ఇచ్చే చిన్న సర్వీస్ ఫీజే ఈ MDR. అయితే, దేశంలో డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి, ప్రజలందరూ క్యాష్ వదిలి UPI వాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రుసుమును పూర్తిగా ‘సున్నా’ (Zero-MDR) చేసింది.
లెక్కలు చెబుతున్న కథ ఇదే…
UPI వాడకం ఎంత వేగంగా పెరిగిందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.
FY25లో సుమారు 185 బిలియన్ ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి.
FY26లో అవి 240 బిలియన్లకు చేరినట్లు అంచనా.
ప్రస్తుతం ప్రతి నెలా 15 బిలియన్లకు పైగా UPI లావాదేవీలు జరుగుతున్నాయి.
మరోవైపు…డిజిటల్ పేమెంట్లకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు తగ్గుతున్నాయి.
FY24లో రూ.3,500 కోట్లు కేటాయించగా…
FY26 బడ్జెట్ అంచనాల్లో అది రూ.427 కోట్లకు తగ్గింది.
ఈ నేపథ్యంలో UPIకి స్థిరమైన ఆదాయ వ్యవస్థ అవసరమని బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు చాలా కాలంగా కోరుతున్నాయి. ఇటీవల పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా పెద్ద వ్యాపారులపై MDRను పునరుద్ధరించాలని సిఫార్సు చేసింది.
అయితే కేంద్రం అసలు ఏమి పరిశీలిస్తోంది?
ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదన ప్రకారం… ఏడాదికి రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులపై మాత్రమే MDR విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రతిపాదిత రుసుము…
5 నుంచి 7 బేసిస్ పాయింట్లు. అంటే… 0.05% నుంచి 0.07% మాత్రమే. ఇది 2020కు ముందు అమల్లో ఉన్న సుమారు 0.3% MDRతో పోలిస్తే చాలా తక్కువ.
మనం డబ్బులు చెల్లించాల్సి వస్తుందా?
ఇక్కడే చాలా మందిలో ఉన్న సందేహానికి సమాధానం దొరుకుతుంది.ప్రస్తుతం బయటకు వచ్చిన ప్రతిపాదన ప్రకారం…ఒకరి నుంచి మరొకరికి పంపే వ్యక్తిగత UPI లావాదేవీలకు ఎలాంటి మార్పు లేదు.చిన్న వ్యాపారుల వద్ద చేసే UPI పేమెంట్లపైనా MDR ఉండదు.ఈ ప్రతిపాదన ప్రధానంగా పెద్ద వ్యాపారులకే పరిమితం.
అయితే…ఇది ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. అయితే చివరికి మన జేబుపై ప్రభావం ఉంటుందా? ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది.
కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది!
గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే… ఈ ఫీజు నేరుగా మీకు పడదు. కానీ భవిష్యత్తులో ఆ పెద్ద వ్యాపారులు తమపై పడే ఈ అదనపు ఖర్చును భరించడానికి, తాము అమ్మే వస్తువుల ధరలను కొద్దిగా అయినా పెంచే అవకాశం ఉందా? ఆ భారాన్ని పరోక్షంగా మళ్లీ కస్టమర్ జేబుపైనే వేస్తారా? అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు విశ్లేషకుల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఎవరికి లాభం?
బ్యాంకులకు, పేమెంట్ కంపెనీలకు (PhonePe, Google Pay వంటివి): ఇన్నాళ్లూ కోట్ల కొద్దీ ట్రాన్సాక్షన్లు ఉచితంగా ప్రాసెస్ చేస్తూ సర్వర్ల మెయింటెనెన్స్ కోసం వారు వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ నిర్ణయంతో వారికి కొంత ఆదాయం సమకూరి, యూపీఐ మౌలిక వసతులు, సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి వీలవుతుంది.
ఎవరికి నష్టం?
చిన్న వ్యాపారులకు కాదు: ఏడాదికి రూ. 1 కోటి నుండి రూ. 1.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు పూర్తి మినహాయింపు ఉంటుంది.
పెద్ద వ్యాపారులకే భారం: పెద్ద స్టోర్ల యాజమాన్యాలు మాత్రమే ఈ MDR భరించాలి. అయితే వారు ఆ ఖర్చును వస్తువుల ధరల్లో కలిపితే, పరోక్ష ప్రభావం సామాన్యుడిపై పడొచ్చు.
ముగింపు
ఇన్నాళ్లూ UPI అంటే… “స్కాన్ చేయండి… డబ్బులు పంపండి… అంతే.” కానీ ఇప్పుడు ఆ సింపుల్ సిస్టమ్ వెనుక ఉన్న ఖర్చు గురించి కూడా చర్చ మొదలైంది. ఆ నిర్ణయం చివరికి ఎలాంటి రూపం దాలుస్తుంది? అది మార్కెట్‌పైనా, వినియోగదారులపైనా ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.








