సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని టిజి20 లీగ్ విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (Hyderabad E-Champions) జట్టు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టును అభినందించి చెక్కులను అందజేశారు. తొలి విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్ టీమ్ కు సిఎం రేవంత్ అభినందలు తెలిపారు. అనంతరం తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు రేవంత్ సూచించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే స్పష్టమైన లక్ష్యం, ఏకాగ్రత అవసరమని ఈ సందర్భంగా క్రీడాకారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు టీజీ-20 మంచి వేదికగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. ఈ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులందరికీ ఆయన మరోసారి అభినందనలు తెలియజేశారు. భవిష్యుత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణతో పాటు దేశానికి కీర్తి తీసుకురావాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. సిఎం కలిసిన వారిలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand), ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ (Ch. Kiran), జట్టు సభ్యులు తదితరులు ఉన్నారు.








