రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ… ఏంటి సంగతి?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన ఒక లేఖ ఇప్పుడు ఇరు రాష్ట్రాల రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోక్సో (POCSO) చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ రాసిన ఈ లేఖ, కేవలం ఒక విజ్ఞప్తిలా కాకుండా.. బాలల రక్షణ, వ్యవస్థాగత లోపాలు, రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ సమీకరణాలపై విశ్లేషణలకు వేదికగా నిలిచింది.
బాలల భద్రత, గౌరవం, భయం లేని జీవన హక్కు అనేవి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలని గుర్తు చేస్తూ, పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పవన్ కల్యాణ్ ఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో పోక్సో నిందితుడు బెయిల్పై బయటకు వచ్చి, బాధితురాలితో పాటు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. ఇలాంటి భయానక ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తప్పనిసరని సూచించారు.
బాధితులకు 24 గంటల్లోపు వైద్య పరీక్షలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ సూచించారు. కేసు దర్యాప్తు, ఛార్జిషీట్ దాఖలు ప్రక్రియను 60 నుండి 90 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. దర్యాప్తు అధికారులకు బాలల పట్ల సున్నితమైన వైఖరి ఉండాలని, ఫోరెన్సిక్, డిజిటల్ సాక్ష్యాల సేకరణలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. నిందితులకు బెయిల్ రాకుండా సమగ్ర నివేదికలు ఇవ్వాలని, బాధితుల రక్షణకు ‘విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్’ అమలు చేయాలని సూచించారు. నేర చరిత్ర ఉన్నవారిపై రౌడీ షీట్లు తెరిచి నిఘా ఉంచాలని స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ సెల్స్, సమగ్రమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ఉండాలని పవన్ వెల్లడించారు. పాఠశాలలు, వసతి గృహాలు, పూజా స్థలాల్లో ఆరోపణలు వస్తే పోలీసులకు నివేదించేలా ప్రోటోకాల్ ఉండాలని సూచించారు. ఈ సూచనలపై తీసుకున్న చర్యలను 30 రోజుల్లోపు నివేదిక రూపంలో తెలియజేయాలని కోరుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇందులో ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ రాసిన ఈ లేఖపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకులు దీనిని రెండు ప్రధాన కోణాల్లో చూస్తున్నారు. పవన్ కల్యాణ్ అనుకూల వర్గాలు, మద్దతుదారుల వాదన ప్రకారం.. నేరం ఎక్కడ జరిగినా, బాధితులు ఎవరైనా స్పందించడం ఒక బాధ్యతాయుతమైన నాయకుడి లక్షణం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో పాటు, పొరుగు రాష్ట్ర సీఎంకు లేఖ రాయడం ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజల, ముఖ్యంగా బాలల భద్రత పట్ల తనకు ఉన్న నిబద్ధతను చాటుకున్నారని వారు సమర్థిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఘటన సమాజాన్ని కదిలించిన నేపథ్యంలో, వ్యవస్థలో మార్పు కోసం పొరుగు రాష్ట్ర సీఎంతో చేతులు కలపడం ఆరోగ్యకరమైన రాజకీయ సంప్రదాయమని వారు పేర్కొంటున్నారు.
మరోవైపు, దీనిని పూర్తిగా రాజకీయ కోణంలో చూసేవారూ లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ, తెలంగాణ అంతర్గత పరిపాలనా వ్యవహారాలపై, అందునా ఒక ముఖ్యమంత్రికి లేఖ రాయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో జనసేన ఉనికిని చాటుకోవడానికి, అక్కడి ప్రజల్లో తన ఇమేజ్ను మరింత పెంచుకోవడానికి ఇదొక వ్యూహాత్మక అడుగు అని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, 30 రోజుల్లో నివేదిక కోరడం ద్వారా తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేలా ఈ లేఖ ఉందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ లేఖలో లేవనెత్తిన అంశాలు అత్యంత కీలకమైనవి. పోక్సో చట్టం అమలులో ఉన్న లోపాలను సవరించాలని, బాధితులకు తక్షణ న్యాయం జరగాలని కోరడం ముమ్మాటికీ స్వాగతించదగ్గ పరిణామం. మరి ఈ లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు? 30 రోజుల గడువులోగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి.








