అమెరికాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా యువతి మృతి!
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న (27) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. వినుకొండ మండలం ఉమ్మడివరానికి చెందిన ప్రసన్న, సాధారణ రైతు కుటుంబానికి చెందిన మక్కెన వెంకటేశ్వర్లు, గోవిందమ్మ దంపతుల పెద్ద కుమార్తె. ఆమె అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.
ప్రసన్న తన స్నేహితులైన శావల్యాపురం మండలం మతుకుమల్లికి చెందిన ముండ్రు నితీష్ మరియు ఆలూరి మాధవ్‌లతో కలిసి అద్దె కారులో విహారయాత్రకు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో, నితీష్ కారు నడుపుతుండగా అది ప్రమాదవశాత్తు ఒక చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక సీటులో ప్రయాణిస్తున్న ప్రసన్న అక్కడికక్కడే మరణించగా, కారు నడుపుతున్న నితీష్ మరియు ముందు సీటులో ఉన్న మాధవ్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి పరామర్శించారు.








