AI ఇక స్క్రీన్‌లో కాదు… మనతోనే ఉండబోతోంది! OpenAI కొత్త డివైస్
–సూర్య ప్రకాష్ జోశ్యుల
మీ అమ్మగారు వంట చేస్తున్నారు.
గ్యాస్ మీద పాలు పొంగుతున్నాయి.
మీరు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు.
అప్పుడు…
“పాలు పొంగిపోతున్నాయి…”
అని ఒక గొంతు వినిపిస్తుంది.
ఇంట్లో ఎవరూ అలా చెప్పలేదు.
మీ అమ్మగారు కూడా కాదు.
…
కొద్దిసేపటికి…
“నాన్నగారూ… మందులు వేసుకునే టైమ్ అయింది.”
అని మరోసారి అదే గొంతు గుర్తు చేస్తుంది.
…
మీ పిల్లాడు హోంవర్క్ చేయకుండా టీవీ చూస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
అప్పుడు…
“హోంవర్క్ పూర్తయ్యిందా?”
అని అడుగుతుంది.
ఒక్కసారి ఆలోచించండి… ఇవన్నీ చెప్పింది ఎవరు అని..
అయితే ఇవన్నీ చెప్పేది…మీ ఇంట్లో టేబుల్ మీద ఉన్న ఒక చిన్న డివైస్.అది పాటలు పెట్టే స్పీకర్ కాదు. అది కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ChatGPT కూడా కాదు.
ఏమిటి ఈ పరికరం?:
ఇది స్క్రీన్ లేని, పోర్టబుల్ (ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే) స్మార్ట్ స్పీకర్. దీన్ని యాపిల్ మాజీ డిజైన్ చీఫ్ జోనీ ఐవ్ (Jony Ive) నేతృత్వంలో రూపొందిస్తున్నారు.
ప్రత్యేకతలు:
దీనికి కెమెరా మరియు సెన్సార్లు ఉన్నాయి. దీనివల్ల ఇది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనుషులను అర్థం చేసుకోగలదు. ఇది కేవలం ఒక చోట ఉండటమే కాకుండా, తనంతట తానుగా కదలగల సామర్థ్యాన్ని (mechanical movement) కూడా కలిగి ఉంటుందని సమాచారం.
ఇందులో “GPT-Live” అనే అడ్వాన్స్డ్ వాయిస్ మోడల్ ఉంటుంది. ఇది మనుషులతో చాలా సహజంగా, అప్పటికప్పుడు మాట్లాడుతుంది. మీ అలవాట్లను బట్టి మీకు సహాయం చేస్తుంది (ఉదాహరణకు, రేపు ఉదయం మీటింగ్ ఉంటే ఈరోజే త్వరగా నిద్రపోమని చెప్పడం వంటివి).
లక్ష్యం: ఇది అమెజాన్ ఎకో (Alexa) లేదా యాపిల్ హోమ్పాడ్లకు పోటీగా వస్తోంది. అయితే, ఇది కేవలం కమాండ్స్ తీసుకునే యంత్రంలా కాకుండా, మనిషితో సహజంగా కలిసిపోయే ఒక కంప్యూటర్‌లా పనిచేయాలని OpenAI ప్రయత్నిస్తోంది.
Alexaతో తేడా ఏంటి?
ఇప్పటి వరకు స్మార్ట్ స్పీకర్ అంటే…”పాట పెట్టు…”, “అలారం పెట్టు…”, “వెదర్ చెప్పు…” అనే కమాండ్లకు స్పందించే పరికరం. కానీ OpenAI లక్ష్యం దానికంటే చాలా పెద్దది. వాయిస్ మాత్రమే కాదు… సందర్భాన్ని కూడా అర్థం చేసుకునే AIని రూపొందించడం. అందుకే చాలామంది దీనిని స్మార్ట్‌ఫోన్ తర్వాతి కంప్యూటింగ్ విప్లవంగా అభివర్ణిస్తున్నారు.
ఈ డివైస్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు?
ఒకప్పుడు iPhone, iPad, Apple Watch వంటి ఉత్పత్తుల డిజైన్‌లో కీలక పాత్ర పోషించిన Apple మాజీ చీఫ్ డిజైనర్ జోనీ ఐవ్ (Jony Ive) ఇప్పుడు OpenAIతో కలిసి ఈ కొత్త డివైస్‌పై పనిచేస్తున్నారు.
అయితే… ఒక ప్రశ్న మాత్రం అందరినీ వెంటాడుతోంది
AI మీకు సహాయం చేస్తుంది. మీ పనులు సులభం చేస్తుంది. అంతా బాగానే ఉంది. కానీ… మీ ఇంట్లోనే ఉండే ఒక డివైస్… కెమెరాలు, మైక్రోఫోన్లతో… రోజంతా మీతోనే ఉంటే?
ప్రైవసీ పరిస్థితి ఏంటి?
డేటా ఎలా భద్రపరుస్తారు?
ఎలాంటి సమాచారం స్టోర్ చేస్తారు? వినియోగదారులకు ఎంత నియంత్రణ ఉంటుంది? ఈ ప్రశ్నలకు OpenAI ఇంకా పూర్తి సమాధానాలు వెల్లడించలేదు.
ఈ కారణంగానే ఈ డివైస్ మార్కెట్లోకి వచ్చే సమయానికి ప్రైవసీపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ధర ఎంత? ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతం బయటకు వచ్చిన వివరాల ప్రకారం…
ధర సుమారు 200 నుంచి 300 డాలర్లు (దాదాపు ₹17 వేల నుంచి ₹26 వేల మధ్య) ఉండొచ్చని అంచనా.
2026లో ఈ డివైస్‌ను అధికారికంగా ప్రకటించి, 2027లో మార్కెట్లోకి తీసుకురావాలని OpenAI లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు?
తెలుగు వంటి ప్రాంతీయ భాషలకు మద్దతు ఉంటుందా? అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
చివరగా…
ఒకప్పుడు… మన ఇంట్లోకి టీవీ వచ్చింది. తర్వాత కంప్యూటర్ వచ్చింది. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇప్పుడు…AI కూడా మన ఇంట్లో ఒక సభ్యుడిగా మారే రోజులు దగ్గరపడుతున్నాయా? అది మన జీవితాన్ని మరింత సులభం చేస్తుందా?
ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది… ChatGPT ఇక స్క్రీన్‌లో మాత్రమే ఉండాలని OpenAI కోరుకోవడం లేదు. అది మన జీవితంలో భాగం కావాలని చూస్తోంది. ఆ మార్పును మనం ఎంతవరకు స్వీకరిస్తామన్నదే అసలు ప్రశ్న.
ఇవి కూడా చదవండి








