ద్రావిడ్ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన రోకో..!
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు, నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. ఇంగ్లాండ్ వేదికగా బరిలోకి దిగుతున్న సీనియర్ ద్వయం వన్డేల్లో ఒక అరుదైన ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు రేసులో నిలిచింది. ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ రికార్డును అధిగమించే సువర్ణావకాశం ఇప్పుడు వీరిద్దరికీ లభించింది.
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లలో రాహుల్ ద్రావిడ్ 20 ఇన్నింగ్స్‌ల్లో 648 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, సచిన్ టెండూల్కర్ (639 పరుగులు), ఎంఎస్ ధోని (613 పరుగులు) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో 16 మ్యాచ్‌లలో 581 పరుగులతో నాల్గో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, ద్రావిడ్ రికార్డును దాటడానికి కేవలం 68 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ ఈ మైలురాయిని దాటి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం 10 ఇన్నింగ్స్‌ల్లో 410 పరుగులతో ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లందరి కంటే రోహిత్ శర్మ 58.57 అత్యుత్తమ బ్యాటింగ్ సగటును కలిగి ఉండటం విశేషం. ద్రావిడ్ రికార్డుకు రోహిత్ కాస్త దూరంగా ఉన్నప్పటికీ, ఫామ్‌లోకి వస్తే వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల హిట్‌మ్యాన్ ఈ సిరీస్‌లోనే ఆ వ్యత్యాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు ఇదే చివరి ఇంగ్లాండ్ టూర్ అయ్యే అవకాశం ఉన్నందున, ఈ సిరీస్‌ను వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.








