ఇంట్లోనే రుచికరమైన హల్వా–పూరి.. ఈ సింపుల్ రెసిపీతో హోటల్ స్టైల్ రుచి మీ సొంతం
హల్వా–పూరి అనేది ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన అల్పాహారం. అయితే ఇప్పుడు ఈ వంటకం దేశవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టంగా తింటున్నారు. సెలవు రోజులు, పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ కాంబినేషన్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. సరైన కొలతలు, సరైన విధానం పాటిస్తే హల్వా మెత్తగా, పూరీలు పొంగిపొర్లేలా వస్తాయి.
హల్వాకి కావాల్సిన పదార్థాలు

హల్వా తయారీకి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార లేదా ¾ కప్పు బెల్లం పొడి, రెండున్నర కప్పుల నీరు, నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి, అర టీస్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్, కొద్దిగా బాదం లేదా పిస్తా తురుము తీసుకోవాలి.
హల్వా తయారీ విధానం

ముందుగా ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ను బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి. అదే బాణలిలో రవ్వను తక్కువ మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు స్వల్ప బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మరో పాత్రలో నీటిని మరిగించి అందులో పంచదార లేదా బెల్లం వేసి పూర్తిగా కరిగించాలి. ఇప్పుడు ఆ మరిగిన నీటిని నెమ్మదిగా రవ్వలో పోస్తూ ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. రవ్వ పూర్తిగా ఉడికి చిక్కబడిన తర్వాత మిగిలిన నెయ్యి, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి మరో రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా బాదం లేదా పిస్తా తురుము చల్లితే హల్వా మరింత రుచిగా ఉంటుంది.
పూరీలకు కావాల్సిన పదార్థాలు

పూరీల కోసం రెండు కప్పుల గోధుమపిండి, అర కప్పు మైదా, చిటికెడు ఉప్పు, ఒక టీస్పూన్ రవ్వ, ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి, అవసరమైనంత నీరు, వేయించడానికి సరిపడా నూనె తీసుకోవాలి. గోధుమపిండి, మైదా, రవ్వ, ఉప్పు, నూనె అన్నింటినీ కలిపి కొద్దికొద్దిగా నీరు పోస్తూ గట్టిగా పిండి కలపాలి. ఈ పిండిని తడి గుడ్డతో కప్పి 20 నిమిషాలు పక్కన ఉంచాలి.
పూరీలు తయారు చేసే విధానం

తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, చాలా పలుచగా కాకుండా మధ్యస్థ మందంతో గుండ్రంగా ఒత్తుకోవాలి. లోతైన బాణలిలో నూనె బాగా వేడి అయ్యాక ఒక్కో పూరీని వేసి గరిటతో స్వల్పంగా నొక్కితే పూరీ బాగా పొంగుతుంది. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి టిష్యూపై తీసుకోవాలి.
వడ్డించే విధానం
వేడివేడిగా ఉన్న పూరీలను తాజాగా తయారైన హల్వాతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది. దీనితో పాటు ఆలుగడ్డ కూర లేదా నల్ల శనగ కూర వడ్డిస్తే ఉత్తర భారతీయ స్టైల్ హల్వా–పూరి రుచిని ఆస్వాదించవచ్చు.








