కోట్ల లాభం… మూడు నెలలకే దివాళా! కంపెనీలను నిజంగా చంపేది ఏంటి?
“మా కంపెనీకి ఈ ఏడాది భారీ లాభాలు వచ్చాయి.”
ఒక కంపెనీ ఇలా ప్రకటించగానే మీడియా హర్షం వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్లు చప్పట్లు కొట్టారు. కానీ ఇది జరిగి
మూడునెలలు కూడా గడవలేదు. అదే కంపెనీ అప్పులు చెల్లించలేక కుప్పకూలిపోయింది.
ఇది సినిమా కథ కాదు. వ్యాపార ప్రపంచంలో పదే పదే జరిగే నిజం.
ఇలాంటప్పుడు మనని వెంటాడే ప్రశ్న. లాభాలు వస్తున్న కంపెనీ హఠాత్తుగా ఎలా కూలిపోతుంది? అని.
మనలో చాలామంది ఇప్పటికీ ఒక విషయం నమ్ముతుంటారు.
“లాభం వస్తే వ్యాపారం బాగానే ఉంది.” కానీ…అసలు విషయం ఏమిటంటే…వ్యాపార ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అపోహ ఇదే.
ఇవి కూడా చదవండి
ఎందుకంటే…
చాలా కంపెనీలు నష్టాల వల్ల కాదు… చేతిలో డబ్బు లేక కుప్పకూలుతాయి.
ఈ ఒక్క తేడా అర్థమైతే… కొన్ని కంపెనీలు ఒక్కసారిగా రాత్రికి రాత్రే ఎందుకు అదృశ్యమైపోతాయో… ఎందుకు కొందరు వ్యాపారులు “లాభాల్లో ఉన్నా” రాత్రిళ్లు నిద్రపోలేకపోతారో… ఎందుకు పెద్ద ఇన్వెస్టర్లు లాభాల కంటే మరో సంఖ్యను ఎక్కువగా చూస్తారో… అన్నీ అర్థమవుతాయి.
ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆ స్థానంలో ఊహించుకోండి…
మీరు ఒక కిరాణా షాపు నడుపుతున్నారు.
ఈ నెల అమ్మకాలు అద్భుతంగా జరిగాయి. నెలాఖరులో లెక్కలు చూసుకున్నారు. ఖర్చులన్నీ తీసేస్తే…రూ. 2 లక్షల లాభం. మీ ముఖంలో చిరునవ్వు. “ఈ నెల చాలా బాగా అమ్మాం.” అనుకున్నారు.
అంతలో ఫోన్ మోగింది.
“అన్నా… సరుకు ఇచ్చాం. డబ్బులు ఎప్పుడు పంపిస్తారు?” అని హోల్‌సేలర్ అడిగాడు.
ఇంకో వైపు… మీ షాపులో పని చేసే అబ్బాయి…
“సార్… ఈరోజు జీతం ఇస్తారా?”
అని అడిగాడు.
మీరు వెంటనే బ్యాంక్ యాప్ ఓపెన్ చేశారు. బ్యాలెన్స్ రూ. 5,000 మాత్రమే ఉంది. ఒక్కసారిగా గుండె దడ మొదలైంది. “రూ. 2 లక్షల లాభం వచ్చింది కదా… మరి డబ్బు ఎక్కడికి పోయింది?”
అసలు షాక్ ఇప్పుడు మొదలవుతుంది…
లెక్కల్లో మీరు అబద్ధం చెప్పలేదు. నిజంగానే రూ. 2 లక్షల లాభం వచ్చింది. కానీ… ఆ నెలలో రూ. 1.5 లక్షల సరుకును కస్టమర్లకు క్రెడిట్ మీద ఇచ్చారు. లాభం లెక్కల్లో పడింది. డబ్బు మాత్రం ఇంకా చేతికి రాలేదు. అంతేకాదు…. వచ్చే పండగ కోసం ముందుగానే కొత్త స్టాక్ కొనేశారు. చేతిలో ఉన్న నగదు…షాపులో ఉన్న సరుకుగా మారిపోయింది.
అంటే…
లాభం వచ్చింది. డబ్బు మాత్రం రాలేదు. ఇదే వేలాది వ్యాపారాలను నెమ్మదిగా చంపే కనిపించని వ్యాధి. చాలా వ్యాపారాల్లో ఇదే జరుగుతుంది. అందుకే వేలాది చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి
చాలామంది అనుకుంటారు…
నష్టాలు వస్తేనే కంపెనీ మూతపడుతుందని. అసలు కాదు. చాలా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రావాల్సిన డబ్బు నెలల తరబడి రాదు. కాగితాల మీద లాభం ఉంటుంది. బ్యాంకులో ఖాళీ. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు. సరఫరాదారులకు డబ్బులు చెల్లించలేరు. అక్కడి నుంచే అసలు సంక్షోభం మొదలవుతుంది.
ప్రపంచ దిగ్గజాలు కూడా ఈ సమస్య నుంచి తప్పించుకోలేకపోయాయి. ప్రపంచంలోని కొన్ని పెద్ద కంపెనీల పతనంలో… అప్పుల భారం, నగదు కొరత, బలహీనమైన నగదు ప్రవాహం కీలక పాత్ర పోషించాయి. Evergrande వంటి రియల్ ఎస్టేట్ దిగ్గజమైనా…Thomas Cook వంటి శతాబ్దాల చరిత్ర ఉన్న కంపెనీ అయినా… కాగితాల మీద కనిపించే సంఖ్యలతో మాత్రమే వ్యాపారం నిలబడదని వాటి కథలు గుర్తు చేస్తున్నాయి.
వ్యాపారం బతకాలంటే…
రోజూ నగదు కూడా రొటేట్ అవ్వాలి.
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ ఒక కంపెనీని పరిశీలించినప్పుడు… ఆ కంపెనీ నిజంగా నగదు సృష్టిస్తోందా? లేక… లాభాల లెక్కలు మాత్రమే అందంగా కనిపిస్తున్నాయా? అనే విషయానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే లెక్కలు మారవచ్చు. అంచనాలు మారవచ్చు. కానీ…బ్యాంకులో ఉన్న డబ్బు అబద్ధం చెప్పదు.
పెద్ద ఇన్వెస్టర్లు చూసే ఆ ఒక్క నంబర్… ఇప్పటివరకు చెప్పిన ఈ కథ మొత్తాన్ని…పెద్ద పెట్టుబడిదారులు ఒకే సంఖ్యతో కొలుస్తారు. దాని పేరే… CFO / EBITDA Ratio.
పేరు కాస్త కష్టం.
కానీ అర్థం చాలా సులభం. ఒక కంపెనీ రూ. 100 లాభం చూపిస్తే… అందులో నిజంగా ఎన్ని రూపాయలు నగదుగా బ్యాంకులోకి వచ్చాయి? అదే ఈ కొలమానం చెబుతుంది.
ఒక కంపెనీ రూ. 100 లాభం చూపించి… చేతిలోకి రూ. 10 మాత్రమే తెచ్చుకుంటే…అది ప్రమాద సంకేతం.మరో కంపెనీ అదే రూ. 100 లాభంలో…రూ. 95 నగదుగా మార్చగలిగితే…అది బలమైన వ్యాపారం. అందుకే…పెద్ద ఇన్వెస్టర్లు లాభాలు చూసి మురిసిపోరు. ముందు నగదు చూస్తారు.
ఈ ఒక్క ప్రశ్న అడగండి…
రేపు ఎవరైనా ఫలానా కంపెనీకి కోట్ల రూపాయల లాభం వచ్చింది. అని చెప్పినప్పుడు…వెంటనే చప్పట్లు కొట్టకండి. ఒక్క ప్రశ్న అడగండి.
“ఆ లాభంలో నిజంగా బ్యాంకు ఖాతాలోకి ఎంత డబ్బు వచ్చింది?”
ఎందుకంటే… వ్యాపార ప్రపంచంలో ఒక మాట ఉంది. “లాభం ఒక కథ చెబుతుంది… నగదు మాత్రం నిజం చెబుతుంది.” ఆ నిజాన్ని అర్థం చేసుకున్నవారే… మంచి వ్యాపారాలు నిర్మిస్తారు. మంచి పెట్టుబడులు పెడతారు.
మిగతావాళ్లు…
కాగితాల మీద కనిపించే లాభాలనే నిజం అనుకుని మోసపోతారు.








