రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు..! శిక్ష పడుతుందా?
రాష్ట్రంలో చట్టాలను, నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పేరిట రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు హక్కు నమోదై ఉండటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి పేరు, రెండు వేర్వేరు పార్లమెంటరీ పరిధులలోని ఓటర్ల జాబితాలో కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. అధికారిక ఓటరు నమోదు డేటా ద్వారా ఈ విషయం స్పష్టమవడంతో, సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు, రాజకీయ విశ్లేషకులు దీనిపై రకరకాలుగా ఆరా తీస్తున్నారు.
ప్రస్తుత ఓటర్ల జాబితా రికార్డుల ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లు తెలుస్తోంది.
1. కొడంగల్ నియోజకవర్గం: మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే కొడంగల్‌లో హౌస్ నంబర్ 1-209 అడ్రస్‌తో ఆయన ఓటు నమోదై ఉంది.
2. అచ్చంపేట నియోజకవర్గం: నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం, వాంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలోని ఆయన ఇంటి నంబర్ 3-48 అడ్రస్‌తో మరో ఓటు నమోదై ఉంది.
అయితే, ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు వేర్వేరు నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాలోనూ రేవంత్ రెడ్డికి ఒకే ఒక ఎలక్షన్ ఐడీ కార్డ్ నంబర్ (TES0274035) ఉండటం గమనార్హం.
ఈ డబుల్ ఎంట్రీ రికార్డులలో ముఖ్యమంత్రి పేరు స్పెల్లింగ్‌లో కూడా తప్పులు దొర్లాయి. ఆయన పేరు అసలు స్పెల్లింగ్ “Revanth” కాగా.. రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలోనూ నరసింహా రెడ్డి కుమారుడైన “Anumula Revant Reddy” అని నమోదై ఉంది.
సాధారణంగా ఇలాంటి స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దుకోవడానికి నిబంధనల ప్రకారం సంబంధిత ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారికి ఫామ్-8 సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, 1950 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏ పౌరుడూ కూడా ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హుడు కాదనే కఠినమైన నిబంధన ఉంది. ఈ బహుళ ఓటు నమోదును తొలగించుకోవడానికి, తాము సాధారణంగా నివసించని నియోజకవర్గ పరిధిలోని అధికారికి స్వచ్ఛందంగా ఫామ్-7 సమర్పించి, ఒక ఓటును రద్దు చేయాలని కోరే చట్టపరమైన అవకాశం ఓటరుకు ఉంటుంది.
దేశంలో బహుళ ఓట్ల నమోదు అంశంపై చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. రెండు చోట్ల ఒకే వ్యక్తికి ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష తప్పదని ఇటీవలే ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి బహుళ రాష్ట్రాల్లో ఓటరుగా నమోదయ్యారనే ఆరోపణలపై బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం, ఆ తర్వాత ఆయన బెయిల్ పొంది చట్టపరమైన విచారణను ఎదుర్కొంటుండటం మనకు తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే, ముఖ్యమంత్రి ఓటరు నమోదు డేటాలోనూ ఇలాంటి డబుల్ ఎంట్రీలు బయటపడటంతో.. “సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఏడాది కాలం జైలుశిక్ష పడే అవకాశం ఏమైనా ఉందా?” అంటూ నెటిజెన్లు, ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నాయి. అత్యున్నత పదవిలో ఉన్న నేతలకు సంబంధించిన ఓటరు డేటాలోనే ఇలాంటి లోపాలు ఉండటం అధికారుల నిర్లక్ష్యమా లేక సాంకేతిక పొరపాటా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. ఏది ఏమైనా, ఈ ‘డబుల్ ఓటు’ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.








