ముగిసిన ‘మాటా’ రెండో రోజు సంబరాలు.. జయప్రద, నిఖిల్ సందడి!
అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండో కన్వెన్షన్ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రవాస తెలుగు సంబరాల్లో భాగంగా.. రెండో రోజు వేడుకలు కనులపండువగా సాగాయి. అమెరికా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన తెలుగు కుటుంబాలతో ఎక్స్పో సెంటర్ సందడిగా మారింది. ఈ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథి, ప్రముఖ సినీ నటి జయప్రదతో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ పాల్గొని సందడి చేశారు.
మాటా సేవలు అనిర్వచనీయం…
మాటా ఈవెంట్లో ప్రవాస తెలుగు కమ్యూనిటీ చూపిస్తున్న హై-లెవెల్ ఎనర్జీ, వారు సాధిస్తున్న అసాధారణ విజయాలు చూసి తాను ఎంతగానో ఆశ్చర్యపోవడంతో పాటు ఎంతో సంతోషపడ్డానని నిఖిల్ పేర్కొన్నారు. తన రాబోయే పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘స్వయంభూ’లో కనిపిస్తున్నది తానేనని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఇదే సమయంలో తన హెయిర్‌కట్ గురించి సరదాగా వ్యాఖ్యానిస్తూ.. ఈ కొత్త లుక్ ‘హ్యాపీ డేస్’ సినిమా కోసం కాదు అంటూ నవ్వులు పూయించారు.
మాటా కన్వెన్షన్‌కు చెందిన చాలా మంది స్థానిక పిల్లలు తన పర్ఫార్మెన్స్ కోసం తనతో కలిసి స్టేజ్ పంచుకోబోతున్నారని చెబుతూ, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ నటి జయప్రద మాట్లాడుతూ.. మహాసభల్లో ప్రతి ఒక్కరినీ కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, మాటా సంస్థ చేపట్టిన సరికొత్త సామాజిక, సాంకేతిక వినూత్న కార్యక్రమాలను అభినందిస్తూ ఆ టీమ్‌కు కంగ్రాట్స్ చెప్పారు.
ఈ మహాసభల వేదికపై ప్రవాస తెలుగు సమాజం చూపిస్తున్న ఉత్సాహం, సాంస్కృతిక కార్యక్రమాల జోష్ అద్భుతంగా ఉన్నాయని ఆమె అన్నారు. మాటా సంస్థ సేవ, సంస్కృతి, సమానత్వం అనే విలువలతో ముందుకు సాగుతూ భావి తరాలకు తెలుగు వారసత్వాన్ని అందిస్తున్న తీరును ప్రశంసించారు. మాటా ఇలాగే విజయవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
అలరించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు
ఈ రెండు రోజుల వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణం, యూత్, బిజినెస్, ఏఐ హ్యాకథాన్ ఫోరమ్‌లకు ప్రవాస తెలుగువారి నుండి భారీ స్పందన లభించింది. వ్యాపార స్టాళ్లు నెట్‌వర్కింగ్‌కు వేదికగా నిలిచాయి. ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల ప్రత్యేక మ్యూజికల్ నైట్‌తో పాటు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఆధ్వర్యంలో జరిగిన గ్రాండ్ ఫినాలే కాన్సర్ట్ ఈ రెండో రోజు ముగింపు వేడుకలకు ప్రధాన హైలైట్‌గా నిలిచి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అమెరికాలో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఐక్యతను చాటిచెప్పేలా ఈ మహాసభలు విజయవంతంగా ముగిశాయని మాటా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.








