ఒంటి కన్ను… కానీ సింహం చూపు! బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భయపెట్టిన మహారాజు!
– సూర్య ప్రకాష్ జోశ్యుల
ఆయనకు ఒక కన్ను లేదు…
చూస్తే ముఖం మీద మశూచి మచ్చలు…
గంభీరంగా రాజులా కూడా కనిపించరు…
కానీ ఆయన గుర్రం ఎక్కి యుద్ధరంగంలోకి దిగితే ఆప్ఘన్ లు వణికిపోయేవారు.
ఆయన పేరు వినగానే శత్రువులు కత్తులు దూయడానికి ముందు రెండుసార్లు ఆలోచించేవారు.
ఆయన బతికున్నంత కాలం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పంజాబ్ వైపు కన్నెత్తి చూడలేకపోయింది.
ఆయన ఒక రాజు కాదు… ఒక సామ్రాజ్యం. ఒక యోధుడు కాదు… ఒక యుగం. ఆయనే మహారాజా రంజిత్ సింగ్.
ప్రపంచ చరిత్రలో అబ్రహం లింకన్, విన్స్టన్ చర్చిల్, జూలియస్ సీజర్‌లాంటి దిగ్గజాల పేర్ల మధ్య నిలబడి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిబిసీ ఓటింగ్‌లో “గొప్ప నాయకుడు”గా గుర్తింపు పొందిన భారతీయుడు.
ఆయన గొప్పతనం కేవలం యుద్ధాల్లో లేదు… ఆయన నిర్మించిన రాజ్యంలో ఉంది.
ఆయన చూపించిన నాయకత్వంలో ఉంది. ఆయన కాపాడిన భారతీయ ఆత్మగౌరవంలో ఉంది. అదెలాగో చూద్దాం
భారతదేశం చీకట్లో ఉన్నప్పుడు… పంజాబ్‌లో ఒక సింహం లేచింది
18వ శతాబ్దం చివర్లో పంజాబ్ పరిస్థితి దారుణంగా ఉండేది. మొఘల్ సామ్రాజ్యం కూలిపోయింది. చిన్న చిన్న సిఖ్ మిస్ల్లు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. అప్ఘన్లు అవకాశం దొరికినప్పుడల్లా దండయాత్రలు చేస్తున్నారు.
గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. భయం పాలన చేస్తోంది. అలాంటి సమయంలో 1780లో జన్మించిన ఒక బాలుడు… కొన్ని దశాబ్దాల తర్వాత మొత్తం పంజాబ్ చరిత్రను మార్చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
ఒక కన్ను కోల్పోయాడు… కానీ సంకల్పాన్ని కాదు
1780లో జన్మించిన రంజిత్ సింగ్ చిన్నతనంలోనే మశూచి బారిన పడ్డారు. ఆ వ్యాధి ఆయన ఎడమ కంటి చూపును తీసుకుంది. ముఖమంతా మచ్చలు మిగిల్చింది.
చాలామంది జీవితంలో చిన్న అవరోధాలకే వెనక్కి తగ్గిపోతారు. కానీ మహారాజా రంజిత్ సింగ్ జీవితాన్ని చూస్తే, మనిషిని పరిస్థితులు కాదు… సంకల్పం నిర్వచిస్తుందని అర్థమవుతుంది.
పన్నెండేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన, చిన్న వయసులోనే నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. సాధారణంగా ఆ వయసులో పిల్లలు ఆటలతో గడుపుతారు. కానీ ఆయన యుద్ధాలు, రాజకీయాలు, దౌత్యం మధ్య పెరిగారు. అక్కడి నుంచే ఒక అసాధారణ నాయకుడి ప్రయాణం ప్రారంభమైంది.
విభజనలో ఉన్న పంజాబ్‌ను ఏకం చేసిన ఉక్కు సంకల్పం
ఆ కాలంలో పంజాబ్ ఒకే రాజ్యం కాదు. చిన్న చిన్న సిఖ్ మిస్ల్లుగా విడిపోయి, ఒకదానితో ఒకటి పోరాడుకునే పరిస్థితి. మరోవైపు అఫ్గాన్ దండయాత్రలు. ప్రజల జీవితాలు భయంతో నిండిపోయాయి. ఈ గందరగోళాన్ని చూసి చాలామంది నిరాశ చెందారు. కానీ రంజిత్ సింగ్ అందులో అవకాశాన్ని చూశారు.
యుద్ధరంగంలో ధైర్యాన్ని, రాజకీయాల్లో తెలివిని, దౌత్యంలో ఓర్పును ఉపయోగించి విడిపోయిన శక్తులన్నింటినీ ఒకే జెండా కిందకు తీసుకొచ్చారు. 1801లో పంజాబ్ మహారాజుగా పట్టాభిషేకం పొందారు.
అది కేవలం ఒక రాజ్య స్థాపన కాదు. పంజాబ్ పునర్జన్మ. సింహాసనం మీద కాదు… ప్రజల గుండెల్లో కూర్చున్న రాజు గా అందరూ మెచ్చుకున్నారు.
మరో విషయం ఇక్కడ చెప్పుకోవాలి. చాలామంది రాజులు తమ అధికారాన్ని ప్రదర్శించడానికి బంగారు సింహాసనాలపై కూర్చుంటారు. కానీ రంజిత్ సింగ్ వేరేలా ఆలోచించారు. పట్టాభిషేకం రోజున బంగారు సింహాసనాన్ని పక్కనపెట్టి, సాధారణ కార్పెట్‌పై కూర్చున్నారు. తాను ప్రజలకు యజమాని కాదని, సేవకుడినని ప్రకటించారు.
ఈ ఒక్క సంఘటన ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. శక్తి ఉన్నప్పుడు వినయంగా ఉండటం చాలా అరుదు. రంజిత్ సింగ్ ఆ అరుదైన నాయకుల్లో ఒకరు.
మతాన్ని కాదు… ప్రతిభను చూసిన మహారాజు
ప్రపంచం కుగ్రామం అయ్యిన ఇన్నేళ్ల కూడా ప్రపంచం మతం, కులం, వర్గాల పేరుతో విభజనలను చూస్తోంది. కానీ రెండు వందల ఏళ్ల క్రితమే మహారాజా రంజిత్ సింగ్ ఆ గోడలను కూల్చేశారు. ఆయన ప్రభుత్వంలో ప్రధానమంత్రి హిందువు. విదేశాంగ మంత్రి ముస్లిం. ఆర్థిక మంత్రి బ్రాహ్మణుడు. రాజు మాత్రం సిక్కు.
ఆయనకు మతం ముఖ్యం కాదు. సామర్థ్యం ముఖ్యం. అందుకే ఆయన పాలనలో వివిధ వర్గాల ప్రజలు తమను తాము ఆ రాజ్యంలో భాగంగా భావించారు. గోల్డెన్ టెంపుల్ నుంచి కాశీ వరకు… అందరికీ చెందిన మహారాజు
మహారాజా రంజిత్ సింగ్ పేరు చెప్పగానే గోల్డెన్ టెంపుల్ గుర్తుకు వస్తుంది. అమృత్‌సర్‌లోని హరిమందిర్ సాహిబ్‌కు ఆయన ఇచ్చిన బంగారమే దానిని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్‌గా మార్చింది. కానీ ఆయన దాతృత్వం అక్కడితో ఆగలేదు.
కాశీ విశ్వనాథ ఆలయానికి బంగారం అందించారు. జ్వాలాముఖి ఆలయానికి విరాళాలు ఇచ్చారు. మసీదుల పునరుద్ధరణకు భూములు, నిధులు కేటాయించారు. ఆయనకు మతాలు వేరు కావచ్చు. కానీ ప్రజలు ఒక్కటే. అందుకే ఆయనను ఒక వర్గం మాత్రమే కాదు… మొత్తం పంజాబ్ ప్రేమించింది.
కోహినూర్‌ను కూడా దేవుడి పాదాల వద్ద ఉంచాలనుకున్న మహారాజు
మహారాజా రంజిత్ సింగ్ పేరు వినగానే చాలా మందికి కోహినూర్ గుర్తుకు వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వజ్రాల్లో ఒకటైన కోహినూర్ ఒకప్పుడు ఆయన ఖజానాలో ఉండేది. కానీ ఆ వజ్రాన్ని ఆయన కేవలం సంపదగా చూడలేదు.
చరిత్రకారుల కథనాల ప్రకారం, జీవిత చరమాంకంలో కోహినూర్‌ను పూరీ జగన్నాథ ఆలయానికి సమర్పించాలని ఆయన కోరిక వ్యక్తం చేశారు.
అయితే విధి మరోలా నిర్ణయించింది. ఆ కోరిక నెరవేరకముందే మహారాజు కన్నుమూశారు. కొన్నేళ్ల తర్వాత సిక్కు సామ్రాజ్యం బ్రిటీష్‌ల చేతుల్లోకి వెళ్లింది. చివరికి కోహినూర్ లండన్ చేరింది. ఇక్కడ ఒక ప్రశ్న మిగిలిపోతుంది… జగన్నాథుడి పాదాల వద్ద మెరవాల్సిన కోహినూర్… ఎలా బ్రిటీష్ కిరీటంలోకి చేరింది?
అది మరో చరిత్ర.
భారతదేశాన్ని జయించిన బ్రిటీష్‌లు… పంజాబ్ దగ్గర ఎందుకు ఆగిపోయారు?
ఇది మహారాజా రంజిత్ సింగ్ జీవితంలో అన్నిటికన్నా అత్యంత ఆసక్తికరమైన అధ్యాయం. ఆ రోజుల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఒక యంత్రంలా ముందుకు సాగుతోంది. బెంగాల్ వారి చేతుల్లోకి వెళ్లింది. మైసూరు పడిపోయింది. మరాఠా శక్తి బలహీనపడింది. ఒక్కో రాజ్యం వారి ముందు నిలవలేక సలాంలు చేస్తోంది.
అలాంటి సమయంలో పంజాబ్ మాత్రం స్వేచ్ఛగా నిలబడింది. దానికి కారణం ఒక వ్యక్తి. ఆయనే మహారాజా రంజిత్ సింగ్. బ్రిటీష్‌లను భయపెట్టిన భారతీయ సైన్యం వెనుక ఉన్న దూరదృష్టి రంజిత్ సింగ్‌కు ఒక విషయం స్పష్టంగా తెలుసు. పాత పద్ధతులతో కొత్త శత్రువులను ఎదుర్కోలేం.
వెంటనే ఆయన ఓ ఆలోచన చేసారు. తన సైన్యాన్ని పూర్తిగా ఆధునికీకరించారు. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి శిక్షణ ఇప్పించారు. ఆధునిక ఫిరంగులు, క్రమశిక్షణ కలిగిన కాల్బలగాలు, సమర్థవంతమైన యుద్ధ వ్యూహాలతో ఒక శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించారు.
ఆ కాలంలో భారతదేశంలో బ్రిటీష్ సైన్యానికి సమానంగా నిలబడగలిగిన అరుదైన సైన్యాల్లో అది ఒకటి. అందుకే బ్రిటీష్‌లు పంజాబ్‌పై యుద్ధం చేయడానికి తొందరపడలేదు.
“ఒక మనిషి జీవించి ఉన్నంత కాలం… ఒక సామ్రాజ్యం వేచి చూసింది”
చరిత్రలో ఈ వాక్యం చాలా అరుదుగా వినిపిస్తుంది. బ్రిటీష్‌లు పంజాబ్‌ను జయించలేదా? జయించారు. కానీ ఎప్పుడు? మహారాజా రంజిత్ సింగ్ మరణించిన తర్వాత. ఆయన జీవించి ఉన్నంత కాలం కాదు. ఇదే ఆయన గొప్పతనం. భారతదేశంలోని ఎన్నో రాజ్యాలు బ్రిటీష్ ఆధీనంలోకి వెళ్లిపోయినా, పంజాబ్ మాత్రం స్వతంత్రంగా నిలబడింది. ఎందుకంటే అక్కడ ఒక మహారాజు మాత్రమే లేరు. ఒక సంకల్పం నిలబడి ఉంది.
“పంజాబ్‌లో ఒక్క మనిషి ఉన్నాడు. అతడు చనిపోతేనే మేము లోపలికి వెళ్లగలం.” అని అప్పట్లో ఒక బ్రిటిష్ అధికారులు చెప్పుకునేవారట. ఆయన గురించి.
మహారాజా రంజిత్ సింగ్ ఎందుకు ప్రత్యేకం?
ఎందుకంటే ఆయన కేవలం యుద్ధాలను మాత్రమే గెలవలేదు. ప్రజల హృదయాలు గెలిచారు. కేవలం రాజ్యాన్ని నిర్మించలేదు. ఒక సమాజాన్ని నిర్మించారు. కేవలం శత్రువులను ఓడించలేదు. భయాన్ని ఓడించారు.
ఒక కన్ను కోల్పోయినా, దూరదృష్టిని కోల్పోలేదు.
ఒక ప్రాంతాన్ని పాలించినా, మొత్తం భారతదేశానికి స్ఫూర్తిగా నిలిచారు.
చరిత్రలో ఎంతో మంది రాజులు వచ్చారు. ఎంతో మంది వెళ్లిపోయారు. కానీ కొందరి పేర్లు కాలాన్ని దాటి నిలిచిపోతాయి. మహారాజా రంజిత్ సింగ్ అలాంటి పేరు. ఎందుకంటే ఆయన మనకు ఒక విషయం నేర్పించారు. శరీరంలో ఉన్న లోపం మనిషిని చిన్నవాడిని చేయదు. ఆత్మలో ఉన్న బలమే అతడిని మహానుభావుడిని చేస్తుంది.
అందుకే మహారాజా రంజిత్ సింగ్ కేవలం పంజాబ్ మహారాజు కాదు…
భారతదేశాన్ని జయించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్నే ఆగి ఆలోచించేలా చేసిన భారతీయ సింహం.








