ప్రాణాలకే ప్రమాదం!! వెంటనే చెక్ చేయండి… మీ అబ్బాయి కూడా ఈ డిజిటల్ ట్రాప్ లో పడ్డాడేమో?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు స్మార్ట్ ఫోన్ చేతికి ఇచ్చి మీ పిల్లలు రూమ్‌లో సేఫ్‌గా ఉన్నారనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే, ఎందుకంటే ఆ ఫోన్ స్క్రీన్ వెనుక ఒక భయంకరమైన మృగం పొంచి ఉంది. మీ కళ్ల ముందే మీ పిల్లాడు హ్యాపీగా నవ్వుతూ చాటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు, కానీ ఆ చాట్ రూమ్ లోపల రక్తం ఏరులై పారుతోంది. టీనేజ్ అమ్మాయిల నగ్నచిత్రాలు, ఒంటిపై బ్లేడుతో కోసుకునే క్రూరమైన టాస్క్‌లు, మూగజీవాల హత్యలు… ఇవే ఇప్పుడు ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో కొందరికి వినోదంగా మారాయి.
ఇది సినిమా కథ కాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది కుటుంబాలను కన్నీళ్లలో ముంచుతున్న భయంకరమైన వాస్తవం. ఆ వాస్తవానికి పేరు 764.
పిల్లలను చంపుతున్నది కత్తి కాదు… ఫోన్లో దాక్కున్న ఈ చీకటి ప్రపంచం!
ఇది 15 ఏళ్ల శ్యామ్ (పేరు మార్చబడింది) అనే కుర్రాడితో మొదలైంది. కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతూ పరిచయమైన ఒక ఫ్రెండ్ ద్వారా డిస్కార్డ్ (Discord) లోని ఒక సీక్రెట్ గ్రూప్‌లోకి వెళ్లాడు. అక్కడ అమ్మాయిల నగ్నచిత్రాలు, హర్రర్ సినిమాలను మించిన భీభత్సమైన హింస కనిపించాయి. ఆ గ్రూప్‌లో మెంబర్ అవ్వాలంటే ఒక రూల్ ఉంది. ఏదైనా ఒక అమ్మాయి ఒంటిపై బ్లేడుతో తన యూజర్‌నేమ్‌ను కోసుకునేలా చేయాలి. అలా శ్యామ్ ఆ చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.
అక్కడి నుంచి ‘764’ అనే టెలిగ్రామ్ గ్రూపుకు కనెక్ట్ అయ్యాడు. అది కేవలం చాటింగ్ గ్రూప్ కాదు, అదొక బ్లడ్ స్పోర్ట్. అక్కడ పిల్లలు తమను తాము గాయపరచుకోవడం, పెంపుడు జంతువులను చంపడం వంటి భయంకరమైన వీడియోలు షేర్ అవుతుంటాయి. ఇంట్లో ఒంటరితనం, కోపంతో ఉన్న శ్యామ్, ఆ గ్రూప్‌లో వచ్చే అటెన్షన్ కోసం ఏకంగా 40 మంది అమ్మాయిలతో ఈ-డేటింగ్ చేస్తూ, వారిని బ్లేడ్లతో కోసుకోవాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
బెడ్రూమ్ దాటిన భయం
కానీ ఒక రోజు ఎఫ్‌బీఐ అధికారులు ఇంటి తలుపు తట్టారు. మీ కొడుకు ఇతర పిల్లలను స్వీయ హానికి ప్రోత్సహిస్తున్నాడని, ఆన్లైన్లో హింసను రెచ్చగొడుతున్నాడని చెప్పారు. ఆ తండ్రి తర్వాత చెప్పిన మాట గుండెను పిండేస్తుంది. “అతడు తన గదిలో ఇవన్నీ చూస్తున్నాడు. నాకు మాత్రం ఏమీ తెలియలేదు. నేను ఎలా గుర్తించలేకపోయాను?”
స్క్రీన్ వెనుక బ్లేడు కోతలు
అసలు ఈ ‘764’ ఏంటి? అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రాడ్లీ కాడెన్హెడ్ అనే 15 ఏళ్ల కుర్రాడు తన జిప్ కోడ్ ఆధారంగా 2021లో డిస్కార్డ్లో ఈ గ్రూప్ క్రియేట్ చేశాడు. అమ్మాయిలను లవ్ పేరుతో ట్రాప్ చేయడం, ఆపై వాళ్ల సీక్రెట్ ఫోటోలు సంపాదించి, అవి ఇంటర్నెట్లో పెడతామని బ్లాక్మెయిల్ చేయడం వీరి స్టైల్. గ్రూప్‌లో స్టేటస్ పెరగాలంటే అమ్మాయిలు తమ శరీరాలపై ‘764’ అని బ్లేడుతో కోసుకోవాలి. బారన్ మార్టిన్ అనే మరో సైకో అయితే అమ్మాయిల సైకాలజీని బట్టి వాళ్లను ఎలా లొంగదీసుకోవాలో ఒక ‘టెర్రర్ మాన్యువల్’ కూడా రాశాడు. లవ్ చూపిస్తూనే ఒక్కసారిగా కోల్డ్‌గా మారిపోయి వాళ్లను మానసికంగా చంపేయడం, ఆపై చెప్పినట్టు వినేలా చేయడం దీని సారాంశం. ఒక గ్రూప్ వీడియో కాల్లో ఒక పిల్లాడితో పెంపుడు హ్యాంస్టర్ను తొక్కించి చంపేలా చేసి, కింద ‘LMAO’ (గట్టిగా నవ్వడం) అని కామెంట్ పెట్టిన ఘరానా సైకోలు వీళ్లు.
ఆమె చనిపోయిన తర్వాత కూడా వదల్లేదు
కెనడాకు చెందిన పెనెలోపీ అనే టీనేజర్ కూడా ఇలాంటి గ్రూప్ వలలో చిక్కుకుంది. మొదట తనను తాను గాయపరుచుకోవడం మొదలైంది. తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు. ఆమె తండ్రి తన కూతురిని కాపాడేందుకు పోలీసుల దగ్గరికి వెళ్లాడు. వైద్యుల దగ్గరికి వెళ్లాడు. ఫోన్ తీసేశాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 16 ఏళ్ల వయసులో పెనెలోపీ తన జీవితాన్ని ముగించుకుంది. ఇక్కడితో కథ ముగిసుంటే కనీసం కొంత మానవత్వం మిగిలి ఉందనుకోవచ్చు.
కానీ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆన్లైన్ గ్రూపుల్లో కొందరు ఆమె మరణాన్ని ఎగతాళి చేశారు. ఓ తండ్రి కూతురిని కోల్పోయి ఏడుస్తుంటే… మరోవైపు కొందరు ఆమె మరణాన్ని మీమ్‌లుగా మార్చి నవ్వుకున్నారు. ఇంటర్నెట్ ఎంత క్రూరంగా మారిందో చెప్పడానికి అంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు.
లా ఎన్ఫోర్స్మెంట్ వర్సెస్ సైబర్ సైకోలు
ఈ దారుణాలపై అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీడియోల్లోని బెడ్రూమ్ బ్యాక్గ్రౌండ్లను గుర్తిస్తూ బాధితులను రక్షించే పనిలో పడ్డారు. ఎఫ్‌బీఐ ఈ ‘764’ను దేశీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఎందుకంటే వీరు కేవలం సెక్స్ కోరికల కోసం ఇది చేయడం లేదు, కేవలం పాపులారిటీ, ఎదుటివాడిని హింసించడంలో వచ్చే సైకో ఆనందం కోసమే చేస్తున్నారు. కొందరు సభ్యులు స్కూల్ షూటింగ్‌లకు కూడా ప్లాన్ చేసినట్టు ఆధారాలు దొరికాయి.
రాక్షసులా… లేక బాధితులా?
ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయం ఇంకోటి.. ఈ గ్రూపుల్లో ఉన్న పిల్లలందరూ పుట్టుకతో క్రూరులు కాదు. వాళ్లలో చాలామంది ఒంటరితనంతో బాధపడుతున్నవాళ్లు. కొంతమంది కుటుంబ సమస్యలతో పోరాడుతున్నవాళ్లు. మరికొందరు డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లు. ఎవరో తమను అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తున్నవాళ్లు. అలాంటి సమయంలో ఈ చీకటి ప్రపంచం వాళ్లను ఆహ్వానించింది. చివరకు వాళ్లు బాధితులా, నేరస్థులా అన్న గీతే చెరిగిపోయింది.
అసలు ప్రమాదం ఎక్కడుందంటే…
ఈ కథ అమెరికాలో జరిగింది కాబట్టి మనకు సంబంధం లేదని అనుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే ఇంటర్నెట్కు దేశాలుండవు. ఈ రోజు హైదరాబాద్‌లో ఉన్న పిల్లాడు, రేపు విజయవాడలో ఉన్న అమ్మాయి, ఎల్లుండి రాజమండ్రిలో ఉన్న టీనేజర్… ప్రపంచం మరో మూలలో ఉన్న ఎవరో వ్యక్తితో ఒక్క క్లిక్‌లో కనెక్ట్ అవుతున్నారు. ప్రమాదం కూడా అదే వేగంతో వస్తోంది.
తల్లిదండ్రులు పిల్లలకు మంచి స్కూల్, మంచి మార్కులు, మంచి కెరీర్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది. మీ పిల్లాడు ఎవరి వెంట తిరుగుతున్నాడన్నది కాదు… అతని ఫోన్లో ఎవరు ఉన్నారు? అదే ప్రశ్నకు సమాధానం తెలియకపోతే, ఒక రోజు తలుపు తట్టేది స్నేహితుడు కాదు… పోలీసులు కూడా కావచ్చు.
చివరి మాట
ప్రతి పిల్లాడికి ప్రేమ కావాలి. గుర్తింపు కావాలి. ఎవరో తన మాట వినాలని ఉంటుంది. ఆ ఖాళీని కుటుంబం నింపకపోతే, ఇంటర్నెట్ నింపుతుంది. కానీ ఇంటర్నెట్ నింపే ప్రతి చేయి, ఆదుకునే చేయి కాదు. కొన్నిసార్లు అది చీకటిలోకి లాగే చేయి కూడా అవుతుంది. ఈ కథనం 764 గురించే కాదు. పిల్లలను కోల్పోతున్న ఒక తరం గురించిన హెచ్చరిక. మీ పిల్లలు ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి. లేకపోతే స్మార్ట్ ఫోన్ రూపంలో సైకో మృగం మీ ఇంట్లోనే చేరిపోతుంది, జాగ్రత్త!








