రుక్మిణీ వసంత్ డీప్‌ఫేక్ కేసులో ముగ్గురు అరెస్ట్..
కన్నడ నటి రుక్మిణీ వసంత్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ కంటెంట్ వ్యవహారంలో కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. సోషల్ మీడియాలో ఆమె పేరుతో ప్రచారంలోకి వచ్చిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాగలకోట, శివమొగ్గ మరియు బెంగళూరుకు చెందిన వ్యక్తులు ఈ నకిలీ కంటెంట్ సృష్టించడం, ఆన్లైన్లో వైరల్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విచారణలో భాగంగా పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం నిందితులకు రిమాండ్ విధించబడగా, ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
కొద్ది రోజుల క్రితం రుక్మిణీ వసంత్(Rukmini Vasanth)కు సంబంధించిన కొన్ని అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. మొదట్లో అవి నిజమైనవేనని కొందరు ప్రచారం చేసినప్పటికీ, అనంతరం అవన్నీ ఏఐ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్ అని తేలింది. ఈ విషయంపై స్పందించిన రుక్మిణీ, తన అనుమతి లేకుండా రూపొందించిన ఆ కంటెంట్ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారని వెల్లడిస్తూ చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఈ కేసు డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఇలాంటి నకిలీ కంటెంట్‌కు బలవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నిపుణులు సోషల్ మీడియాలో కనిపించే అనుమానాస్పద ఫోటోలు, వీడియోలను నిర్ధారించకుండా షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక రుక్మిణి కెరీర్ విషయానికొస్తే ఆమె ప్రస్తుతం యష్(Yash) హీరోగా వస్తున్న టాక్సిక్(Toxic)తో పాటు ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్(NTR) భారీ సినిమా డ్రాగన్(Dragon) లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.








