మనోజ్ బాజ్‌పేయి ‘గవర్నర్’ మూవీ రివ్యూ – దేశాన్ని దివాళా నుంచి కాపాడిన మౌన యోధుడి కథ
Rating: 2.75
–సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు భారత్ కూడా దివాళా అంచున నిలిచిందని మీకు తెలుసా? దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన ఆ సంక్షోభంలో, రాజకీయ నాయకులు కాదు… ఒక అధికారి తీసుకున్న నిర్ణయాలే దేశాన్ని గట్టెక్కించాయి. అదే “గవర్నర్: ది సైలెంట్ సేవియర్” కథ.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఉదాహరణతో ప్రారంభమయ్యే ఈ సినిమా, నేటి తరానికి పెద్దగా తెలియని 1991 భారత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తు చేస్తుంది. యువతకు ఆ కాలం పరిస్థితులను వివరించే ప్రయత్నంలో జర్నలిస్ట్ మిస్ వర్మ (అదా శర్మ) చెప్పే కథ ద్వారా సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లోకి ప్రవేశిస్తుంది.
దేశంలో రాజకీయ అస్థిరత తారాస్థాయిలో ఉన్న సమయం అది. గల్ఫ్ యుద్ధం ప్రభావం, పెరిగిపోయిన చమురు ధరలు, క్షీణించిన విదేశీ మారక నిల్వలు… అన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూలే స్థితికి తీసుకెళ్తాయి. విదేశీ అప్పులు తీర్చడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచం ముందే భారత్ దివాళా ప్రకటించాల్సిన పరిస్థితి దగ్గరపడుతుంది.
అలాంటి సమయంలో, అనూహ్యంగా రామన్ (మనోజ్ బాజ్‌పేయి)ను దేశ అత్యంత కీలక ఆర్థిక సంస్థ అయిన RBIకి అధిపతిగా నియమిస్తారు. ఈ నిర్ణయం అధికార వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించే బాధ్యత ఇప్పుడు అతని భుజాలపై పడుతుంది.
ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి అత్యవసర రుణాల కోసం ప్రయత్నాలు, మరోవైపు విదేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు… ప్రతి అడుగు దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటుంది. కానీ పరిస్థితులు మరింత దిగజారడంతో, చివరికి భారత్ వద్ద ఉన్న బంగారు నిల్వలను విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టే అత్యంత సాహసోపేతమైన, వివాదాస్పద నిర్ణయం ముందుకు వస్తుంది.
ఆ నిర్ణయం దేశాన్ని కాపాడిందా? రాజకీయ ఒత్తిళ్లు, అధికార యంత్రాంగంలోని విభేదాలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య రామన్ ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎలా నడిపించాడు? దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఆర్థిక మలుపును “గవర్నర్: ది సైలెంట్ సేవియర్” ఎంత ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించిందన్నదే మిగతా కథ.
విశ్లేషణ
కేవలం 24 గంటల వ్యవధిలో దేశ గమ్యాన్ని మార్చేసిన ఒక అజ్ఞాత అధికారి పోరాటమే ఈ ‘గవర్నర్’ కథ.చరిత్రలో చాలా మందికి తెలియని ఈ కీలక ఘట్టాన్ని ఎలాంటి హడావుడి లేకుండా, భావోద్వేగాలకూ వాస్తవాలకూ మధ్య సమతుల్యం పాటిస్తూ తెరపై ఆవిష్కరించటం అంటే మామూలు విషయం కాదు.దర్శకుడు చిన్మయ్ మండలేకర్ ఆ మేరకు చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
దర్శకుడు చిన్మయ్ మండలేకర్ ఈ కథను సాధారణ బయోపిక్‌గా కాకుండా, ఒక “రేస్ అగైనెస్ట్ టైమ్” త్రిల్లర్ గా మలచడానికి ప్రయత్నించాడు. ఇక్కడ విలన్ ఒక వ్యక్తి కాదు. ఒక రాజకీయ పార్టీ కాదు. ఒక దేశాన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక సంక్షోభం. అందుకే సినిమా ప్రారంభం నుంచే ఒక అత్యవసర పరిస్థితి లాంటి వాతావరణం కనపడుతుంది.
సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో తెరపై జరగబోయే ప్రమాదం స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేస్తారు. “జాస్”లో షార్క్ ఉంటుంది. “అపోలో 13”లో అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు ఉంటారు. “అర్గో”లో బందీలను రక్షించాల్సిన మిషన్ ఉంటుంది. కానీ “గవర్నర్”లో సమస్య పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ లక్ష్యం ఒక్కటే—దేశాన్ని దివాళా నుంచి కాపాడటం.
ఇది ఒక గొప్ప కథా ఆలోచన. అదే సమయంలో స్క్రీన్‌ప్లే పరంగా చాలా క్లిష్టమైన అంశం కూడా. ఎందుకంటే ఇది విజువల్ కాన్ఫ్లిక్ట్ కాదు. ఇది సంఖ్యలు, గణాంకాలు, ఆర్థిక నిర్ణయాల చుట్టూ తిరిగే సంఘర్షణ.
ఈ ఛాలెంజ్ ని అధిగమించడానికి రచయితలు ప్రతి ఆర్థిక సమస్యను ఒక కొత్త అడ్డంకిగా చూపించే ప్రయత్నం చేశారు. IMF రుణం అవసరం అవుతుంది. అది సులభంగా దొరకదు. విదేశీ బ్యాంకులను ఒప్పించాలి. వారు సందేహిస్తారు. చివరకు బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది.
ఈ డిజైన్ ఫస్టాఫ్ లో సెటప్ ని ఇంట్రస్టింగ్ గా చూపెట్టడానికి బాగా పనిచేస్తుంది. ప్రతి కొత్త సమస్య ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతుంది. దేశం నిజంగా ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది.
సెకండాఫ్ లో రిపీట్ అయ్యిందనే భావన
సినిమా రెండో భాగంలో ప్రధాన సమస్య స్క్రీన్‌ప్లే లోనే కనిపిస్తుంది. ఒక సమస్య వస్తుంది. రామన్ దానికి పరిష్కారం వెతుకుతాడు. అది పూర్తిగా పనిచేయదు. మరో సమస్య వస్తుంది. మరో పరిష్కారం వెతుకుతాడు. ఇదే పదేపదే పునరావృతమవుతుంది.
దీంతో ప్రేక్షకుడు స్టోరీ డిజైన్ ను ముందుగానే అంచనా వేయగలుగుతాడు. థ్రిల్లర్లలో అత్యంత ముఖ్యమైన అంశం అనిశ్చితి. కానీ ఇక్కడ కథ క్రమంగా ఒక డాక్యుమెంటరీ తరహా నిర్మాణంలోకి జారిపోతుంది.
ఇదే సందర్భంలో ప్రముఖ రచయిత ఆరోన్ సోర్కిన్ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది:
“Information is not drama. Conflict is drama.”
అంటే ప్రేక్షకుడికి సమాచారం ఇవ్వడం మాత్రమే కథ కాదు. ఆ సమాచారంతో మనుషుల మధ్య జరిగే ఘర్షణే అసలు నాటకం. “గవర్నర్”లో సమాచారం చాలా విలువైనది. కానీ కొన్ని సందర్భాల్లో సమాచారం, వివరణలు, ఆర్థిక చర్చలు పాత్రల మధ్య సంఘర్షణను మించిపోతాయి. అందుకే కొంతమంది ప్రేక్షకులకు సినిమా ఒక ఎకనామిక్స్ క్లాస్‌రూమ్‌లా అనిపించే అవకాశం ఉంది.
మైఖేల్ మాన్ తరహా విజువల్ టెన్షన్ కొరవడిందా?
“Heat”, “The Insider” వంటి చిత్రాల దర్శకుడు మైఖేల్ మాన్ ఇలాంటి కథను తెరకెక్కిస్తే, వ్యవస్థలోని ఒత్తిడిని మరింత విజువల్‌గా చూపిస్తూ ముందుకు తీసుకెళ్లేవారు. రాత్రి వేళల్లో వెలుగుతున్న RBI కార్యాలయాలు. ఖాళీ అవుతున్న విదేశీ మారక నిల్వల గ్రాఫ్‌లు. అధికారుల ముఖాల్లో కనిపించే ఆందోళన. ఫైళ్ల మధ్య నిశ్శబ్దంగా జరిగే నిర్ణయాలు. “గవర్నర్”లో ఈ అంశాలు కనిపిస్తాయి. కానీ వాటిని మరింత తీవ్రంగా ఉపయోగించి ఉంటే, కథలోని టెన్షన్ ఇంకా పెరిగేది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం అంశాన్ని ప్రేక్షకుడు భావోద్వేగంగా అనుభవించడానికి విజువల్ కథనం మరింత సహాయపడేది.
ఎవరెలా చేసారు
ఈ చిత్రానికి అతిపెద్ద బలం మనోజ్ బాజ్‌పేయి నటన. ఇది స్టార్‌డమ్‌పై ఆధారపడిన పాత్ర కాదు. ఇది పూర్తిగా నటనపై ఆధారపడిన పాత్ర. అతను పెద్దగా అరవడు. భారీ మోనోలాగ్లు చెప్పడు. మాస్ డైలాగ్‌లు ఉండవు. కానీ దేశ భవిష్యత్తు తన భుజాలపై ఉందనే బాధ్యతను ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేస్తాడు. మిగతా నటులు పూర్తిగా కథకు సపోర్ట్ చేసారు. టెక్నికల్ గానూ మంచి స్టాండర్డ్స్ లో ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
స్క్రిప్టు పరంగా చూస్తే… ఇలాంటి చరిత్ర చెప్పే కథలు చాలా సులభంగా రాజకీయ ప్రచార చిత్రాలుగా మారిపోతాయి. కానీ “గవర్నర్” ఆ ఉచ్చులో పడలేదు. సినిమా ఏ రాజకీయ పార్టీని హీరోగా చూపించదు. ఏ నాయకుడిని విలన్‌గా చిత్రీకరించదు. జరిగిన సంఘటనలను మాత్రమే చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఈ తటస్థత కథకు విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. ప్రేక్షకుడు రాజకీయ వాదనల కంటే పరిస్థితుల తీవ్రతపై దృష్టి పెట్టేలా చేసింది. అయితే “గవర్నర్”లో ఆర్థిక సంక్షోభం సామాన్య ప్రజల జీవితాలపై చూపిన ప్రభావం మరింత బలంగా ఉండాల్సింది. ప్రేక్షకుడు సంఖ్యల వెనుక ఉన్న మానవ కథలను మరింతగా చూడాలనుకుంటాడు.
ఫైనల్ థాట్
“గవర్నర్” కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. “RRR” తరహా ఉత్సాహాన్ని ఇవ్వదు. కానీ “The Big Short”, “Margin Call”, “Chernobyl” వంటి చిత్రాల మాదిరిగా ఆలోచింపజేస్తుంది. గొప్ప సినిమా కావడానికి అవసరమైన కొన్ని అంశాలు కొద్దిగా తక్కువైనా, ఇది ఒక నిజాయితీగల, ఆలోచింపజేసే, చర్చకు దారితీసే చిత్రం. అదే దీని అసలు విజయం.








