పేరుకోసం కల్వకుంట్ల ఫ్యామిలీ కొట్లాట!
తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకుంది. ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరిగా నిలిచి, ఒక దశాబ్దం పాటు రాష్ట్రాన్ని శాసించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలోనే చిచ్చు రేపింది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి కవిత బహిష్కరణకు గురైన తర్వాత, ఆమె ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం గులాబీ బాస్ కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఊహించని పెద్ద సమస్యగా మారింది. ఈ పేరు చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పోషించిన చారిత్రాత్మక పాత్ర అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాగానే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే మోజుతో కేసీఆర్ 2022లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరును భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చేశారు. అయితే, ఈ పేరు మార్పు గులాబీ పార్టీకి కలిసిరాలేదు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అస్తిత్వాన్ని కోల్పోవడం వల్లే ఓడిపోయామనే భావన కేడర్‌లో బలంగా నాటుకుపోయింది. దీంతో పార్టీ పేరును మళ్లీ పాత ‘టీఆర్ఎస్’ గా పునరుద్ధరించాలనే డిమాండ్ పార్టీ అంతర్గత సమావేశాల్లో గట్టిగా వినిపించడం ప్రారంభమైంది.
పార్టీ పేరును మార్చే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్న తరుణంలోనే, కవితను పార్టీ నుంచి బయటకు పంపడం, ఆమె తండ్రి పెట్టిన పాత పార్టీ పేరును స్ఫురించేలా ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)ను అనౌన్స్ చేయడం బీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పాత సెంటిమెంట్‌ను, ‘TRS’ అనే బ్రాండ్‌ను కవిత లాగేసుకుంటే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళన కేసీఆర్, కేటీఆర్ లలో మొదలైంది. ఈ షాక్ నుంచి కోలుకోకముందే, ఆ పేరు కవితకు దక్కకుండా చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రంగంలోకి దిగాయి.
కవిత పార్టీకి ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం దక్కకుండా చూసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి, ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దంటూ విజ్ఞాపన అందించింది. కేవలం పార్టీ అఫీషియల్ లెటర్‌తోనే సరిపెట్టకుండా, కేసీఆర్ అనుచరులు, అభిమానులు, పార్టీ శ్రేణుల చేత ఏకంగా 700లకు పైగా అభ్యంతరాలను ఈసీకి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘TRS’ అనేది తమ ఐడెంటిటీ అని, దాన్ని వేరే వాళ్లకు ఇస్తే ప్రజలు గందరగోళానికి గురవుతారని బీఆర్ఎస్ వాదిస్తోంది.
అయితే, ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు, ఈసీ నిపుణుల ప్రకారం.. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి పార్టీకి ఒక పూర్తి పేరు ఉంటుంది తప్ప, ‘షార్ట్ ఫామ్’ ఆధారంగా ఈసీ గుర్తింపు ఇవ్వదు. ఉదాహరణకు ప్రజలు షార్ట్ ఫాంలో పిలుచుకునే పేర్లకు, వాటి వల్ల వచ్చే గందరగోళానికి ఈసీ బాధ్యత వహించదు.
ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ పూర్తి పేరు ‘తెలంగాణ రక్షణ సేన’. ఒకవేళ ఈ పూర్తి పేరుతో రిజిస్ట్రేషన్‌కు సాంకేతిక ఇబ్బందులు లేకపోతే, దానికి ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని జనాలు షార్ట్ ఫాంలో ‘టీఆర్ఎస్’ అని పిలుచుకుంటే ఈసీ ఏమీ చేయలేదు. ఒకవేళ ఈసీ ఇదే రీతిన వ్యవహరించి కవిత పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం, అది బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కేసీఆర్-కేటీఆర్ ద్వయానికి కోలుకోలేని పెద్ద షాక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సెంటిమెంట్ పేరుతో కవిత పొలిటికల్ మైలేజ్ సాధిస్తే, బీఆర్ఎస్ ఉనికి మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.








