ఒక్క సీటు కోసం ఇంత దిగజారడం అవసరమా? : జగ్గారెడ్డి
మీనాక్షీ నటరాజన్ (Meenakshi Natarajan)ను రాజ్యసభ అభ్యర్థిగా రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఎంపిక చేస్తే, ఆమె నామినేషన్‌ను రద్దు చేయడం కోసం ప్రధాన మంత్రి స్థాయిలో కుట్ర చేయడం అవసరమా? ఒక్క సీటు కోసం ఇంతగా దిగజారడం ఆ బీజేపీకి తగునా? అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (Jagga Reddy) నిలదీశారు. దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలనలో కుట్రలు, కుతంత్రాలే తప్ప ప్రజా పాలన ఎక్కడుందని ప్రశ్నించారు. లేని కేసును చూపించి మీనాక్షి సీటును దొంగతనం చేసిన బీజేపీ, అది బయటపడకుండా కోవర్టు డ్రామాలు ఆడుతోందన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), గలీజ్ రాజకీయాలు చేస్తోందన్నారు. మధ్యప్రదేశ్‌లో మూడో రాజ్యసభ సీటు కోసం ఎన్నికల కమిషన్‌ను వాడుకుని దిగజారుడు రాజకీయం చేసిందన్నారు. గాంధీ ఐడియాలజీతో పనిచేస్తున్న మీనాక్షికి రాజ్యసభ సభ్యత్వం రాకుండా అడ్డుకోవాల్సినంత అవసరం ఉందా? అని నిలదీశారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమో కాదో బీజేపీ నేతలే ఆలోచన చేయాలన్నారు. అధికారం, ఎన్నికల కమిషన్నూ అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బీజేపీ కబ్జా చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ తరహాలోనే కాంగ్రెస్‌పైన బురద చల్లుతున్న హరీశ్‌రావు, బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు.కాంగ్రెస్‌లో కోవర్టులు ఉంటే వారి తోడ్కలు తీస్తామని, కానీ బీజేపీ ట్రాప్‌లో ఎవరూ పడొద్దని అన్నారు.








