ఒక్క వానతో తేలిపోయింది! హైడ్రా, కార్పొరేషన్ల మధ్య కొరవడిన సమన్వయం.. నరకం చూసిన 3 లక్షల మంది!
హైదరాబాద్: భాగ్యనగరంలో వానాకాలం ముంచుకొస్తున్న తరుణంలో బల్దియా యంత్రాంగం, హైడ్రా (HYDRAA) చేసిన ముందస్తు ఏర్పాట్లలోని లోపాలు తొలి వర్షానికే పూర్తిగా బయటపడ్డాయి. వర్షాలొస్తున్నాయంటూ వివిధ ప్రభుత్వ శాఖలతో వరుస సమన్వయ సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. క్షేత్రస్థాయిలో జరగాల్సిన సన్నద్ధతపై మాత్రం దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలం మొదలయ్యాక అత్యవసర బృందాలు, ఇతర యంత్రాంగం ఏర్పాటుకు టెండర్లు పిలవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరోవైపు, హైడ్రా హడావుడి చూసి అంతా ఆ సంస్థే చూసుకుంటుందనే భావనతో నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు చేతులెత్తేయడంతో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. దీని ఫలితంగా మంగళవారం (జూన్ 9) కురిసిన వర్షానికి నగరవ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది వాహనదారులు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నరకయాతన అనుభవించారు.
నాలాలు, పూడికతీత, సన్నద్ధత లేకనే ముంపు
నగరంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన వరద నాలాల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడం, నాలాల పూడికతీత పనులు సరిగా జరగకపోవడం ఈ ముంపునకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దీనికి తోడు ముంపు సమస్యను తక్షణమే సరిదిద్దే అత్యవసర బృందాలను (Emergency Teams) సకాలంలో ఏర్పాటు చేయకపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. మే నెల ప్రారంభం నుండే హైడ్రా ఆధ్వర్యంలో వర్షకాల సన్నద్ధతపై సమావేశాలు నిర్వహించి, అధికారులకు సూచనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఆశించినట్లుగా లేదని ఈ ఒక్క వర్షంతో తేలిపోయింది.
జూబ్లీగార్డెన్ రోడ్డులో మునిగిన కార్లు
హైటెక్స్ సమీపంలోని జూబ్లీగార్డెన్ రోడ్డు నంబర్ 8 లో గతంలో భారీ వర్షం కురిస్తే 20 నిమిషాల పాటు వరద నీరు నిలిచేది. కానీ జూన్ 9న కురిసిన వర్షానికి ఇక్కడి కాలనీలు ఏకంగా నాలుగు గంటల పాటు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రోడ్లపై నడుముల్లోతు నీరు చేరడంతో కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ ప్రాంతంలో మీనాక్షి టవర్స్, వాసవి టవర్స్ వంటి భారీ బహుళ అంతస్తుల ప్రాజెక్టులు నిర్మించడంతో సహజ వరద నీటి ప్రవాహ మార్గాలన్నీ మూసుకుపోయాయి. వరద నాలాల సామర్థ్యం ప్రవాహ మార్గాల గురించి ఆలోచించకుండా ఉన్నతాధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ఇంజనీరింగ్ లోపాలతో రోడ్లు వేయడమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. అర్ధరాత్రి వరకు రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినా, సహాయం చేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు ఎవరూ కనిపించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








