బెల్జియంలో బీఆర్ఎస్ 54వ ఎన్నారై శాఖ ప్రారంభం..
బెల్జియం: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గ్లోబల్ విస్తరణలో భాగంగా బెల్జియంలో 54వ శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఇదే వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు 50వ పుట్టినరోజు వేడుకలను బెల్జియం ప్రవాస తెలంగాణ పౌరులు, పార్టీ అభిమానులు ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కోసం పాటుపడుతున్నారని కేటీఆర్ని కొనియాడారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధి, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. అనంతరం మహేష్ బిగాల మాట్లాడుతూ.. బెల్జియం శాఖను మరింత బలోపేతం చేసేందుకు జగన్నాథ్ ప్రసాద్ రామానుజం నేతృత్వంలో తాత్కాలిక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రవీణ్ జారుగుమల్లికి, బెల్జియంలో శాఖ ఏర్పాటుకు మొదటి నుంచి కృషి చేసిన శ్యామ్ అకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడంలో విదేశీ శాఖలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో శ్రీకాంత్, మనోజ్, మంజునాథ్, విజయ్, రాజశేఖర్, ఫణి, హరీష్, నాగరాజు జగిని, శ్రీకాంత్, అఖిల్ రెడ్డి, భాను, చన్నా రెడ్డి, రమణ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








