15 ఏళ్ల వయసులోనే వైభవ్ ప్రపంచ రికార్డు..!
భారత క్రికెట్ జట్టుకు చెందిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఒక అపూర్వమైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జింబాబ్వేతో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఈ యువ బ్యాటర్ తన బ్యాటింగ్ పవర్‌తో మైదానాన్ని హోరెత్తించాడు. టీమిండియా ఎదుట ఉన్న 126 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధశతకాన్ని (50 పరుగులు) నమోదు చేశాడు.
ఈ హాఫ్ సెంచరీ సాధించే సమయానికి వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 సంవత్సరాల 118 రోజులు మాత్రమే. దీనితో అంతర్జాతీయ పురుషుల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న మొట్టమొదటి గ్లోబల్ క్రికెటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. గతంలో నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా (15 సంవత్సరాల 340 రోజులు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వ దేశాలపరంగా చూసుకుంటే.. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాకిస్థాన్‌పై చేసిన మొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ రికార్డును కూడా ఈ యువ సంచలనం అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20 లలో పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల నుండి ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ (17 సంవత్సరాల 96 రోజులు) పేరిట ఉన్న పిన్న వయస్కుడి రికార్డును కూడా వైభవ్ తుడిచేసాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించడమే కాకుండా, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గత కొన్ని మ్యాచ్‌లుగా తనపై వస్తున్న విమర్శలకు వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడమే కాకుండా, భారత క్రికెట్ భవిష్యత్తుకు తాను ఒక ఆశాకిరణం అని ఈ ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ద్వారా చాటిచెప్పాడు.








