వరి సాగు ఆపండి.. ఏపీ ప్రభుత్వం సంచలన విజ్ఞప్తి..!
ఆంధ్రప్రదేశ్‌లో నీటి నిల్వలు అడుగంటడంతో రాష్ట్రం తీవ్ర జల సంక్షోభంలో మునిగిపోయింది. కృష్ణా నదిపై ఉన్న ప్రధాన జలాశయాలైన శ్రీశైలం(Srisailam), నాగార్జునసాగర్‌లలో నీటి నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని కూటమి సర్కార్ స్పష్టం చేసింది. తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారికంగా నిర్ణయించినట్లు వెల్లడించింది. జలాశయాల్లో నీటి లభ్యత ఆందోళనకరంగా ఉన్నందున, కృష్ణా డెల్టా పరిధిలోని రైతులు ప్రస్తుతానికి వరి సాగు జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసింది.
రిజర్వాయర్లలో తగినంత నీరు లేకుండా మొండిగా వరి సాగు చేపడితే.. చివర్లో నీరందక పెట్టుబడులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కృష్ణా డెల్టా అన్నదాతలు వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల (కంది, పెసర, మినుము, వేరుశనగ వంటివి) వైపు వెళ్లాలని సూచించింది. రాబోయే రోజుల్లో కురిసే వర్షాలు, జలాశయాల్లోకి వచ్చే నీటి ప్రవాహాల లభ్యతను బట్టి ఖరీఫ్ సాగుపై తదుపరి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, కృష్ణా డెల్టాను ఆదుకునే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటి సరఫరా సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
గోదావరి నదిలో ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ప్రస్తుతం కేవలం 15 పంపులతో మాత్రమే నీటి విడుదల కొనసాగుతోంది. దీనివల్ల పోలవరం కుడి కాలువలో 1,000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం తగ్గిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కొందరు రైతులు కాలువల వెంబడి అనధికార పంపులను ఏర్పాటు చేసి నీటిని తరలించడంపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాల దృష్ట్యా ఇలాంటి అనధికారిక నీటి తరలింపులపై కఠిన నిఘా ఉంచనున్నట్లు అధికారులు హెచ్చరించారు.








