జాగ్రత్త! క్రెడిట్ కార్డ్ ‘Minimum Due’… మ్యాక్సిమమ్ ముంచేస్తుంది
— సూర్య ప్రకాష్ జోశ్యుల
“హమ్మయ్య …ఈ నెలకు గట్టెక్కాం…”
క్రెడిట్ కార్డు బిల్లు చూసిన తర్వాత Minimum Due మాత్రమే కట్టి మీరు కూడా ఎప్పుడైనా ఇలా అనుకున్నారా?
అయితే… ఒక చిన్న ప్లాట్ ట్విస్ట్ ఉంది. మీరు బిల్లు కట్టలేదు… బ్యాంక్ వడ్డీ మీటర్‌ను ఆన్ చేశారు.
అవును నిజం… అందుకే Personal Finance ప్రపంచంలో ఒక మాట బాగా వినిపిస్తుంది. “Credit Card Trap starts with two innocent words – Minimum Due.”
Minimum Due అంటే “ఇంత కడితే చాలు” అనుకుంటారు. కానీ దాని అసలు అర్థం: “ఇంత కడితే మిమ్మల్ని ఈ నెలకి ఎగవేతదారుగా (Defaulter) ప్రకటించం” అని మాత్రమే. ఇది అప్పు ముగిసిందనే సర్టిఫికేట్ కాదు… అప్పు కొనసాగుతుందనే నోటీసు!
ఒక ఉదాహరణ చూద్దాం.
మీరు ₹1 లక్ష విలువైన ల్యాప్‌టాప్‌ను క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేశారని అనుకుందాం. గడువు తేదీలోపు మొత్తం బిల్లు చెల్లిస్తే, చాలా కార్డుల్లో 45–50 రోజుల వరకు వడ్డీ ఉండదు.కానీ అలా చేయకుండా తర్వాత చూసుకుందాములే అని Minimum Due మాత్రమే చెల్లిస్తే పరిస్థితి మారుతుంది. మిగిలిన మొత్తంపై వార్షికంగా సుమారు 36% నుంచి 42% APR వరకు వడ్డీ విధించే కార్డులు ఉన్నాయి. అంటే నెలకు దాదాపు 3% లేదా అంతకంటే ఎక్కువ.
కొన్ని నెలలు అలాగే మనం Minimum Dueతో కొనసాగితే, మీరు కట్టిన డబ్బులో పెద్ద భాగం వడ్డీకే వెళ్లి, అసలు బకాయి మాత్రం ఊహించినంత వేగంగా తగ్గదు.
అందుకే చాలామందికి ఒకే సందేహం వస్తుంది.
“ఇంత డబ్బు కడుతున్నా అప్పు ఎందుకు తగ్గడం లేదు?”
స్టేట్మెంట్లో చాలామంది చూడని నాలుగు లైన్లు
చాలా మంది Minimum Due చూసి పేమెంట్ చేస్తారు. కానీ నిజానికి ఎక్కువ సమాచారం చెప్పేది మిగతా నాలుగు లైన్లే.
Total Amount Due
Payment Due Date
Interest Charged
Annual Percentage Rate (APR)
మీరు చెల్లించిన డబ్బులో ఎంత వడ్డీకి వెళ్లిందో చెప్పేది Interest Charged అనే లైన్. చాలా మంది దానిని ఎప్పుడూ గమనించరు.
90% మందికి తెలియని సీక్రెట్
మీరు Minimum Due కట్టగానే మీ కార్డుకున్న “వడ్డీ లేని కాలపరిమితి” (45-50 రోజులు) రద్దవుతుంది. అంటే పాత బకాయి ఉండగా, మీరు కార్డుతో కొనే చిన్న పాలు, కూరగాయల నుంచి ప్రతి కొత్త ఖర్చుపైనా కొన్న మరుసటి సెకన్ నుంచే వడ్డీ పడటం మొదలవుతుంది.
బ్యాంకులు అసలు సంపాదించేది ఎవరి నుంచి?
చాలామంది బ్యాంకులు Annual Fees లేదా Late Fees నుంచే ఎక్కువ సంపాదిస్తాయి అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే! బ్యాంకింగ్ రంగానికి అతిపెద్ద ఆదాయ వనరు ‘Revolving Credit Interest’. బిల్లు పూర్తిగా కట్టకుండా, ప్రతి నెలా Minimum Due కడుతూ అప్పును ముందుకు నెట్టే కస్టమర్ల నుంచే బ్యాంకులు వేల కోట్లు ఆర్జిస్తాయి.
ఇది కేవలం వడ్డీ సమస్య కాదు
ప్రతి నెల పెద్ద మొత్తంలో బకాయి కొనసాగితే మీ Credit Utilization కూడా పెరుగుతుంది. ఆర్థిక నిపుణులు సాధారణంగా క్రెడిట్ లిమిట్లో 30% లోపే వినియోగం ఆరోగ్యకరమని సూచిస్తారు.
ఎక్కువ కాలం అధిక బకాయి కొనసాగడం వల్ల భవిష్యత్తులో హోమ్ లోన్, కారు లోన్ వంటి రుణాల సమయంలో మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అయితే Minimum Due ఎప్పుడూ తప్పేనా?
కాదు. అనారోగ్యం, ఉద్యోగం మారడం, కుటుంబంలో అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో అది తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగపడవచ్చు. కానీ ప్రతి నెల అదే అలవాటుగా మారితే, అప్పు నుంచి బయటపడటం మరింత కష్టమవుతుంది.
మొత్తం బిల్లు చెల్లించడం సాధ్యం కాకపోతే, బ్యాంక్ అందించే EMI లేదా ఇతర రీపేమెంట్ ఆప్షన్ల గురించి తెలుసుకోవడం మంచిది.
ఈ ఉచ్చు నుంచి బయటపడే ప్లాన్!
క్రెడిట్ కార్డ్ అనేది శత్రువు కాదు. సరిగ్గా వాడితే అది 45 రోజుల పాటు రూపాయి ఖర్చు లేకుండా అప్పు ఇచ్చే అద్భుతమైన సాధనం. ఈ గేమ్ నుంచి బయటపడటానికి 4 స్పష్టమైన రూల్స్ ఇవి:
మొదటి రూల్ (Zero Due Target): “ఈ నెల ఎంత కట్టాలి?” అని కాకుండా, “ఈ బిల్లును పూర్తిగా (Total Amount Due) ఎలా క్లోజ్ చేయాలి?” అని మాత్రమే ఆలోచించండి.
రెండో రూల్ (Convert to EMI): ఒకేసారి పూర్తి బిల్లు కట్టలేకపోతే, Minimum Due కట్టి ఊరుకోకండి. వెంటనే ఆ మొత్తాన్ని EMIగా మార్చండి. EMI వడ్డీ (14%-18%) క్రెడిట్ కార్డ్ వడ్డీ (40%) కంటే చాలా తక్కువ.
మూడో రూల్ (Statement Check): స్టేట్మెంట్ రాగానే కేవలం ‘Minimum Due’ చూడకుండా, Interest Charged ఎంత పడిందో చూడటం అలవాటు చేసుకోండి.
నాలుగో రూల్ (Auto-Debit): వీలైతే ‘Total Amount Due’ అమౌంట్‌కు ఆటో-డెబిట్ సెట్ చేయండి. గడువు తేదీ మర్చిపోయే సమస్య ఉండదు.
చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే…
క్రెడిట్ కార్డు బిల్లు మిమ్మల్ని ఒకేరోజులో రోడ్డుపైకి తీసుకురాదు. కానీ ప్రతి నెలా ‘Minimum Due’ అనే చిన్న బటన్ నొక్కే అలవాటు… మీ సంపాదన వేగం కంటే మీ డబ్బు పోయే వేగాన్ని పెంచుతుంది.
తర్వాతిసారి మీ ఫోన్లో “Your Credit Card Statement is Ready” అని నోటిఫికేషన్ వస్తే… ఆ చిన్న మినిమమ్ అమౌంట్‌ను ఊరటగా చూడకండి. అది మీ ఆర్థిక భవిష్యత్తును హెచ్చరిస్తున్న అలారం అని గుర్తించండి!








