భగ్గుమంటున్న చమురు ధరలు.. సంక్షోభంలో ప్రపంచదేశాలు..!
పశ్చిమాసియా సంక్షోభంతో చమురు ధరలు మండిపోతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కాస్తా.. చమురు ధరల్ని మరింతగా పెంచుతోంది. దీనికి తోడు హర్మూజ్ పై ఆధిపత్యానికి ఆ రెండు దేశాల ప్రయత్నాలతో.. చమురు రవాణ బాగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం అన్ని దేశాలు చమురు కంటైనర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి.
బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ఆరు వారాల గరిష్ఠానికి చేరింది. గురువారం ఉదయం బ్యారెల్ ధర (Oil Prices) 1.5శాతానికి పైగా పెరిగి 95 డాలర్లు దాటి ట్రేడ్ అవుతోంది. ఇక, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ బ్యారెల్ ధర 88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ఒక్క నెలలో బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటివరకు దాదాపు 30శాతం పెరగడం గమనార్హం. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు మంటలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాకర్లపై హూతీలు దాడులు చేశారు. దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు హర్మూజ్ లోనూ రవాణ నిలిచిపోవడం.. మరోవైపు ఎర్రసముద్రంలో హుతీల దాడులు వెరసి.. చమురు సంక్షోభం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దీంతో ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి.








