అమెరికా-సౌదీ మధ్య అణు ఒప్పందం…!
అమెరికా-ఇరాన్ మధ్య భీకరపోరు జరుగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పౌర అణు అవసరాల కోసం సౌదీ అరేబియాకు యురేనియం ఇచ్చేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఈ క్రమంలో యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని సౌదీ అరేబియా సమకూర్చుకునేందుకు ఆ దేశంతో 30 ఏళ్లపాటు అమల్లో ఉండే ఒప్పందానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, సౌదీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్‌లు దీనిపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం పూర్తిగా శాంతియుత అవసరాల కోసం ఉద్దేశించబడింది. శిలాజ ఇంధనాలపై (ఆయిల్) ఆధారపడటాన్ని తగ్గించుకుని, స్వచ్ఛమైన అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సౌదీ అరేబియా ప్రధాన లక్ష్యం. అమెరికా సాంకేతికత సాయంతో సౌదీ అరేబియా తన సొంత గడ్డపై యురేనియం శుద్ధి కేంద్రాన్ని (Uranium Enrichment Facility) ఏర్పాటు చేసుకునేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమానికి అనుమతించడం అమెరికా విదేశాంగ విధానంలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు.
అమెరికా అటామిక్ ఎనర్జీ యాక్ట్‌లోని ‘సెక్షన్ 123’ కింద ఈ ఒప్పందం కుదిరింది.దీని ద్వారా అమెరికాకు చెందిన ప్రముఖ అణు ఇంధన సంస్థలు… సౌదీలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమం అయింది. అలాగే చైనా, రష్యాలు ఈ ప్రాంతంలో అడుగుపెట్టకుండా అమెరికా అడ్డుకోగలుగుతుంది.
ఈ ఒప్పందం అణుబాంబు తయారీ కోసం కానప్పటికీ, భవిష్యత్తులో సౌదీ అరేబియా సొంతంగా యురేనియం శుద్ధి చేసుకుంటే అది.. అణ్వాయుధాల తయారీకి దారితీయవచ్చని అమెరికా ప్రతిపక్ష చట్టసభ్యులు , ఇజ్రాయెల్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా అమెరికా ఇతర దేశాలతో చేసుకునే అణు ఒప్పందాల్లో భాగస్వామ్య దేశాలు సొంతంగా యురేనియం సుసంపన్నం చేయడాన్ని నిషేధించే “గోల్డ్ స్టాండర్డ్” నిబంధన ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో ఆ కఠిన నిబంధన లేకపోవడం గమనార్హం.ఈ ఒప్పంద పత్రాలను తదుపరి సమీక్ష కోసం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ముందుకు పంపనున్నారు.








