పీఓకే ప్రధాని కావాలని ఉంది.. ఎన్నికల వేళ నవాజ్ పొలిటికల్ స్టంట్..!
పీఓకే ఉద్రిక్తతల వేళ అక్కడి ప్రజల ఓట్లను గెల్చుకునేందుకు పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆ దిశగా పీఎంఎల్-ఎన్ పార్టీ సుప్రీం నవాజ్ షరీఫ్.. ఓ అడుగు ముందుకేశారు. తనకు అజాద్ కాశ్మీర్ అంటే చాలా ఇష్టమన్న ఆయన.. తమ పూర్వికులు అక్కడి నుంచి వచ్చారని గుర్తు చేసుకున్నారు.తమ పార్టీ గెలిచి, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కోరి మరీ ..తాను అజాద్ కాశ్మీర్ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమంటూ ప్రకటించారు.
పీఓకే ప్రాంత అభివృద్ధిని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ తనకు ఎంత ముఖ్యమో పీఓకే కూడా అంతే ప్రాధాన్యత కలిగినదని వ్యాఖ్యానించారు. తమ పూర్వీకులు కశ్మీర్ ప్రాంతం నుంచే వలస వచ్చారని, అందుకే పీఓకే తనకు రెండో స్వగ్రామంతో సమానమని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను ప్రధానిని కాకపోయినా ప్రతి మూడు నెలలకోసారి అక్కడ పర్యటించి అభివృద్ధి పనులను సమీక్షిస్తానని హామీ ఇచ్చారు.
అయితే, నవాజ్ షరీఫ్ ఈ తరహా ప్రకటనలు చేయడం వెనుక పీఓకేలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నిరసనలే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, విపరీతమైన విద్యుత్ ఛార్జీలు, వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) ఆధ్వర్యంలో పీఓకే వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్బంధ చర్యలు, ఘర్షణల కారణంగా ఇప్పటివరకు అక్కడ 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల తీవ్ర ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే నవాజ్ షరీఫ్ ఇలాంటి హామీల డ్రామాడుతున్నారని భావిస్తున్నారు.
మరోవైపు, పీఓకేలో జరుగుతున్న ఈ పరిణామాలపై భారతదేశం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని తేల్చిచెప్పింది. అక్కడ పాకిస్థాన్ అక్రమంగా, బలవంతంగా భూభాగాలను ఆక్రమించిందని, ఆక్రమిత ప్రాంతాల్లో పాక్ నిర్వహించే ఎలాంటి ఎన్నికలను లేదా అక్కడి తాత్కాలిక అసెంబ్లీలను భారత్ గుర్తించదని స్పష్టం చేసింది.








