నోలన్ నెక్ట్స్ మూవీ ఇదేనా? 17 ఏళ్ల క్రితం ఆగిపోయిన సైకో-థ్రిల్లర్ మళ్లీ ఆన్ ఫైర్!
–సూర్య ప్రకాష్ జోశ్యుల
హాలీవుడ్ విజనరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వారంలోనే రికార్డు వసూళ్లతో నోలన్ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. అయితే, ప్రస్తుతం హాలీవుడ్ వర్గాల్లో ‘ది ఒడిస్సీ’ కలెక్షన్ల కంటే ఎక్కువగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే క్రిస్టోఫర్ నోలన్ తదుపరి సినిమా ఏంటి?
మళ్లీ ఏదైనా మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో వస్తారా? లేక దాదాపు రెండు దశాబ్దాలుగా పక్కనపడి ఉన్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ను బయటకు తీస్తారా? ఇదే డిస్కషన్ ఆయన అభిమానుల మధ్య సోషల్ మీడియాలో నడుస్తోంది.
మామూలుగా నోలన్ సినిమా అంటే ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అదొక గ్లోబల్ ఈవెంట్. ప్రస్తుతం ఆయన సక్సెస్ ని ఆస్వాదిస్తున్నప్పటికీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నెటిజన్లను, ఆయన అభిమానులను తీవ్రంగా ఆలోచనలో పడేసింది.
“ది ఒడిస్సీ మేకింగ్ నా స్టామినా సరిహద్దులను పరీక్షించింది” అని నోలన్ ఓపెన్‌గా చెప్పారు. అంతేకాదు, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి రావడానికి కనీసం మూడేళ్లు పడుతుందని సంకేతాలిచ్చారు.ఈ గ్యాప్ వార్త బయటకు రాగానే.. సోషల్ మీడియా, రెడ్డిట్, హాలీవుడ్ ఫిల్మ్ ఫోరమ్‌లలో ఒక పాత మిస్టరీ మళ్లీ వైరల్ అవ్వడం ప్రారంభమైంది. నోలన్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా దాదాపు 17 ఏళ్ల క్రితం ఆగిపోయిన ‘ది ప్రిజనర్’ (The Prisoner) ను మళ్లీ చేతిలోకి తీసుకోబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది.
అదే… ‘ది ప్రిజనర్’ (The Prisoner).
2006 ప్రాంతంలో ‘డార్క్ నైట్’ కంటే ముందే నోలన్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో గట్టిగా వినిపించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, ప్రాజెక్ట్ సైలెంట్‌గా పక్కకెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మూడేళ్ల గ్యాప్ అనౌన్స్ చేయగానే, అభిమానులు మళ్లీ ఆ పాత రికార్డునే ప్లే చేయడం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి
అసలేమిటీ ‘ది ప్రిజనర్’?
చాలామంది ఇది ఒక సినిమా అనుకుంటారు.. కానీ కాదు! ఇది 1967లో వచ్చిన ఒక బ్రిటీష్ కల్ట్ టీవీ సిరీస్. ఈ కథ మొత్తం ఒకే ఒక్క విచిత్రమైన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది.
ఒక సీక్రెట్ గూఢచారి (స్పై) అకస్మాత్తుగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అతనికి తెలియకుండానే ఎవరో కిడ్నాప్ చేసి, ఒక వింతైన గ్రామంలో పడేస్తారు. అక్కడ ఎవరికీ పేర్లు ఉండవు.. అందరినీ కేవలం నంబర్లతోనే పిలుచుకుంటారు. మన హీరోకి ఇచ్చిన నంబర్ ‘నెంబర్ 6’ (Number 6).
అతడిని ఆ గ్రామం నుంచి బయటకు వెళ్లనివ్వరు. “నువ్వు రాజీనామా ఎందుకు చేశావ్? నీ దగ్గర ఉన్న రహస్యాలు ఏంటి?” అని తెలుసుకోవడానికి ప్రతిరోజూ అతనిపై రకరకాల మైండ్ గేమ్స్, సైకోలాజికల్ టార్చర్ పెడుతుంటారు. ఆ గ్రామాన్ని శాసించే అధిపతి ప్రతి ఎపిసోడ్లో అడిగే ఒకే ఒక్క ప్రశ్న: “నువ్వెవరు?”
‘మెమెంటో’తో జ్ఞాపకాలను, ‘ఇన్సెప్షన్’తో కలలను, ‘టెనెట్’తో కాలాన్ని సినిమాలుగా చేసి ఆడుకున్న నోలన్ మార్క్ మేకింగ్‌కి ఇది అచ్చమైన రా మెటీరియల్. అందుకే అప్పట్లో ఈ కాన్సెప్ట్ వినగానే సినిమా లవర్స్ పిచ్చెక్కిపోయారు. కానీ, ఇతర భారీ ప్రాజెక్టుల వల్ల ఆ ఫైల్ అట్కెక్కేసింది.
గాసిపా? లేక నిజంగానే మొదలవుతుందా?
‘ది ఒడిస్సీ’ లాంటి భారీ హిస్టారికల్ ఎపిక్ తర్వాత నోలన్ మళ్లీ ఒక కాన్సెప్ట్-డ్రివెన్ పీరియడ్ థ్రిల్లర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అంచనా. ఆ కోణంలో చూస్తే ‘ది ప్రిజనర్’ కంటే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ మరొకటి ఉండదు.
అయితే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ముద్ర పడలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో నోలన్ ఫ్యాన్స్ మైండ్ లో నడుస్తున్న ఫాంటసీ కావచ్చు. కానీ రెండు దశాబ్దాలు గడిచినా, ఒక డైరెక్టర్ నెక్స్ట్ మూవీ గురించి ఇన్ని థియరీలు రావడమే నోలన్ బ్రాండ్ వాల్యూ ఏంటో చెప్తోంది!








