వైభవ్ సూర్యవంశి ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
భారత యువ బ్యాటింగ్ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒడిదొడుకులపై తొలిసారి నోరు విప్పాడు. జింబాబ్వేతో గురువారం నుండి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ టీవీ (BCCI.TV) తో మాట్లాడిన ఆయన, గత నాలుగు నెలలుగా తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదని, జింబాబ్వే టూర్లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసాడు.`
ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన వైభవ్ సూర్యవంశీ, ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేశారు. అయితే వరుసగా మూడు మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో, ఐదో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుని వైభవ్‌ను పక్కన పెట్టారు. ఈ సిరీస్‌ను భారత్ 0-4తో ఘోరంగా ఓడిపోయింది. కేవలం మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన ఒక 15 ఏళ్ల కుర్రాడిని అంత తొందరగా జట్టు నుండి ఎలా తొలగిస్తారంటూ పలువురు మాజీ క్రికెటర్లు టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
ఆ సమయంలో వైభవ్ భావోద్వేగానికి లోనైనప్పటికీ, కోచ్‌లు మరియు సహచర ఆటగాళ్లు ఇచ్చిన మద్దతుతో తిరిగి పుంజుకున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే హరారే గ్రౌండ్లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, “ఈ పిచ్‌లు మరియు ఇక్కడి పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. నాలుగు నెలల క్రితం మేము ఇక్కడే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాము, మళ్లీ అదే గ్రౌండ్లోకి సీనియర్ టీమ్ తరపున రావడం ఒక గొప్ప అనుభూతి. గతంలో ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఈ సిరీస్‌లో ఉపయోగించి టీమిండియా విజయాల్లో నా వంతు సహకారం అందిస్తాను” అని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.








