వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడికి షాక్..!
కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు Sidiri Appalaraju) కుమారుడు సీదిరి ఆరవ్ వర్మకు న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన ఈ కేసులో ఆరవ్ వర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోంపేట ఆరో అదనపు జడ్జి కోర్టు బుధవారం పూర్తిగా తిరస్కరించింది. నిందితుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక నిరుపేద ప్రాణం పోయిన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఇటీవల కాశీబుగ్గ పరిధిలో ఆరవ్ వర్మ నడిపిన బైక్ బలంగా ఢీకొట్టడంతో గొర్రెల కాపరి దానయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంపై స్థానికుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరవ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌లో జైల్లో ఉన్నాడు. తమ బిడ్డకు బెయిల్ ఇప్పించుకోవాలని సీదిరి అప్పలరాజు కుటుంబం చేసిన ప్రయత్నాలు ప్రస్తుతానికి విఫలమయ్యాయి. మరోవైపు, ఈ ప్రమాద ఘటన మరియు దాని తదనంతర పరిణామాల నేపథ్యంలో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కోర్టును ఆశ్రయించారు.
ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ (Anticipatory Bail) పిటిషన్‌పై సోంపేట కోర్టులో బుధవారం విచారణ జరిగింది. అయితే, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికే బాధిత దానయ్య కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించి అండగా నిలవగా, న్యాయస్థానంలో కూడా నిందితుడికి బెయిల్ నిరాకరించడం శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.








