డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డికి ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు అందజేత
టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, టీటీఏ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ఇలాంటి అవార్డులు రాజకీయ నాయకులకు, నటులకు ఇస్తుంటారని, తనను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. టీటీఏ, ఆటా నిర్వాహకుల మర్యాదలు, వారు కల్పించిన వాతావరణం తనకు తెలంగాణలో ఉన్న భావనను కలిగించాయని, ఐదు రోజుల సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించడం సరైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.
తన కెరీర్ ప్రారంభంలో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి అవకాశాన్ని వదులుకుని, భారత్కి తిరిగి వచ్చి గ్యాస్ట్రో ఎంటరాలజీలో విశేష కృషి చేసిన వైనాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కేవలం 50 మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు మాత్రమే ఉన్న భారత్లో, ఇవాళ 10వేల మందికి పైగా వైద్యులను తయారు చేయడం గర్వకారణమని చెప్పారు. తనను అప్పట్లో భారత్కి ఎందుకు వెళ్తున్నారని విమర్శించిన అదే అమెరికన్ ప్రొఫెసర్, ఇవాళ తన విద్యార్థులను శిక్షణ కోసం భారత్కి పంపిస్తున్నారని చెప్పడం తన విజయానికి నిదర్శనం అన్నారు.
యువతకు సందేశాన్ని ఇస్తూ, భారత్లో మౌలిక సదుపాయాలు, అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని, కేవలం వైద్య రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఇండియా వేగంగా ఎదుగుతోందని చెప్పారు. అమెరికాలో ఉన్నప్పటికీ, భారత్కి వచ్చి తమవంతు కృషి చేయాలని, పరిశోధనలు చేయడం ద్వారా ప్రపంచానికి మన సత్తా చాటాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.








