జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా స్పర్శ్ హాస్పిస్‌లో దేశంలోనే తొలి ప్రత్యేక న్యూరో-పాలియేటివ్ కేర్ వార్డు ప్రారంభం
సీజీహెచ్ఎస్లో హాస్పిస్, పాలియేటివ్ కేర్ సేవలను చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 19, 2026: కేంద్ర కేబినెట్ మంత్రి శ్రీ G. Kishan Reddy ఆదివారం ఖాజాగూడలోని స్పర్శ్ హాస్పిస్‌లో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యూరో-పాలియేటివ్ కేర్ వార్డును ప్రారంభించారు.
అధునాతన నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ దీర్ఘకాలిక నర్సింగ్, పాలియేటివ్ సంరక్షణ అవసరమైన రోగులకు అందుబాటు ధరలో, నాణ్యమైన, కరుణతో కూడిన ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు ఈ 8 పడకల న్యూరో-పాలియేటివ్ కేర్ వార్డును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ జి. కిషన్ రెడ్డి స్పర్శ్ హాస్పేస్ సందర్శించి వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడారు. స్పర్శ్ హాస్పిస్ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, “ఇది అద్భుతమైన మానవతా సేవ” అని కొనియాడారు.
“బంజారాహిల్స్‌లో ఉన్న స్పర్శ్ హాస్పిస్ను నేను గతంలో సందర్శించాను. ఇప్పుడు ఈ సంస్థ మరింత విస్తరించి ఇంత గొప్ప సేవలను అందించడం ఆనందంగా ఉంది. దేశంలోని ప్రతి నగరంలో ఇలాంటి పాలియేటివ్ కేర్ కేంద్రాలు ఏర్పడాలి. జీవిత చరమాంకంలో ఉన్న రోగులు గౌరవప్రదంగా, సౌకర్యవంతంగా, మానవీయ సేవల మధ్య తమ చివరి రోజులు గడిపే అవకాశం కలగాలి,” అని ఆయన అన్నారు.
సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాలియేటివ్ కేర్ సేవలు సమాజంలోని ప్రతి వర్గానికి అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఇవి కూడా చదవండి
“కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) పరిధిలో హాస్పిస్, పాలియేటివ్ కేర్ సేవలను చేర్చాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా గౌరవప్రదమైన జీవితాంత సంరక్షణ పొందగలుగుతారు. పాలియేటివ్ కేర్ అనేది జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు; రోగులకు గౌరవం, సౌకర్యం, మెరుగైన జీవన నాణ్యతను అందించడమే కాకుండా వారి కుటుంబాలకు కూడా అండగా నిలుస్తుంది,” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్పర్శ్ హాస్పిస్ యాజమాన్యం సమర్పించిన వినతిపత్రాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
దేశంలో పాలియేటివ్ కేర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ న్యూరో-పాలియేటివ్ కేర్ వార్డు ఒక కీలక ముందడుగని ఆయన అభినందించారు.
న్యూరాలజిస్టు డా. అనిత కోఠా, అనస్థీషియాలజిస్ట్ మరియు పాలియేటివ్ కేర్ నిపుణులు డా. ఎస్.కె.వి. రాజు మాట్లాడుతూ, స్ట్రోక్‌లు, ముదిరిన డిమెన్షియా, పార్కిన్సన్స్ వ్యాధి, న్యూరోపతీలు, వెన్నెముక సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక న్యూరో-పాలియేటివ్ కేర్ అవసరం కూడా పెరుగుతోందన్నారు.
ఇలాంటి రోగుల్లో చాలా మంది మంచానికే పరిమితమవుతారని, వారికి 24 గంటల నర్సింగ్ సంరక్షణ, ఆహారం అందించడం, నొప్పి నియంత్రణ, ప్రెజర్ సోర్స్ నివారణ, ఇతర లక్షణాల నిర్వహణ వంటి సేవలు అవసరమవుతాయని తెలిపారు. దీనివల్ల కుటుంబాలపై తీవ్ర శారీరక, మానసిక, ఆర్థిక భారం పడుతోందన్నారు.
“ఇలాంటి రోగుల సంఖ్య పెరుగుతుండటంతో పునరావాస కేంద్రాలు, దీర్ఘకాలిక సంరక్షణ కేంద్రాలు పెరుగుతున్నాయి. అయితే వాటి ఖర్చు చాలా కుటుంబాలకు అందుబాటులో లేదు. అందుకే స్పర్శ్ హాస్పిస్ రోజుకు నామమాత్రపు చార్జీతో ఈ ప్రత్యేక న్యూరో-పాలియేటివ్ కేర్ సేవలను ప్రారంభించింది. శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది ద్వారా రోగులకు 24 గంటల సమగ్ర సంరక్షణ అందుతుంది. కుటుంబ సభ్యులు లేదా అటెండర్లు నిరంతరం ఉండాల్సిన అవసరం ఉండదు. దీంతో కుటుంబాలపై సంరక్షణ భారం గణనీయంగా తగ్గుతుంది,” అని వారు తెలిపారు.
ఈ సందర్భంగా స్పర్శ్ హాస్పిస్ యాజమాన్యం కేంద్ర మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) పరిధిలో హాస్పిస్, పాలియేటివ్ కేర్ సేవలను చేర్చడంతో పాటు, స్వతంత్ర హాస్పిస్ సంస్థలకు సీజీహెచ్ఎస్ గుర్తింపు (ఎంపానెల్మెంట్) కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని కోరింది.
82 పడకల సామర్థ్యంతో దేశంలోని అతిపెద్ద స్వతంత్ర హాస్పిస్ సంస్థల్లో ఒకటైన స్పర్శ్ హాస్పిస్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు వర్తించే ప్రస్తుత సీజీహెచ్ఎస్ ప్రమాణాల కారణంగా ఎంపానెల్మెంట్ పొందలేకపోతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. హాస్పిస్ సేవలు చికిత్స కంటే జీవితాంత సంరక్షణ, నొప్పి నివారణ, రోగి గౌరవాన్ని కాపాడడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తాయని వివరించారు.
2011లో రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థాపించబడిన స్పర్శ్ హాస్పిస్ ఇప్పటివరకు 16,500 మందికిపైగా రోగులు, వారి కుటుంబాలకు సేవలు అందించింది. వీరిలో 90 శాతం మందికి పైగా పూర్తిగా ఉచితంగా సేవలు అందించారు. ప్రస్తుతం ప్రతి నెలా ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్, హోమ్ కేర్ సేవల ద్వారా సుమారు 600 మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తోంది.
సీజీహెచ్ఎస్ పరిధిలో స్వతంత్ర హాస్పిస్ సంస్థలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తే తెలంగాణలోని వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పాలియేటివ్ కేర్, నొప్పి నివారణ, మానసిక సలహా, జీవితాంత సంరక్షణ సేవలను పొందగలరని, అలాగే తృతీయ స్థాయి ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని యాజమాన్యం పేర్కొంది.
ఈ న్యూరో-పాలియేటివ్ కేర్ వార్డు దీర్ఘకాలిక నాడీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందించడంతో పాటు, వారి కుటుంబాలపై ఉన్న సంరక్షణ భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఈ కార్యక్రమంలో డా. ఎం. సుబ్రహ్మణ్యం, జగదీష్ రామడుగు, ప్రణతి రెడ్డి, మనోహర్ రెడ్డి, అనూప్ అగర్వాల్, బబితా జబాఖ్, వైద్యులు, ఆరోగ్య నిపుణులు, ట్రస్టీలు, దాతలు, రోటరీ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.








