కాంగ్రెస్లో నామినేటెడ్ పోస్టుల లొల్లి!
తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా.. కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. గద్దెనెక్కిన కొత్తలోనే పదవులు లభిస్తాయని ఆశపడ్డ క్షేత్రస్థాయి నాయకులకు.. ఈ కాలయాపన మింగుడుపడటం లేదు. తాజాగా మరో 37 కార్పొరేషన్ ఛైర్మన్ల పదవీకాలం ముగియడంతో గాంధీభవన్లో రాజకీయం మరింత వేడెక్కింది. పాతవారికి రెన్యువల్ ఇస్తారా లేక కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తారా అన్న ఉత్కంఠతో పాటు.. ఈ జాప్యానికి అసలు బాధ్యులెవరనే కోణంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వైఖరే కారణమని పార్టీలోని ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. పార్టీ తరఫున ప్రభుత్వంపై సరైన ఒత్తిడి తేవడంలో, నిరంతర ఫాలోఅప్ చేయడంలో నాయకత్వం విఫలమైందన్నది వారి ప్రధాన ఆరోపణ. పదవుల కాలపరిమితి ముగిసి, రెన్యువల్స్పై స్పష్టత రావలసిన కీలక సమయంలో అధినేత అందుబాటులో లేకపోవడం వల్లే సమస్య చిక్కుముడిగా మారిందని గాంధీభవ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అయితే, ఈ విమర్శలను పీసీసీ తీవ్రంగా ఖండిస్తోంది. పదవులు సాధించాక పార్టీని, క్షేత్రస్థాయి శ్రేణులను పట్టించుకోని వారికి మళ్లీ అవకాశం ఇచ్చేది లేదని మహేష్ గౌడ్ స్పష్టం చేయడమే ఈ అసంతృప్తికి అసలు కారణమని పీసీసీ వర్గాలు అంటున్నాయి. నామినేటెడ్ పదవి లభించిన తర్వాత కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే రెన్యువల్స్ ఉంటాయని, పనిచేయని వారికి చెక్ పెట్టాలనే సీరియస్ నిర్ణయం వల్లే కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేస్తున్నాయి.
ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఒకే మాటపై ఉన్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీలో పూర్తిస్థాయి పారదర్శకత, పనితీరు ఆధారంగానే ఎంపిక ఉండాలని భావిస్తున్నారు. అందుకోసం ఒక నయా ఫార్ములాను అమలు చేయాలని యోచిస్తున్నారు. సుదీర్ఘకాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న కొత్త నాయకులతో ముందుగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులను భర్తీ చేయాలనుకుంటున్నారు. కొత్తవారి ఎంపిక పూర్తయిన రెండు నెలల తర్వాత మాత్రమే పాతవారి రెన్యువల్స్పై చర్చించనున్నారు. ఇలా చేయడం వల్ల ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులకు తక్షణ ఊరట లభిస్తుందని పార్టీ యోచిస్తోంది.
ప్రస్తుతం తలెత్తిన చిక్కుముడిని విప్పేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగుతోంది. ఈ వారంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ కీలక సమావేశంలోనే నామినేటెడ్ పోస్టుల జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే నామినేటెడ్ పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేసి ఉంటే ఇప్పుడు ఈ గందరగోళం ఉండేది కాదనేది మెజారిటీ నాయకుల అభిప్రాయం. జరిగిందేదో జరిగిపోయినా.. ఇప్పటికైనా అధిష్ఠానం చొరవ తీసుకుని, నిజమైన కార్యకర్తలను గుర్తించి త్వరితగతిన పోస్టులను నింపాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి








